vijayakanth dmdk aiadmk bjp tamil nadu chennai tamil nadu assembly elections 2021 విజయకాంత్ డీఎండీకే ఏఐఏడీఎంకే బీజేపీ తమిళనాడు చెన్నై politics
బీజేపీ కూటమికి షాకిచ్చిన విజయ్‌కాంత్: కమల్, దినకరన్ పార్టీల్లో నో ఛాన్స్? ఒంటరిపోరేనా?
చెన్నై: కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయి. ఏఐఏడీఎంకే (అన్నాడీఎంకే), బీజేపీ కూటమితో కలిసి పోటీ చేయాలనుకున్న ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం(డీఎండీకే) పార్టీ అధినేత విజయకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సీట్ల పంపకాలు: బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి విజయ్ కాంత్ గుడ్‌బై
అన్నాడీఎంకేతో సీట్ల పంపకం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే విజయకాంత్ పార్టీ.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి ఆకస్మాత్తుగా బయటికి రావడానికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల క్రితమే అన్నాడీఎంకే, బీజేపీ తమ సీట్ల పంపకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేయాలనుకున్న డీఎండీఎంకేకు కోరిన నియోజకవర్గాలను కేటాయించకపోవడం, ఆశించిన స్థానాలను ఇవ్వకపోవడంతోనే విజయకాంత్ ఆ కూటమి నుంచి తప్పుకున్నారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తన కథనంలో పేర్కొంది.

కమల్, దినకరన్ పార్టీల్లో విజయ్‌కాంత్‌కు ఛాన్స్ లేనట్లే..
ఇక కొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో డీఎండీకే పార్టీ ఏఎంఎంకే(దినకరన్ పార్టీ) లేదా ఎంఎన్ఎం పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయామ్(ఎంఎన్ఎం) ఇప్పటికే తమ కూటమి పార్టీలతో కలిసి సీట్ల పంపకాలను చేసేసింది. దినకరన్ పార్టీ కూడా తమ కూటమి పార్టీలతో సీట్లను పంచుకుంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ 154 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగితా 80 సీట్లను తమ కూటమి పార్టీలైన ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి(ఏఐఎస్ఎంకే) , ఇందియా జననాయక కచ్చి(ఐజేకే)లకు కేటాయించింది.

విజయకాంత్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనా?
జయలలిత అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న సమయంలో అన్నాడీఎంకే, డీఎండీకే కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత మళ్లీ విడిపోయాయి. జయలలిత మరణాంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ అన్నాడీఎంకేతో-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేశారు విజయకాంత్. ఆ ఎన్నికల్లో డీఎండీకేకు నాలుగు ఎంపీ సీట్లు కేటాయించారు. అప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, పీటీ, ఎన్ జేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ముందస్తుగానే సీట్ల పంపకాలు చేసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో విజయ్ కాంత్ పార్టీకి కూడా నాలుగు సీట్లు కేటాయించారు. అయినా కూటమికి విజయ్ పార్టీతో ప్రయోజనం పెద్దగా ఏమి ఒరగలేదని చెప్పాలి. ఇక, 2014 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 39 స్థానాల్లో పోటీ చేసి 37 స్థానాలను గెలుచుకోగా.. విజయకాంత్ డీఎండీకే పార్టీ మాత్రం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ప్రస్తుతం ఏ కూటమిలో చేరే అవకాశం లేకపోవడంతో ఒంటరిగానే విజయకాంత్ బరిలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.