ఖుష్బూ సుందర్‌కు కరోనా పాజిటివ్: తమిళనాడులో 16న సంపూర్ణ లాక్డౌన్
చెన్నై: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా కూడా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ప్రముఖ సీనియర్ నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
'మొత్తానికి కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్‌ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కోవిడ్ నన్ను చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ప్రస్తుతం కరోనా లక్షణాలు రావడంతో టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా ఉంది. కానీ, తప్పదు కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి. అలాగే మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోండి' అంటూ ఖుష్బూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కాగా, దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాగా, ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సినీ ప్రముఖులు మంచు లక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్ ... ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పూర్తి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. పొంగల్ తర్వాత తమిళనాడులో లాక్డౌన్ విధించే అవకాశాన్ని తోసిపుచ్చారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్. ప్రభుత్వం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను అనుసరించడం, కోవిడ్ -19 యొక్క ప్రస్తుత దృష్టాంతాన్ని పరిష్కరించడానికి మాస్కులు ధరించడం సరిపోతుందని అన్నారు.
కాగా, తమిళనాడు ప్రభుత్వం సోమవారం ప్రస్తుత కోవిడ్ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించింది, కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జనవరి 14 నుంచి 18 వరకు మతపరమైన ప్రార్థనా స్థలాలలోకి ప్రవేశాన్ని పరిమితం చేస్తూ తాజా ఆంక్షలు విధించింది. జనవరి 6 నుంచి విధించిన రాత్రి కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని, జనవరి 16 (ఆదివారం) పూర్తి లాక్డౌన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
తమిళనాడులో సోమవారం 13,990 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, దీంతో క్రియాశీల కేసులు 62,767కి పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 12,895 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.