నమ్మకం ఉంది, కుట్రలు పని చెయ్యవు, ఓటర్లు మూర్ఖులు కాదు, విజయం నాదే: సుమలత !
బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన తనను ప్రజలు అభిమానంతో గెలిపిస్తారనే నమ్మకం ఉందని బహుబాష నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత అన్నారు. మండ్య ప్రజలు మోసపోకుండా ఎంతో ఆలోచించి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఓటు వేశారని సుమలత ధీమా వ్యక్తం చేశారు. మండ్య ప్రజలు తనను ఆదరించారనే విశ్వాసం తనకు ఉందని సుమలత వివరించారు. మండ్యలో ఎన్నికలు పూర్తి అయిన తరువాత స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత మీడియాతో మాట్లాడారు.

సంతోషంగా ఉంది
మండ్య లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు తాను ఓటు వేసుకున్నందుకు చాల సంతోషంగా ఉందని సుమలత అన్నారు. మండ్యలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తాను అధికార పార్టీ నాయకులతో పోరాటం చేశానని, ప్రజలు తనకు అండగా నిలిచారని సుమలత చెప్పారు.

ఓటర్లు మూర్ఖులు కాదు
మండ్య ప్రజలు చాల బుద్దిమంతులు, వాళ్లు మూర్ఖులు కాదని, ఎంతో ఆలోచించి ఎవరికి ఓటు వెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారని సుమలత అన్నారు. మండ్య ప్రజలు తనకు మోసం చెయ్యలేదనే నమ్మకం ఉందని, ఇక్కడితో కథ క్లైమాక్స్ కు వచ్చిందని సుమలత వివరించారు. తన మీద మండ్య ప్రజలు ఎంతో అభిమానం చూపించారని సుమలత అభిప్రాయం వ్యక్తం చేశారు.

నెగటివ్ పాలిటిక్స్
తన మీద ప్రత్యర్థులు నెగటివ్ పాలిటిక్స్ ప్రయోగించారని, అయితే మండ్య ప్రజలు తన మీద పాజిటివ్ భావనతో ఆదరించారనే నమ్మకం తనకు ఉందని సుమలత అన్నారు. ఇన్ని రోజులు తాను అధికార పార్టీ అభ్యర్థితో పోటీ చేశానని, మండ్య ప్రజలు మాత్రం తననే ఆదరించారనే నమ్మకం తనకు ఉందని సుమలత అభిప్రాయం వ్యక్తం చేశారు.

నమ్మకం ఉంది
కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని ఓటర్లు ఆరోపించారని, అయితే ఎన్నికల అధికారులు న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని సుమలత అన్నారు. మండ్యలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి అనుచరులు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు అక్కడక్కడ పరస్పరం దాడులు చేసుకున్నారు.