కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదోని కుల అహంకార హత్య: ‘మా నాన్న, పెదనాన్న కలిసి నా భర్తను చంపేశారు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆదోని కుల అహంకార హత్య

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు.

కుల అహంకారమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

నెలన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఆడమ్ స్మిత్‌ను ఆయన భార్య మహేశ్వరి బంధువులే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

ఆదోని పట్టణంలోని విట్టా కృష్ణప్ప నగర్‌లో గురువారం సాయంత్రం ఈ హత్య జరిగింది.

తన నాన్న, పెద నాన్న కలిపి ఈ హత్య చేశారని మహేశ్వరి ఆరోపిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల్లో కొందరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆదోని కుల అహంకార హత్య

ఒకే ఊరి నుంచి ప్రేమికులుగా..

కర్నూలు జిల్లాలోని నందవరం మండలం గురజాలకు చెందిన అడమ్ స్మిత్ ఫిజియోథెరపిస్ట్‌గా పని చేసేవారు.

అదే గ్రామానికి చెందిన మహేశ్వరి డిగ్రీ చదివారు. బ్యాంకు ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్నారు.

వీరిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నప్పటికీ మహేశ్వరి కుటుంబీకులు మాత్రం వారి పెళ్లికి అంగీకరించలేదు.

దాంతో చాలాకాలం పాటు వేచి చూసిన తర్వాత చివరకు నవంబర్ 12న ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాన్నట్లు మహేశ్వరి బీబీసీకి తెలిపారు.

ఆదోని కుల అహంకార హత్య

''మా పెళ్లికి చాలా ఆటంకాలు పెట్టారు. అయినా ఒప్పించేందుకు ప్రయత్నించాం. కేవం కులం తక్కువ అనే కారణంగా ఆడమ్ స్మిత్‌ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు.

అయినా మేం స్నేహితుల సహాయంతో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత కూడా మమ్మల్ని వేధించేందుకు సిద్ధపడడంతో కర్నూలులో ఎస్పీ ని కలిశాము. మా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పాం.

ఆ తర్వాత ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత అంతా సర్థుకున్నట్టేనని అనుకున్నాం.

అందుకే ఆదోని వచ్చి విడిగా ఉంటున్నాం.

ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేవారు.

మధ్యాహ్నం డ్యూటీ నుంచి తిరిగి వస్తారని ఎంత సేపు ఎదురుచూసినా అడమ్ ఇంటికి రాకపోయేసరికి ఆస్పత్రిలో ఉన్నాడనే అనుకున్నాను.

కొంత సేపటికి ఫోన్ వచ్చింది, ఆస్పత్రికి తీసుకెళుతున్నారని చెప్పారు. కానీ తీరా చూస్తే అక్కడికి వెళ్లినప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.

పోలీసులు కూడా మాకు రక్షణ కల్పించలేకపోయారు. మా నాన్న, పెదనాన్న కలిపి అడమ్‌ని చంపేశారు. వారిని శిక్షించాలి’’అని ఆమె అన్నారు.

ఆడమ్ స్మిత్

రాడ్డులతో కొట్టి చంపేశారు..

ఆదోని పట్టణంలోని విట్టా కృష్ణప్ప నగరంలో ఈ కొత్త జంట అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది.

రోజు వారీ మాదిరిగానే ఆస్పత్రిలో విధులు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా దారిలో అతని బైకుని అడ్డుకుని దాడికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఆదోనీ టూ టౌన్ సీఐ పి.శ్రీరాములు ఘటనకు సంబంధించిన వివరాలను బీబీసీకి వెల్లడించారు.

''ఆడమ్ స్మిత్ , ఆయన భార్యకు ప్రాణ భయం ఉందని ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడంతో నందవరం, ఎమ్మగనూరు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

అంతా సర్థుకుందని భావించాం. అయితే మధ్యాహ్నం 2.30 సమయంలో ఆస్పత్రి నుంచి వస్తుండగా దారిలో కాపుకాచిన కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అది గమనించి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ వదలకుండా వెంటాడారు. కొంతదూరం పరుగుపెట్టి కిందపడియిన ఆడమ్‌ని రాడ్డులు, బండరాయితో కొట్టి చంపినట్టు నిర్ధారణ అయ్యింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. మహేశ్వరి, కుటుంబ సభ్యుల ఫిర్యాదులు తీసుకున్నాం. విచారణ సాగుతోంది. నిందితులను పట్టుకుంటాం.

ఐపీసీ సెక్షన్లు 302,325తో పాటుగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా నమోదు చేశాం’’అని ఆయన వివరించారు.

ఆదోని కుల అహంకార హత్య

మా కుటుంబంలో చదువుకున్నది ఒక్కడే..

ఆడమ్ స్మిత్ ఒక్కడే తన కుటుంబంలో విద్యావంతుడు.

గురజాలకు చెందిన చిన లాజర్, సువార్తమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న అడమ్ తమను ఆదుకుంటాడని భావించామని తండ్రి చిన లాజర్ అంటున్నారు.

''మాది తక్కువ కులం అని పెళ్ళికి ఒప్పుకోలేదు. పోనీ వాళ్లే వెళ్లిపోయి పెళ్లి చేసుకుని జీవిస్తున్నారని అనుకున్నాం.

కానీ ఇప్పుడు ఏకంగా మా బిడ్డను చంపేశారు. మాకు దిక్కెవరు. కొత్త సంవత్సరం కోసం కేక్ తీసుకుని ఇంటికి వస్తుండగా దారికాచి చంపేసిన వాళ్లని వదలకూడదు. ఊళ్లో చాలామంది చెప్పారు.. పోలీసులు కూడా మా కుటుంబాన్ని, వాళ్లని కూర్చోబెట్టి వివరించారు.

అయినా మారకుండా ఇలా తెగిస్తారని అనుకోలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి?’’ అంటూ వాపోయారు.

ఆదోని కుల అహంకార హత్య

పోలీసుల నిర్లక్ష్యమే..

ఎస్సీల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకుడు ఆనంద్ బాబు అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''ఆదోని ఘటనతో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని అర్థమవుతోంది. అనంతపురంలో స్నేహలతను మట్టుబెట్టిన ఘటన జరిగి వారం రోజులు కూడా కాలేదు.

ఈలోగా తమకు ప్రాణ రక్షణ కల్పించమని ఎస్పీని వేడుకున్న తర్వాత కూడా పోలీసులు తగిన రీతిలో స్పందించలేదు. కేవలం కౌన్సిలింగ్ పేరుతో స్టేషన్లో మాట్లాడి పంపించి చేతులు దులుపుకున్నారు.

మహేశ్వరి తండ్రి, బంధువుల మీద పోలీసులు ఎందుకు నిఘా పెట్టలేదు. వారి నిర్లక్ష్యమే ఇప్పుడు హత్యకు దారితీసింది.

ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి’’ అని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Adoni Honour Killing: 'My father and uncle killed my husband together'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X