కేంద్రానికి మరో షాక్- పంజాబ్ బాటలోనే రాజస్ధాన్- వ్యవసాయ చట్టాలకు చెక్ పెట్టేందుకు రెడీ..
రైతు వ్యతిరేక కార్పోరేట్ వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి మరో షాక్ తగలబోతోంది. ఇప్పటికే కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ చట్టాలను పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించగా.. ఇప్పుడు మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్ధాన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణ చట్టంలోనూ మార్పులను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన పంజాబ్ అసెంబ్లీ.... వాటి స్ధానంలో కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు రాజస్ధాన్ కూడా ఇదే నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులోనూ కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు చట్టాలు చేస్తే సమాఖ్య విధానానికి మరోసారి విఘాతం తప్పదు.

పంజాబ్ బాటలోనే రాజస్ధాన్...
కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవసాయ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన మూడు చట్టాలపై ఆగ్రహంగా ఉన్న విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. అదే సమయంలో కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు కౌంటర్‌గా తమ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కొత్త చట్టాలను ఆమోదించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తమ పార్టీ సీఎంలకు పిలుపునిచ్చారు. దీంతో వారు ఒక్కొక్కరుగా కౌంటర్ చట్టాలను ఆమోదించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంజాబ్ అసెంబ్లీలో సీఎం అమరీందర్ సింగ్ ఈ మేరకు కౌంటర్ చట్టాలను ఆమోదించారు. ఇదే తరహాలో ఇప్పుడు కౌంటర్ చట్టాల ఆమోదం కోసం రాజస్ధాన్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఇక్కడి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.

కౌంటర్ చట్టాలు ఖాయమన్న గెహ్లాట్
త్వరలో రాజస్దాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులు రాజస్దాన్పై చూపే ప్రభావంపై చర్చించనున్నారు. అనంతరం వీటిని అసెంబ్లీ ఏకగ్రీవంగా వ్యతిరేకించబోతోంది. అయితే రాజస్దాన్ అసెంబ్లీలో విపక్షంగా ఉన్న బీజేపీ వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం తెచ్చిన బిల్లులను సమర్ధిస్తుందా లేక రైతులకు అండగా ఉంటుందో బీజేపీ తేల్చుకోవాలని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్తున్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించేందుకే ఈ కౌంటర్ చట్టాలు తీసుకొస్తున్నట్లు గెహ్లాట్ ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఆమోదించిన వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే ఉంటుందని గెహ్లాట్ స్పష్టం చేశారు.

ప్రభుత్వాలు కూలినా సిద్ధమేనంటున్న కాంగ్రెస్...
కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రాల్లో కౌంటర్ చట్టాలను తీసుకురావడాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సమర్ధించుకుంటున్నారు. ఇప్పటికే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ కౌంటర్ చట్టాలు తెచ్చిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఈ వ్యవహారంలో తన పదవి పోయినా, ప్రభుత్వం రద్దయినా వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. ఇప్పుడు ఇదే కోవలో రాజస్దాన్ ప్రభుత్వం కూడా కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ చట్టాలు చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. దీంతో ఈ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో తెలియడం లేదు. కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కౌంటర్ చట్టాలు చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తడి పెంచేందుకే సిద్ధపడుతోంది. ఈ ప్రయత్నంలో విఫలమైనా రైతు అనుకూల పార్టీగా మైలేజ్ తెచ్చుకోవచ్చనేది కాంగ్రెస్ భావనగా కనిపిస్తోంది.