చైనాకు దడపుట్టిస్తున్న భారత్: అగ్ని-5 పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఒడిశా తీరంలోని అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి అగ్ని-5ను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్( డీఆర్డీఓ) శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. ఈ క్షిపణిని ఉపరితలం మీద నుంచి ఉపరితలంపైకి ప్రయోగించవచ్చు.
ఈ అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి 6వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. అయితే, దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం.
అంటే ఉత్తరచైనాలోని ఏ ప్రాంతాన్నైనా అగ్ని-5 లక్ష్యంగా చేసుకోగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు.
అగ్ని-5 పరీక్ష ప్రత్యేకతలు పరిశీలిస్తే..
భారత్ 35దేశాల మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం పొందాక అగ్ని-5కు నిర్వహిస్తున్న మొదటి పరీక్ష ఇది. అణ్వాయుధ ప్రయోగం కోసం మానవరహిత ప్రయోగ వ్యవస్థ వ్యాప్తి చెందకుండా చూడటమే ఈ బృందం ముఖ్య ఉద్దేశం.
టన్ను బరువైన వార్‌హెడ్‌ను అగ్ని-5 దాదాపు 5000 కిలోమీటర్లు మోసుకెళ్లగలదు. ఆసియాలోని పలు దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా చైనా, యూరోప్, పాకిస్థాన్‌లోని ప్రాంతాలు దీని పరిధిలో ఉంటాయి.

ఇది ఘన ఇంధన వ్యవస్థతో నడిచే ప్రొపెల్లెంట్ సాయంతో పనిచేస్తుంది. దీంతో ఎటువంటి వాతవరణంలోనైనా మొబైల్ లాంచ్ వెహికల్‌పై నుంచి దీనిని ప్రయోగించవచ్చు.
దాదాపు 17 మీటర్ల పొడవు.. 50టన్నుల బరువు ఉండే ఈ క్షిపణికి చురుకైన అత్యాధునిక వ్యవస్థ ఉంది. ఈ క్షిపణిని ఉపరితలం మీద నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించవచ్చు. అత్యాధునికి ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థ ఉండటంతో శత్రు నిఘా వ్యవస్థలు దీనిని పసిగట్టడం కష్టతరంగా మారుతుంది.
అగ్ని-5కు తర్వాత వెర్షన్ అయిన అగ్ని-6 ప్రాజెక్టు కూడా ప్రాథమిక దశలో ఉంది. దాదాపు 8000 నుంచి 10000 కిలోమీటర్ల పరిధి ఉండే ఈ క్షిపణిని సబ్మెరైన్ల నుంచి కూడా ప్రయోగించే విధంగా సిద్ధం చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం అగ్ని-5 నావిగేషన్, గైడెడ్ వ్యవస్థలను పరీక్షించారు. మరికొన్ని పరీక్షల అనంతరం ఇది భారత్ అమ్ములపొదిలో చేరనుంది. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని-1(700కి.మీ), అగ్ని-2(2వేల కి.మీ), అగ్ని-3(2,500 కి.మీ), అగ్ని-4(3,500కి.మీ లక్ష్య ఛేదన సామర్థ్యం) క్షిపణులు ఉన్నాయి. అగ్ని-5 పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.