కరోనా వ్యాక్సిన్ కోసం సామాన్యులు 2022 వరకూ ఆగాల్సిందే: ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మనదేశంలో ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదని, సామాన్య ప్రజలకు ఈ వ్యాక్యిన్ అందుబాటులోకి రావాలంటే 2022 వరకు వేచి చూడాల్సిందేనని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. భారత మార్కెట్లో వ్యాక్సిన్ అందరికీ రావాలంటే 2022 దాటే అవకాశం ఉందని తెలిపారు.

భారత్ లాంటి దేశాల్లో అత్యధిక సమయం..
భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్నందున సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉందని అన్నారు. దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అనుకూలించేలా శీతల పరిస్థితులను కల్పిస్తూ.. సిరంజీలు, సూదులను పెద్ద మొత్తం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని గులేరియా వ్యాఖ్యానించారు.

వ్యాక్సిన్ కరోనా వైరస్ నాశనం కాలేదు..
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత దానికంటే ప్రభావితంగా పనిచేసే వ్యాక్సిన మరొటి వస్తే.. దానిపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి వస్తుందన్నారు. వైరస్ తీవ్రతను బట్టి ఎవరికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందన్నారు. అయితే, వ్యాక్సిన్‌తో కరోనాను పూర్తిగా నాశనం చేయలేమని గులేరియా తెలిపారు.

పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే.. కానీ,
ప్రస్తుతం పెద్దలపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పిన గులేరియా, పిల్లలపై కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా చూపడం లేదని తెలిపారు. వ్యాక్సిన్ ప్రయోగాలను విజయవంతమైన కొన్ని రోజుల తర్వాతే పిల్లలపై చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతానికి రెమిడెసివిర్ ఉపయోగిస్తున్నామని, అయితే, దీని వల్ల మరణాలను తగ్గిస్తున్నామని చెప్పలేమన్నారు. అయితే, వేరే ఔషధం లేదు కాబట్టీ, దీన్నే వాడుతున్నట్లు వివిరంచారు. దీన్ని తీసుకుకోకపోయినప్పటికీ చాలా మంది కరోనా నుంచి బయటపడ్డారని తెలిపారు.