మద్యం ఇవ్వలేదని ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు బల్లభ్ నాయిని(30) న్యూయార్క్ నుంచి ఫ్లైట్ 102లో ఢిల్లీకి చేరుకున్నాడు. అతడు న్యూయార్క్‌కు చెందిన ఓ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నాయిని విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా సార్లు మద్యం అందించాలని డిమాండ్ చేశారు. తనకు అందించిన పానీయం సేవించి తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో మద్యం కావాలని డిమాండ్ చేశాడు.
మరో డ్రింక్ కావాలని బల్లబ్ నాయిని అడగ్గా.. కాసేపు వేచి ఉండాలని ఎయిర్ హోస్టెస్ అతనికి తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన బల్లభ్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అతని కోసం మద్యం కలుపుతున్న ఆమెపై మండిపడ్డాడు. గట్టిగా అరిచాడు. తీవ్రస్థాయిలో దూషించుకుంటూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసు అధికారి తెలిపారు.
ఇతర సిబ్బంది కలగజేసుకుని అతన్ని తన సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సిఐఎస్ఎఫ్ అధికారులకు అందజేశారు. దీంతో విమానం ఢిల్లీలో దిగిన వెంటనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాయిని మద్యం మత్తులో ఉన్నాడని, బాధిత మహిళ ఎయిర్ హోస్టెస్ నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.