పశ్చిమ యూపీలో మత ఘర్షణలు రగిలించేందుకే, నేరస్తులకు టికెట్లు: అఖిలేష్‌పై యోగి ఆదిత్యనాథ్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మత ఘర్షణలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను అఖిలేష్ యాదవ్ తమ పార్టీ టికెట్ ఇచ్చి మరీ ఎన్నికల పోటీలో నిలబెడుతున్నారని యోగి మండిపడ్డారు.
2012 నుంచి 2017 వరకు రాష్ట్రాన్ని పాలించిన సమాజ్‌వాదీ పార్టీ, రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో చేతులు కలిపిన తర్వాత మరోసారి గూండాయిజం, మాఫియాలు, అరాచకాలను ప్రోత్సహిస్తోందని సీఎం యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మొదటి జాబితా నుంచి SP, RLD కూటమి తన పాత్రను చూపించింది. యూపీ ఎన్నికల్లో నేరస్థులకు, అల్లరి మూకలకు మరోసారి ఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది' అని సీఎం యోగి ధ్వజమెత్తారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న మదన్ భయ్యా మాఫియాల జాబితాలోకి ఎక్కారని ఆదిత్యనాథ్ ఆరోపించారు సీఎం యోగి.

'మదన్ భయ్యా పేరు మాఫియాల జాబితాలోకి వస్తుంది, కానీ అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి దానిని మర్చిపోయారు. అతనిపై 1982 నుంచి 2021 వరకు హత్య కేసులతో సహా మొత్తం 31 కేసులు నమోదయ్యాయి అని తెలిపారు సీఎం యోగి. ఇక, ముజఫర్‌నగర్ స్థానం నుంచి నహిద్ హసన్‌ను పోటీకి దింపినందుకు సమాజ్‌వాదీ పార్టీపై ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని షామ్లీ, సహరాన్పూర్ జిల్లాల్లో అతనిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
"అదే విధంగా, బులంద్‌షహర్ నుంచి టికెట్ ఇచ్చిన హాజీ యూనస్‌పై మొత్తం 23 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి' అని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. రాబోయే ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను ప్రశంసిస్తూ, ఆదిత్యనాథ్ దీనిని "సామాజిక న్యాయానికి" చిహ్నంగా పేర్కొన్నారు.
అల్లర్లు, నేరస్థులు ఆధిపత్యం చెలాయించే సమాజ్‌వాదీ పార్టీ జాబితాను కూడా ఉత్తరప్రదేశ్ ప్రజలు తప్పక చూసి ఉంటారని యోగి అన్నారు.
రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కన్నేసిన బీజేపీ శనివారం నాడు రాబోయే ఎన్నికలకు 107 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాగా, 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఓటింగ్ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.