మరోసారి దాతృత్వం చాటుకున్న అక్షయ్ కుమార్..వరదబాధితులకు భారీ విరాళం
మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవసరాల్లో ఉన్న పేద ప్రజలకు సహాయం చేస్తారన్న మంచి పేరును సంపాదించుకున్నారు ఈ స్టార్ హీరో. ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ భారీ విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా సహజ విపత్తుల ద్వారా సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఈ విరాళాలు ఇచ్చారు. తాజాగా బీహార్ వరదబాధితులకు భారీ విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు అక్షయ్ కుమార్.

బీహార్ బాధితులను ఆదుకున్న అక్షయ్ కుమార్
బీహార్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలా కోటి రూపాయలు 25 కుటుంబాలకు విరాళంగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు అక్షయ్ కుమార్. చాత్ పూజా సందర్భంగా అక్షయ్ కుమార్ సంతకం చేసిన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేస్తామని అక్షయ్ కుమార్ కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సహజ విపత్తులు వచ్చాయంటే దానికి ఎవరూ ఏమీ చేయలేమని అక్షయ్ కుమార్ చెప్పారు. అయితే బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తాము ఏమి చేయగలమో అది చేస్తే వారికి ఊరట లభిస్తుందని చెప్పారు.

చేదు జ్ఞాపకాలను మిగిల్చిన బీహార్ వరదలు
బీహార్‌ను వరదలు ముంచెత్తడంతో అక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. వారి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోయారు. ఇప్పటికీ ఆ విపత్తు మిగిల్చిన చేదు జ్ఞాపకాలతోనే అక్కడి ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ విరాళంగా ఇచ్చిన డబ్బులతో పూర్తిగా కోలుకోలేనప్పటికీ... ఆ డబ్బులు ఈ సమయంలో తమకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

ఫణి తుఫాను బాధితులకు అండగా నిలిచిన అక్షయ్
ఈ ఏడాది ప్రారంభంలో ఒడిషాలో ఫణి తుఫాను సృష్టించిన బీభత్సంపై కూడా ఈ హౌజ్‌ఫుల్ 4 యాక్టర్ స్పందించారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటారు. ఇది కాకుండా అక్షయ్ కుమార్ భారత్ కీ వీర్ అనే కార్యక్రమం ద్వారా భారత బలగాలకు తన వంతు సహాయం చేశారు. ఇక చెన్నై కేరళలో కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచారు. పేద ప్రజలను ఆదుకోవడంలో కానీ, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో కానీ అక్షయ్ కుమార్ ముందువరసలో ఉంటారనేదానికి తాజాగా తాను ఇచ్చిన విరాళమే నిదర్శనం. అక్షయ్ కుమార్ చేస్తున్న ఈ సహాయం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. సర్వం కోల్పోయినప్పటికీ తిరిగి కొత్త జీవితం ప్రారంభించాలనే ఆశ బాధితుల్లో కనిపిస్తోంది.

సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న హౌజ్‌ఫుల్ 4
ఇక అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం హౌజ్‌ఫుల్ 4. రితేష్ దేశ్ ముఖ్, కృతీసనన్, కృతీ ఖర్బాందా, బాబీ డియోల్, పూజా హెగ్డేలు కూడా ఈ చిత్రంలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రంకు మంచి టాక్ లభించింది. దీపావళి సమయానికి అంటే విడుదలైన నాలుగురోజుల్లోనే ఈ చిత్రం రూ.87.78 కోట్లు మేరా బిజినెస్ చేసినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!