లవ్ జిహాద్ కేసులపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు- యోగీ సర్కారుకు మరో షాక్
లవ్ జిహాద్ పేరుతో హిందూ-ముస్లిం యువతీయువకుల మధ్య పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూ చట్టాలు చేసేందుకు సిద్ధమవుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాన్పూర్‌లో ప్రభుత్వం నమోదు చేసిన లవ్ జిహాద్ కేసుల్లో కుట్ర కోణం లేదంటూ యోగీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ బృందం తేల్చిన రోజే అలహాబాద్ హైకోర్టు కూడా మరో షాక్ ఇచ్చింది.
దీంతో లవ్ జిహాద్ పేరుతో హంగామా చేస్తున్న యోగీ సర్కార్‌ను భారీ షాక్ తప్పడం లేదు.
యూపీలోని కుషీ నగర్లో ఉంటున్న సలామత్ అన్సారీ, ప్రియాంక ఖర్వార్ అనే ఇద్దరు మేజర్లు అయిన యువతీ యువకులు తాజాగా పెళ్లి చేసుకున్నారు. వీరిపై ప్రభుత్వం లవ్ జిహాద్ పేరుతో కేసులు పెట్టింది. ఈ కేసుల్ని సవాల్ చేస్తూ వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరిపై నమోదు చేసిన లహ్ జిహాద్ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు యోగీ సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. గతంలో పెళ్లి కోసమే మతం మారడం ఆమోదయోగ్యం కాదంటూ తామే ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఈ సందర్బంగా సవరించింది.

లవ్ జిహాద్ కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు.. వ్యక్తులకు తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛ ఉందంటూ సమర్ధించింది. సలామత్ అన్సారీ, ప్రియాంకను తాము కేవలం హిందు-ముస్లింలుగా చూడటం లేదని వారు ఇద్దరు సొంత అభిప్రాయాలు కలిగిన వ్యక్తులుగా పేర్కొంది. ఇలా ఇద్దరు మేజర్లు అయిన వ్యక్తుల స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని హైకోర్టు తెలిపింది. ఇది భిన్నత్వంలో ఏకత్వమన్న భావనకే విరుద్ధమని హైకోర్టు అక్షింతలు వేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాల్లో చొరబడటం అనేది వారి ఎంపిక స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని వ్యాఖ్యానించింది.
వాస్తవానికి మన దేశంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు కూడా కలిసి జీవించేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయని, అలాంటిది మతాల పేరుతో వ్యక్తులను విడదీయాలని చూడటం దారుణమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇందుకు వారి కుటుంబం కానీ, ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు యోగీ ప్రభుత్వానికి షాకిచ్చాయి.