ఇటు కరోనా..అటు చైనా.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న మోదీ.. డ్రాగన్ కు షాక్ తప్పదా?
వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తగ్గేలా సైన్యాలను ఉపసంహరించుకుందామన్న ప్రతిపాదనకు అడ్డంగా తలూపుతోన్న చైనా.. భారత్ పై విషం కక్కే పనిని మరింత ముమ్మరం చేసింది. సరిహద్దులో మోహరించిన యుద్ధసామాగ్రిని కూడా వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో పరిస్థితి ఇంకాస్త జఠిలంగా మారుతున్నది. ఇటువైపు కరోనా వైరస్ మరింత వేగంగా విజృంభిస్తుండటంతో మరణాల సంఖ్యాపరంగా భారత్ ప్రపంచంలోనే టాప్-8వ స్థానానికి ఎగబాకడం కలవరాన్ని రెట్టింపు చేసింది. ఇంకో ఆరు రోజుల్లో అన్ లాక్ 1.0 ముగియనుండగా ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిస్థాయిలో గాడినపడకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
చౌకీదార్ చైనీస్ హై: మోదీపై కొత్త అస్త్రం.. జవాన్లు చనిపోతే ప్రధానికి చైనా ప్రశంసలా?.. కాంగ్రెస్ ఫైర్

కేంద్ర కేబినెట్ భేటీ..
దాదాపు అన్ని రంగాల్లో సవాళ్లు ఎదురవుతోన్న వేళ.. దశాబ్దాల తర్వాత చైనా సరిహద్దులో భారీ సంఖ్యలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన దరిమిలా బుధవారంనాటి కేంద్ర కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతోన్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్ల తెలుస్తోంది. ప్రధాని అధికార నివాసం లోక కల్యాణ్ మార్గ్-7 వేదికగా జరిగిన భేటీకి కీలక శాఖల మంత్రులు హాజరయ్యారు.

ఉపాధికి నిధుల పెంపు?
లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కూలీలు మహానగరాలను వదిలేసి సొంత ఊళ్లకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్లందరికీ పని కల్పించాలని కేంద్రం భావించింది. లాక్ డౌన్ మొదటి దశ నుంచే మోదీ సర్కార్.. ఎన్ఆర్ఈజీఎస్ పథకానికి నిధులు పెంచుతూ రావడం సత్ఫలితాలనిచ్చింది. తాజాగా వెల్లడైన రిపోర్టుల్లో.. ఉపాధి హామీ పథకం కారణంగా దేశంలో నిరోద్యోగ రేటు మళ్లీ సాధారణ స్థితికి చేరింది. లాక్ డౌన్ సమయంలో 23.5 శాతంగా ఉన్న అన్ ఎంప్లాయిమెంట్ రేటు.. ఇప్పుడు 8.75 శాతానికి(లాక్ డౌన్ ముందున్నప్పటి స్థితి)కి చేరుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఉపాధి పథకానికి భారీగా నిధులు పెంచాలని మోదీ సర్కారు భావిస్తోంది.

ఎంఎస్ఎంఈలపై..
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న ‘చిన్న, మధ్యతరహా పరిశ్రమలు'కు సంబంధించి మోదీ సర్కార్ గతంలోనే భారీ ఉద్దీపనలు ప్రకటించింది. వాటి అమలును సమీక్ష చేయనున్న ప్రధాని.. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి ఇంకా మెరుగైన సహకారాన్ని అందించే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అన్ లాక్ 2.0
కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 156,968 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.56లక్షలకు పెరిగింది. మొత్తం 14,476 మరణాలతో ఇండియా ప్రపంచంలోనే టాప్10 దేశాల జాబితాలోకి చేరింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడిపైనా కేంద్రం కీలక సూచనలు చేయనుంది. లాక్ డౌన్ నిర్ణయాధికారాలను రాష్ట్రాలకే వదిలేసిన తర్వాత చాలా చోట్ల మళ్లీ ఆంక్షల విధింపు కొనసాగుతున్నది. అయితే, దేశవ్యాప్త లాక్ డౌన్ మాత్రం ఉండబోదని మోదీ ఇటీవలే స్పష్టం చేశారు. జులై 1 నుంచి అమలులోకి రానున్న అన్ లాక్ 2.0 ఎలా ఉండాలనేదానిపైనే కేబినెట్ లో ఓ నిర్ణయానికి రానున్నారు.

చైనాకు షాక్ తప్పదా?
తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత సైనికులను కిరాతకంగా చంపేసి.. ఆ భూభాగాన్ని తనదిగా ప్రకటించుకుని.. భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాకు చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలంతా కోరుతున్నవేళ.. కేంద్ర ప్రభుత్వం కూడా డ్రాగన్ కు షాకిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ శాఖల్లో చైనా వస్తువులు వాడరాదని ఇదివరకే అంతర్గత ఆదేశాలిచ్చిన మోదీ సర్కారు.. తాజాగా చైనా వస్తుల దిగుమతిపైనా ఆంక్షలు అప్రకటిత ఆంక్షలు విధించింది. కస్టమ్స్ క్లియరెన్స్ రాకపోవడంతో దేశంలోని పలు విమానాశ్రయాల కార్గో విభాగాల్లో చైనా వస్తువులు పేరుకుపోతుండటం తాజా దృశ్యం. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా చైనా వస్తువులపై నేరుగా నిషేధం విధించకుండా.. మనకు మనమే స్వావలబన సాధించేలా ‘ఆత్మనిర్భర్ అభియాన్'ను ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.