
మరో 5రాష్ట్రాల్లో ఎన్నికల సందడి -కరోనా అనుభవంతో గడువులోనే: సీఈసీ -వ్యాక్సిన్లు లేకుండా పోలింగా?
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ రాజకీయ కోలాహలం ఊపందుకోనుంది. రెండో వేవ్ ఉధృతికి మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలే కారణమన్న విమర్శలు, ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలన్న కోర్టుల వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ, తాము నెరవేర్చాల్సిన రాజ్యాంగ బాధ్యతను సకాలంలో నిర్వహిస్తామని భారత ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది. కేంద్రంలో అధికారానికి అతి కీలకమైన రాష్ట్రంగా భావించే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు గడవులోనే నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో కొన్ని ఉప ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో 2022 అసెంబ్లీ ఎన్నికల ముచ్చట్లను ఆయన మంగళవారం పీటీఐతో పంచుకున్నారు..
శృంగార తార షకీలా ఔదార్యం: పేదలకు ఆహారం పంపిణీ -లాక్డౌన్ ఎత్తివేతపై ముఖ్యమంత్రి కీలక ప్రకటక

కరోనాతో తలపండిన ఈసీ..
గడిచిన ఏడాదిన్నర కాలంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూ, 3లక్షల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయినా ఎన్నికల కమిషన్ మాత్రం తన పని తాను చేసుకుపోయింది. 2019 నవంబర్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, 2021 మార్చి- ఏప్రిల్ ఐదు అసెంబ్లీలు(పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి) లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించామని, తద్వారా కరోనాను డీల్ చేయడంలో ఈసీ అనుభవం సాధించడమేకాదు, అంతోఇంతో తలపండిందనీ సీఈసీ సునీల్ చంద్ర అన్నారు. ఆ అనుభవం ఆధారంగా 2022లో మరో మినీ సంగ్రామంగా జరుగబోయే మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలనూ సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండో వేవ్ ఉధృతి క్రమంగా పలుచబడుతూ, కేసులు, మరణాల సంఖ్య తగ్గుతోందని, దీంతో 2022లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ల కొరత: భారత్కు భారీ ఊరట -Hyderabadకు అతిపెద్ద లోడ్ -30లక్షల Sputnik V డోసులు

భారీ జనాభా.. పెను సవాల్..
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ 2022లో భారీ సవాళ్లను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా రెండో దశ తగ్గినా, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాకపోతే మరో ఆరు నెలతర్వాతైనా మూడో వేవ్, ఆ తర్వాతి వేవ్ లు కూడా సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో 2022 ఎన్నికలు ఈసీకి సవాలు లాంటివే. అదీగాక దేశంలోనే అతి పెద్ద, అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లో కరోనా వేళ ఎన్నికలు అందరిలో కలవరం పుట్టిస్తున్నాయి. యూపీలో మొత్తం 14.66కోట్ల మంది ఓటర్లుండగా, పంజాబ్లో 2కోట్లు, ఉత్తరాఖండ్లో 78 లక్షలు, మణిపూర్లోలో 19.58 లక్షలు, గోవాలో 11.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే, వచ్చే ఏడాది దాదాపు 18కోట్ల మంది ఓటర్లు ఎన్నికల జాతరలో పాల్గొనాల్సి ఉంటుంది. కరోనా వేళ అది సాధ్యమేనా అంటే.. అవుననే సీఈసీ సుశీల్ చంద్ర అంటున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు మార్చి 2022న అసెంబ్లీ కాలవ్యవధి ముగుస్తుండగా.. ఉత్తర్ప్రదేశ్లో మే చివరకు ముగియనుంది. ఒక్క పంజాబ్(కాంగ్రెస్) తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉంది. కాగా,

వ్యాక్సిన్లు లేకుండా ఎన్నికలా?
దేశంలో వైరస్ వ్యాప్తికి కేంద్రం అసంబద్ధ విధానాలు, రాష్ట్రాల అనుచిత నిర్ణయాలకుతోడు ఎన్నికల కమిషన్ తీరు కూడా కారణమేననే విమర్శలు ఇటీవల పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తికి, తద్వారా ఎంతో మంది చావులకు కారకులైన ఈసీ అధికారులపై హత్య కేసు ఎందుకు పెట్టరాదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించగా, ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం పరోక్షంగా సమర్థించింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. కాగా, వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్లు మాత్రమేననే భావన ప్రపంచదేశాల్లో నెలకొనగా, రెండో అత్యధిక జనాభా దేశమైన భారత్ లో ఇప్పటిదకాకే కేవలం 3శాతం మందికి మాత్రమే టీకాలు అందించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి నిదానించించిన నేపథ్యంలో అందరికీ టీకాలు అందాలంటే చాలా కాలం పడుతుంది. సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పినట్లు వచ్చే ఏడాది జనవరిలోపే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికావాలంటే మిగిలిన ఆరు నెలల్లో దాదాపు 150కోట్ల పైచిలుకు డోసులు ఉత్పత్తికావాల్సి ఉంటుంది. అది సాధ్యమవుతుందా? వ్యాక్సిన్లు లేకుండానే గడవు ప్రకారం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇస్తుందా? అనేది వేచిచూడాలి..