వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమూల్ పాల కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమూల్

ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవిస్తుంటారు. ముఖ్యంగా కరవు ప్రభావిత ప్రాంతాల్లో పశువుల పోషణ ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది.

ప్రకాశం జిల్లా అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఆ జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో 2468 మంది జనాభా ఉన్నారు. అందులో 900 మంది రైతులుండగా 230 మంది పాల రైతులున్నారు.

వ్యవసాయానికి అనుగుణంగా భూములున్నప్పటికీ పూర్తిగా వర్షాధార ప్రాంతం కావడంతో అత్యధికులు పశువుల పోషణ ద్వారా జీవిస్తున్నారు. సగటున పూటకు 300 లీటర్ల పాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది. ప్రస్తుతం ఈ గ్రామంలో అమూల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రభుత్వం పాలసేకరణ ప్రారంభించింది.

నవంబర్ 26న అమూల్ పాలసేకరణ కేంద్రాల ప్రారంభోత్సవం జరగగా, 20వ తేదీ నుంచే ఈ గ్రామంలో పాల సేకరణ ప్రారంభించారు. తొలి ఆరు రోజులపాటు పాలు పోసిన వారికి నేరుగా సీఎం చేతుల మీదుగా 26వ తేదీన నగదు చెల్లింపు జరుగుతుందని చెప్పారు.

అమూల్ సంస్థ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల్లో పాల సేకరణ ప్రారంభించగా ప్రస్తుతం 58 మంది రైతులు పాలు పోసేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 56 లీటర్ల పాలు ఈ కేంద్రంలో సేకరించినట్టు ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్నమహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం కార్యదర్శి బీబీసీకి తెలిపారు.

అమూల్

అమూల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ భవనాల్లో సేకరణ ప్రారంభానికి ముందు తమ గ్రామంలో లీటర్ పాలు ఫ్యాట్ శాతం 10 ఉంటే రూ. 58కు లభించేవని, ప్రస్తుతం అది రూ.65కి పెరిగిందని గ్రామంలో పాల ఉత్పత్తిదారులు చెబుతున్నారు.

గ్రామంలో సగటున రోజుకి 600 లీటర్లు వస్తే దానికి సుమారుగా రూ.7 చొప్పున పెరిగిన ధర ప్రకారం మొత్తం రూ. 4,200 ఆ ఒక్క గ్రామంలోని రైతులకు లబ్ధి చేకూరుతున్నట్టు వారు చెబుతున్నారు. తద్వారా నెలకు కనీసంగా రూ. 1.25 లక్షల మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్టు కనిపిస్తోంది.

అమూల్ సంస్థతో పాటుగా హెరిటేజ్, ఒంగోలు మిల్క్ డెయిరీ సహా అందరూ పాల సేకరణ ధర పెంచడం మూలంగా ఈ ప్రయోజనం చేకూరుతున్నట్టు చెబుతున్నారు.

ప్రభుత్వమే అమూల్ ద్వారా పాలసేకరణ చేపట్టడం మూలంగా పాల వ్యాపారంలో పలు మార్పులు జరగబోతున్నాయనడానికి కలికివాయి గ్రామ అనుభవం చెబుతుంది.

ప్రస్తుతం తొలి దశలో మూడు జిల్లాల్లోని 250 గ్రామాల్లో ఈ పాలసేకరణ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తి, మార్కెట్ రంగంలో జరుగుతున్న మార్పులపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది.

అమూల్

వాళ్లకే ఎందుకు ఇచ్చారు...

గుజరాత్‌లోని ఆనంద్ సమీపంలో అమూల్ సంస్థను సహకార పద్ధతిలో స్వతంత్ర్యానికి పూర్వం ప్రారంభించారు. 1946 లో ఏర్పడిన ఈ సహకార సంస్థ, గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జిసిఎంఎంఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహణ సాగుతోంది. 36 లక్షల మంది గుజరాతీ పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో ఇది నడుస్తోంది.

తొలుత కైరా డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ లిమిటెడ్‌తో ప్రారంభించారు. అనంతరం అముల్‌గా పేరు మార్చారు. 1949లో డాక్టర్ వర్గీస్ కురియన్‌ అమూల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థ విశేషంగా విస్తరించింది. కురియన్‌ ''మిల్క్ మేన్ ఆఫ్ ఇండియా''గా పేరు గడించారు. విదేశాలకు కూడా ఈ సంస్థ విస్తరించింది.

దేశంలో అత్యంత ప్రాచుర్యం పొంది, అత్యధిక మార్కెట్ సామర్థ్యం కలిగిన సంస్థ కారణంగానే అమూల్‌తో ఒప్పందం కుదర్చుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు బీబీసీతో మాట్లాడారు.

''ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పాల సేకరణ, రైతులకు చెల్లింపులు జరుగుతాయి. కేవలం మార్కెటింగ్ కోసమే అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మార్కెట్లో పోటీ వాతావరణం కల్పించి, పాల రైతులకు ప్రయోజనం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటు డెయిరీలు కూడా మౌలిక వసతులకు కల్పన చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అదంతా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పశు పోషణకు అవసరమైన అన్ని రకాల సహాయం నేరుగా ప్రభుత్వమే అందిస్తుంది. అమూల్ సంస్థ నుంచి సాంకేతిక, మార్కెట్ సహకారం మాత్రం తీసుకుంటున్నాం. రైతులకు చెల్లింపులు కూడా ప్రభుత్వం ద్వారా జరుగుతాయి. కాబట్టి రైతులకు ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది''అని ఆయన వివరించారు.

అమూల్

అవసరాలకు మించి ఉత్పత్తి

కేంద్ర ప్రభుత్వ ఫుడ్ ప్రోసెసింగ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం.. పాల ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 18 శాతం పాలు అక్కడి నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఆ తర్వాత రాజస్తాన్ 11 శాతం పాలు ఉత్పత్తి చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం పాల ఉత్పత్తి జరుగుతోంది.

ఇక గుజరాత్‌లో 8, పంజాబ్‌లో 7 శాతం చొప్పున పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పాల డెయిరీలలో మాత్రం గుజరాత్‌కి చెందిన అమూల్, యూపీకి చెందిన మదర్ డెయిరీ.. దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఏపీకి చెందిన హెరిటేజ్ మాత్రం టాప్ 15 డెయిరీల లిస్టులో ఉంది.

నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ సేకరించిన 2016-17 నాటి లెక్కల ప్రకారం.. సగటున ఏపీలో తలకు 522 గ్రాముల పాలు అందుబాటులో ఉండగా, జాతీయ స్థాయిలో అది 355గ్రాములు మాత్రమే. ఇక ఆంద్రప్రదేశ్‌లో రోజుకి సగటున 400 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 150 లక్షల లీటర్లు గృహ అవసరాల కోసం స్థానికంగా వినియోగిస్తున్నట్టు పశు సంవర్థక శాఖ నివేదిక చెబుతోంది.

మరో 60 లక్షల లీటర్ల పాలు వివిధ ప్రభుత్వ, సహకార, ప్రైవేటు డెయిరీల ద్వారా మార్కెట్ చేస్తున్నారు. మిగులు ఇంకా 200 లక్షల లీటర్ల పాలు ఉంటాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి పాల రైతులకు ఉందని, దానికి మరింత మార్కెట్ కల్పించడం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని ఆ శాఖ చెబుతోంది.

అమూల్

అమూల్ కేంద్రాలకు భారీగా నిధులు

ఏపీలో ఇప్పటికే పాలు మిగులు ఉత్పత్తిలో ఉండగా, దానిని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. అమూల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రారంభించిన పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే ఒప్పందం మేరకు... యూనిట్ కి రూ. 75 వేలు చొప్పున సహాయం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. తద్వారా అదనంగా రాష్ట్రంలో మొత్తంగా 4.68 లక్షల పశువుల కొనుగోలుకి సిద్ధమవుతున్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి వాటిలో ఒక లక్ష ఆవులు, గేదెలు కొనుగోలు చేయబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. అది జరిగితే మరో 10 నుంచి 15 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి పెరుగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,899 పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు దశల్లో వాటిని పూర్తి చేస్తారు. తొలుత చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించబోతున్నారు. మరో 7,125 పాల సేకరణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

నిర్మాణాల నిమిత్తం రూ. 1,231 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. మౌలిక వసతుల కోసం మొత్తం రూ. 1,362 కోట్లు వెచ్చిస్తుండగా అందులో 20 శాతం ప్రభుత్వమే కంట్రిబ్యూషన్ గా చెల్లించేందుకు సిద్ధమయ్యింది. మిగిలిన మొత్తం జాతీయ సహకార సంస్థ నుంచి 10 ఏళ్లలో తిరిగి చెల్లించే ఒప్పందం మేరకు రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు.

అమూల్

సహకార రంగం దెబ్బతీయడంతో..

ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిదారుల సహకార వ్యవస్థను గత ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం నష్టాన్ని చేకూర్చిందని సీనియర్ జర్నలిస్ట్, రైతు నాయకుడు పాశం జగన్నాథం నాయుడు అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడారు.

''సమీప కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పాల ఉత్తత్తిదారుడికి, వినియోగదారుడికి మధ్య ధర వ్యత్సాసం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం రైతుకి సగం ధర మాత్రమే దక్కుతుంది. సహకార సొసైటీల ఆధ్వర్యంలో కొన్ని చోట్ల ఏదో మేరకు ప్రయోజనం దక్కుతున్నప్పటికీ ప్రైవేటు డెయిరీల మూలంగా రైతుకి అన్యాయం జరుగుతోంది. కేవలం భూగర్భ జలాల ఆధారంగా జీవనం సాగించే చిత్తూరు వంటి జిల్లాల్లో పాడి పశువుల మీద ఆధారపడిన రైతులు అత్యధికంగా ఉన్నారు. ఇక్కడి సహకార డెయిరీలను నష్టాలు పాలు జేసి, మూతవేశారు. వివిధ పార్టీల నేతలు సొంత డెయిరీలు పెట్టుకుని లాభాలు గడిస్తున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అమూల్ రాకతో రైతులకు ప్రయోజనం చేకూరితే మంచిదే. ప్రభుత్వం రైతులకు లబ్ది జరిగేలా సహకార రంగం పటిష్టపరిచేందుకు శ్రద్ధ పెట్టాలి'' అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమూల్

పాల ధరల్లో చాలా వ్యత్యాసం...

పాల సేకరణ కేంద్రాల వద్ద ఫ్యాట్ ఆధారంగా లీటర్ పాల ధరను నిర్ణయిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ డెయిరీలైన హెరిటేజ్, తిరుమల, సంగం, మోడల్, విశాఖ వంటి డెయిరీలతో పాటుగా కృష్ణా, ఒంగోలు మిల్క్ డెయిరీల ఆధ్వర్యంలో ఒక్కొక్కరు ఒక్కో ధర చెల్లిస్తున్నారు.

ప్రస్తుతం కొన్ని చిన్న సహకార సంస్థలతో పాటుగా కృష్ణా మిల్క్ డెయిరీ వంటి సహకార సంస్థలు కూడా ఫ్యాట్ 10 శాతం ఉంటే రూ. 65 చొప్పున చెల్లిస్తుండగా అత్యధికులు రూ. 58 దాటడం లేదు. అయినప్పటికీ రైతులు ప్రైవేటు డెయిరీలను ఆశ్రయించక తప్పడం లేదు.

ప్రస్తుతం అమూల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలలో సేకరిస్తున్న పాల కేంద్రాలలో వాటి ధర అత్యధికంగా రూ. 71 వరకూ ఉంది. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్(ఏపీడీడీసీఎఫ్‌) ద్వారా 9,688 ఆర్బీకేలలో వాటిని ఏర్పాటు చేయబోతున్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వాటిని నిర్వహిస్తారు. ఏపీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను సహకార చట్టం ఆధారంగా నిర్వహించబోతున్నారు. రైతులు పాలు ఎవరికి పోస్తారన్నది వారి సొంత నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. చేయూత లబ్దిదారులు మాత్రం అమూల్ కేంద్రాలకు పాలు పోయాల్సి ఉంటుంది.

రైతులకు మద్ధతు ధర కల్పిస్తే, పాల డెయిరీల నిర్వహణను ఎవరు చూసుకున్నా అభ్యంతరం లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ అమూల్ సంస్థకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వ తీరుని విమర్శించారు.

ఏపీ రైతు సంఘం ప్రతినిధులు కూడా ప్రభుత్వమే నిర్వహించకుండా అమూల్ వంటి సంస్థలకు పెత్తనం అప్పగించిన తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమూల్‌కి, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం మీద స్పష్టత ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.నరసింహరావు కోరుతున్నారు.

అమూల్

'మేలు కలుగుతోంది.. కానీ మార్పులు చేయాలి

ఆర్బీకేలలో అమూల్ ద్వారా పాలసేకరణ ప్రారంభమయిన తర్వాత ప్రైవేటు డెయిరీలు కూడా తమ వద్ద ఉన్న ఖాతాదారులు అటు వైపు మళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అమూల్ కేంద్రాలు ప్రారంభించిన గ్రామాల వరకూ పాలసేకరణకు ధరలు పెంచారు. దాని మూలంగా తమకు లబ్ధి చేకూరుతోందని కలికివాయికి చెందిన ఎం ప్రభావతి బీబీసీతో ఆన్నారు.

''ప్రభుత్వం పాల కేంద్రాలు పెట్టడం మంచిదే. ఇతరులు కూడా సంఖ్య పెంచుతున్నారు. ఇది మాకు ఉపయోగపడుతుంది. చాలాకాలంగా ఎంత కష్టపడుతున్నా మాకు ప్రతిఫలం లేక ఆర్థికంగా నష్టపోతున్నాం. ఇన్నాళ్లకు ప్రయోజనం కలగడం మంచిదే. కానీ గ్రామాలలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలి. లేదంటే పరిస్థితి మొదటికి వస్తుంది'' అని ఆమె వ్యాఖ్యానించారు.

పాల సేకరణ కేంద్రం నిర్వహణ కోసం ప్రతీ గ్రామంలో 11 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో కార్యదర్శిగా ఉన్న మహిళ ఆధ్వర్యంలో పాలు సేకరిస్తున్నారు. అయితే 5.5 శాతం కన్నా ఫ్యాట్ తక్కువగా ఉంటే పాలు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో పలువురు వెనక్కిపోతున్నారని కలికివాయి గ్రామానికి చెందిన సునీల చెబుతున్నారు. అది సవరిస్తే ఇంకా ఎక్కువ మంది రైతులు అమూల్ కేంద్రాలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
AP govt is giving preference to Amul dairy centres which is a private company
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X