
మోడీ పర్యటన వేళ.. జమ్మూలో పేలుడు కలకలం: ప్రధాని సభకు కొద్దిదూరంలో: ఉల్కపాతంగా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ పర్యటన వేళ.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ముకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదాను కల్పించడానికి ఉద్దేశించిన 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం, రెండుగా విభజించి- కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత ప్రధాని మోడీ జమ్ము కాశ్మీర్ పర్యటనకు వెళ్లనుండటం ఇదే తొలిసారి. తన పర్యటన సందర్భంగా ఆయన సుమారు 20,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
దీనితోపాటు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని అక్కడే జరుపుకోనున్నారు. సాంబా జిల్లాలోని పల్లీ నుంచి ప్రసంగించనున్నారు. అక్కడే ఓ సౌర విద్యుత్ ప్లాంట్‌ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గంను ప్రారంభిస్తారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్ము కాశ్మీర్, లఢక్‌గా విభజించింది. వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించింది. అనంతరం అక్కడి అభివృద్ధిపై దృష్టి సారించింది కేంద్రం.

ఇదివరకు దీపావళి పండగ వేడుకలను సైన్యంతో జరుపుకోవడానికి వెళ్లారు ప్రధాని మోడీ. ఈసారి అక్కడి గ్రామాల్లో పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పల్లీ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియానాలో పేలుడు సంభవించింది. ఈ ఉదయం లాలియానాలోని ఓ వ్యవసాయ భూమిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పేలుడు శబ్దం విన్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడు జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. ఇది ఉగ్రవాద చర్య కాకపోవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నట్లు చెప్పారు. ఉల్క రాలిపడటం లేదా, పిడుగుపాటు వల్ల ఈ పేలుడు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.