ప్రధాని మోడీ రాసిన అద్భుతమైన కవిత .. ఇది చదివితే నైరాశ్యం నుండి వెలుగువైపు పయనించటం ఖాయం
2020 సంవత్సరం ముగిసింది. 2020 వ సంవత్సరం ప్రపంచానికి చేదు జ్ఞాపకం కాగా, భారతదేశం సైతం 2020 సంవత్సరం సృష్టించిన విలయాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. 2021 నూతన సంవత్సర ఆగమనం గత ఏడాది తాలూకు చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలోనైనా మంచి రోజులు రావాలని యావత్ ప్రపంచం నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది.

చాలా స్ఫూర్తిదాయకమైన కవితను రాసిన నరేంద్ర మోడీ
నూతన సంవత్సరం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్ఫూర్తిదాయకమైన కవితను రాశారు. తనగళంతో వినిపించారు . ప్రధాని నరేంద్ర మోడీ రాసిన కవితలో సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు అంటూ మన జీవితాల్లో చీకట్లు తొలగి విజయమనే సూర్యుడు ప్రకాశిస్తాడు అని చాలా చక్కని భావ వ్యక్తీకరణ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ రాసిన కవిత ఆశావహ దృక్పథంతోముందుకు సాగమని చెప్తుంది . అంతేకాదు ఆ కవిత ఆయన గాత్రం తో వినిపించడం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగిస్తోంది .

అభితో సూరజ్ ఉగా హై అంటూ ఆయన గాత్రంతో వినిపించిన కవిత
ప్రధాని నరేంద్ర మోడీ చాలా గొప్పగా రాసిన కవిత నైరాశ్యం లో ఉన్న ఎంతో మందిని చైతన్యం వైపు నడిపిస్తుంది. వారిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.
అభితో సూరజ్ ఉగా హై.. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు అనే టైటిల్ తో ప్రధాని మోడీ రాసిన కవితను కేంద్ర ప్రభుత్వం తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ నూతన సంవత్సరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాసిన అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కవితతో ప్రారంభిద్దాం అంటూ ట్వీట్ చేసింది.

ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు .. ఆశావహ దృక్పధంతో కూడిన కవిత
ప్రధాని మోడీ రాసిన కవిత సారాంశాన్ని చూస్తే
ఆకాశంలో తలెత్తి చూసినప్పుడు.. దట్టమైన మేఘాలు చీల్చుకుంటూ వెలుతురును ప్రకటించాలనే సంకల్పంతో సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు.
ధృడ నిశ్చయంతో ముందుకు వెళుతూ, ప్రతి కష్టాన్ని అధిగమిస్తూ, గాఢ చీకట్లను తొలగించడానికి సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు.
విశ్వాసం అనే చమురును జ్వలింపజేసి , వికాసం అనే దీపాన్ని తీసుకుని, కలలను నిజం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు

కరోనా కష్ట కాలంలో నైరాశ్యం నుండి వెలుగు వైపు సాగాలనే డిశా నిర్దేశం
తరతమ భేదం లేకుండా, నీది నాది అన్న తేడా లేకుండా, అందరి శక్తి తానే అయి ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు.
అగ్నిని దాచుకుని, ప్రకాశాన్ని వెదజల్లుతూ , నడుస్తూ మరియు నడిపిస్తూ, ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ... ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటూ ఆశావహ దృక్పథాన్ని తన కవిత్వం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల్లో నింపారు. చాలా అద్భుతమైన, గొప్ప స్ఫూర్తిదాయకమైన ఈ కవిత కరోనా కష్టకాలంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది.