• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్: ఎల్లుండి నుంచి తెరచుకోబోతున్న సినిమా థియేటర్లు, కొత్త నిబంధనలు ఇవీ.. -ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|
సినిమా థియేటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్‌ హాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి తెరచుకోనున్నాయని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నందున కర్ఫ్యూ నుంచి మరింత సమయం సడలింపు ఇచ్చారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ కర్ఫ్యూ నుంచి సడలింపు ఇచ్చారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చారు. సాయంత్రం ఆరు గంటలకే షాపులు మూసేసి, రాత్రి ఏడు గంటలకల్లా ఇళ్లకు చేరుకోవాలి. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతుంది.

సినిమా థియేటర్లలో గతంలో మాదిరిగా సీటుకూ సీటుకూ మధ్య ఖాళీ తప్పనిసరి నిబంధన వర్తిస్తుంది. జన సమ్మర్థం ఉంటే చోట కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని ఆదేశించారు.

కోవిడ్‌ విస్తరణను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా ఆంక్షలూ, సడలింపులు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై వివరాలను సీఎంకు అధికారులు అందజేశారు.

97 చోట్ల ఆక్సిజన్‌ జనరేటర్ల పనులు జరుగుతున్నాయని, 15 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. కాగా, ఆక్సిజన్‌ జనరేటర్ల ప్లాంట్లు రెండు నెలల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం

ప్రాణాలు తీసిన సెల్ఫీ.. చెరువులో జారిపడి ముగ్గురు బాలికల మృతి

నిర్మల్‌ జిల్లా సింగన్‌గావ్‌లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారని ఈనాడు తెలిపింది.

''సింగన్‌గావ్‌కు చెందిన ఎల్మే దాదారావు, మంగళాబాయిలకు ఒక కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలు స్మిత(16), వైశాలి(14) ఉన్నారు. ఆదివారం ఆన్‌లైన్‌ క్లాసులు లేకపోవడంతో బంధువుల అమ్మాయి అంజలి (14)తో కలిసి స్మిత, వైశాలిలు చేనుకు వెళ్లారు.

ఎండ ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్లాలని వారికి మంగళబాయి చెప్పింది. కొద్దిసేపు చేనులో ఉండి సెల్ఫీలు తీసుకుని ఇంటికి బయలుదేరారు. మార్గంమధ్యలో ఉన్న చెరువు గట్టు వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకునేందుకు వీరు యత్నించారు.

అయితే ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు.

చేను నుంచి రాత్రి ఇంటికి తిరిగివచ్చిన మంగళబాయికి ముగ్గురమ్మాయిలూ కనిపించలేదు. బంధువుల ఇళ్లలో, పంట చేను సమీపంలో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో అర్ధరాత్రి తానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఉదయం చెరువు గట్టు వద్ద చెప్పులను గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు.

స్మిత, వైశాలిలది వ్యవసాయ కుటుంబం. తండ్రి దాదారావు ఆటో నడుపుతాడు. సోదరుడు సందీప్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. స్మిత హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఇంటర్‌, వైశాలి బాసరలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు’’అని ఈనాడు తెలిపింది.

సుమలతపై కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు

కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి.. ప్రముఖ నటి, మాండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

''మాండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ లీకేజ్‌ అవుతోందని, మాండ్య జిల్లాకు ఇలాంటి ఎంపీ మునుపెన్నడూ ఎన్నిక కాలేదని పరోక్షంగా సుమలతపై విమర్శలు చేశారు. లీకేజీని అడ్డుకోవడానికి గేట్లకు అడ్డంగా ఎంపీని పడుకోబెట్టాలని ఎద్దేవా చేశారు.

కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని అన్నారు’’అని సాక్షి తెలిపింది.

మద్యం తాగుతున్న వ్యక్తులు

తెలంగాణలో బీరు రేటు రూ.10 తగ్గింపు

''తెలంగాణలో ఒక్కో బీర్‌పై రూ.10 తగ్గనుంది. అన్ని రకాల బ్రాండ్లు, సైజ్‌ బీర్లకు ఇది వర్తించనుంది. ఈ మేరకు సర్కార్ నిర్ణయం తీసుకుంది’’అని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

''డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసే బీర్లపై కొత్త ఎమ్మార్పీ రేట్లు వేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటికే లిక్కర్ షాప్స్‌లో ఉన్న స్టాక్‌ను మాత్రం పాత రేట్లకే అమ్మనున్నారు.

కరోనా, లాక్‌డౌన్‌తో బీర్ల సేల్స్, ఆదాయం తగ్గడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కరోనా కారణంగా గతేడాది మేలో సెస్‌ పేరుతో ప్రభుత్వం లిక్కర్‌ రేట్లను పెంచింది. దాదాపు 20 శాతం ధరలు పెరిగాయి. దీంతో రూ.120 ఉన్న బీర్ రూ.150కి చేరింది. అదే టైమ్‌లో ఇతర రాష్ట్రాల్లోనూ 10 నుంచి 15 శాతం లిక్కర్‌ రేట్లు పెంచారు.

కానీ ఫస్ట్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ ముగియడంతో ఆయా రాష్ట్రాలు సెస్‌ను ఎత్తేశాయి. దిల్లీ సర్కార్ కరోనా తగ్గకముందే ఎత్తేసింది. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత స్వల్పంగా తగ్గించింది. అప్పుడు రూ.30 పెంచి, ఇప్పుడు రూ.10 మాత్రమే తగ్గించింది’’అని వెలుగు ఓ కథనం ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Movie theaters to be opened from thursday, here are the new rules
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X