• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్: 15 నుంచి చెత్త పన్ను అమలుకు సన్నాహాలు- ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సన్నాహాలు చేస్తోందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''వ్యర్థాల సేకరణపై ప్రజల నుంచి వసూలు చేసే ప్రతిపాదిత రుసుముల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

మొదటి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

రెండో దశలో మిగతా పురపాలక సంఘాల్లో అమలు చేయనున్నారు.

ఈ నెల 15న కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ నివాసాలు, నివాసేతరాల నుంచి వ్యర్థాలు సేకరించి వినియోగ రుసుములు వసూలు చేయాలన్న నిర్ణయంపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది.

పలు చోట్ల పురపాలక పాలకవర్గ సభ్యులు సైతం కరోనా వేళ వినియోగ రుసుముల వసూళ్ల ప్రతిపాదనలను వ్యతిరేకించారు.

తొలి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 స్పెషల్‌, సెలక్షన్‌, ఫస్ట్‌ గ్రేడ్‌ పురపాలక సంఘాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

పుర, నగరపాలక సంస్థకు రెండు చొప్పున ప్రయోగాత్మకంగా 90 డివిజన్లు, వార్డుల్లో అమలు చేస్తారు. వీటిలో ఫలితాల ఆధారంగా మిగతా డివిజన్లు, వార్డులకు కార్యక్రమాన్ని విస్తరిస్తారు.

రెండో దశలో మిగతా 68 ప్రథమ, ద్వితీయ, తృతీయ గ్రేడ్‌ పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో వ్యర్థాలు సేకరించి ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయనున్నారు.

రెండు దశల్లో చేపట్టనున్న పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమం అమలు కోసం ఇప్పటికీ పాలకవర్గం అనుమతి తీసుకోని చోట వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం పొందాలని పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది.

తొలి దశలో క్లాప్‌ని ప్రారంభించే నగరపాలక సంస్థల్లో, స్పెషల్‌, సెలక్షన్‌, ఫస్ట్‌ గ్రేడ్‌ పురపాలక సంఘాల్లో వెంటనే పాలకవర్గం అనుమతి తీసుకోనున్నారు.

ఈ క్రమంలో ఈ నెల 15న నిర్వహించే విజయవాడ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశానికి సంబంధించి ఎజెండాలో అధికారులు వినియోగ రుసుములను ప్రతిపాదించారు. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కో చోట ఒక్కో విధంగా వినియోగ రుసుములను కమిషనర్లు ప్రతిపాదిస్తున్నార''ని ఆ కథనంలో రాశారు.

కరోనావైరస్

'హుజూరాబాద్‌‌తో కరోనా ముప్పు'

ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలు ముమ్మరం కావడంతో కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''సమావేశాల నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలను పట్టించుకోకపోవడం వైరస్‌ వ్యాప్తికి ఊతమిస్తోంది.

జూలై నెల 12 రోజుల్లో జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నిర్వహించిన యాంటీజెన్‌ టెస్టుల్లో 1,095 కేసులు రాగా.. అందులో 374 కేసులు (34 శాతం) హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లోనే నమోదయ్యాయి.

హుజూరాబాద్‌ మండలంలో 246 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. జమ్మికుంట (59), వీణవంక (52)ల్లో కేసులు భారీగా ఉన్నాయి.

మూడున్నర లక్షల జనాభా ఉన్న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఈ నెలలో నమోదైనవి 229 కేసులే.

కాగా, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివా్‌సరావు, వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎ్‌సడీ గంగాధర్‌ సోమవారం హుజూరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించార''ని ఆ కథనంలో ఉంది.

విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి: విజయసాయిరెడ్డి

విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారని 'వెలుగు' పత్రిక కథనం తెలిపింది.

'దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని ఆయన పిటిషన్ వేశారు.

సీబీఐ కోర్టు అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లివస్తానని విజయ సాయిరెడ్డి తెలిపారు.

విదేశాలకు వెళ్లేందుకు కనీసం రెండు వారాల అనుమతివ్వాలని ఆయన కోరారు.

కాగా విజయసాయిరెడ్డి పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.

దీంతో విజయసాయిరెడ్డి పిటిషన్ పై విచారణ ఈనెల 16కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు'' అని ఆ కథనంలో రాశారు.

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి, సింగపూర్‌ సంస్థ ఆసక్తి

డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్‌ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్‌ హైకమిషనర్‌ హెచ్‌.ఈ. సైమన్‌ వాంగ్‌ అన్నారని 'సాక్షి' కథనం తెలిపింది.

''వాంగ్‌ తన ప్రతినిధుల బృందంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సోమవారం అరణ్యభవన్‌లో కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో వాంగ్‌ హైదరాబాద్‌ నగరం, తెలంగాణ రాష్ట్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్‌ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు వాంగ్‌ చెప్పారు.

పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని మంత్రి వెల్లడించారు. డేటాసెంటర్లకు అనువైనదని, ఇప్పటికే అమెజాన్‌ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు.

తెలంగాణ వ్యాక్సిన్‌ హబ్‌గా మారిందన్నారు. సోలార్‌ వంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా తెలంగాణ అనువైందని చెప్పార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Preparations for the implementation of the dustbin tax from the 15th
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X