• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్: చెత్త సేకరణ పన్నుపై నిరసనలు.. ప్రజలకు భారం కాదంటున్న ప్రభుత్వం

By BBC News తెలుగు
|

ఆంధ్రప్రదేశ్‌లో చెత్త సేకరణపై కూడా పన్ను విధించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత ఆస్తి పన్నుపెంపుదలకు శ్రీకారం చుట్టింది. కొత్త జీవోలు విడుదల చేసింది. అర్బన్ ప్రాంతాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుదల పద్ధతి ప్రారంభించింది.

అదే సమయంలో చెత్త సేకరణకు కూడా పన్ను విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని మునిసిపాలిటీలలో దానికి అనుగుణంగా తీర్మానాలు కూడా చేశారు.

ఈ నిర్ణయాల పట్ల కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష నేతలు నిరసనలకు పూనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది పెద్ద భారం కాబోదని చెబుతోంది.

ఆస్తిపన్ను పెంపుదలపై విశాఖలో నిరసన

ఆస్తిపన్ను పెంపుదల ఎంత

ఏపీలో 15 మునిసిపల్ కార్పోరేషన్లు, 76 మునిసిపాలిటీలు, 31 నగర పాలక సంస్థలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,82,18,075 మంది అంటే ఏపీ జనాభాలో 33.36 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు.

ఇటీవల ఈ సంఖ్య పెరగడంతో పట్టణ జనాభా సుమారుగా 3 కోట్లు దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పట్టణ ప్రాంతాల్లో భూమి, భవనాలకు సంబంధించి వసూలు చేసే ఆస్తి పన్నును చెల్లించే కుటుంబాల సంఖ్య సుమారు కోటి వరకు ఉంటుందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు.

అర్బన్ ప్రాంత పాలక మండళ్ల పరిధిలో ప్రస్తుతం పదేళ్ల కిందట నిర్ణయించిన ఆస్తి పన్ను అమలవుతోంది. మధ్యలో కొన్నిసార్లు మంచినీటి కుళాయి పన్ను సహా వివిధ పన్నులు సవరించారు. కానీ ఆస్తి పన్నుల్లో మార్పులు జరగలేదు.

ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపుదల నిర్ణయం తీసుకుంది. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తూ జీవో కూడా విడుదల చేసింది.

వాటి ప్రకారం నివాస గృహాల ఆస్తి విలువపై 0.15 శాతం, వాణిజ్య సంస్థలు, నివాసేతర భవనాలపై 0.3 శాతం, ఖాళీ స్థలాలపై 0.5 శాతం పన్ను వేస్తారు.

ఈ పన్ను శాతాలు కూడా ఈ సంవత్సరానికి పరిమితం. వచ్చే సంవత్సరం వాటిని సవరించే అవకాశం ఉంది.

ఈసారి కొత్తగా గతంలో ఉన్న విధానానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అద్దె విలువను బట్టి ఇంటిపన్ను విధించేవారు.

ఇకపై రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించే భూముల విలువలు, కట్టడం విలువల ఆధారంగా ఇంటి పన్నులు వసూలు చేసేలా మార్పు చేశారు. దాంతో ఆస్తి విలువ పెరుగుతున్న కొద్దీ పన్నులు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

మంత్రి బొత్సకి వినతిపత్రం అందిస్తున్న జీవీఎంసీ కార్పోరేటర్ గంగారావు తదితరులు

ఈ మార్పు చాలా ప్రమాదకరం అంటున్న పౌర సమాఖ్య

ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు విధించడమంటే ప్రతి సంవత్సరం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లే అవుతుందని పట్టణ పౌరుల సమాఖ్య చెబుతోంది.

''స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డ్యూటీ, ఫీజులు వసూలు చేస్తోంది. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇంటి పన్నులను విలువ ఆధారంగా వేయటం రాజ్యాంగ విరుద్ధం. అయినా కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలకు అనుగుణంగా సీఎం జగన్ పన్నులు పెంచేందుకు సిద్ధమయ్యారు. స్వచ్ఛ భారత్ ర్యాంకుల పేరుతో జనాలను వేధించడం తగదు’’ అని సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబూరావు బీబీసీతో అన్నారు.

ప్రస్తుతం కరోనా సమయంలో ప్రజలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారని, అలాంటి సమయంలో పన్నుల పెంపు నిర్ణయం సరికాదని సమాఖ్య ప్రతినిధులు అంటున్నారు.

విజయవాడలో పన్నుల పెంపుదల నోటిఫికేషన్

తొలిసారిగా చెత్త పన్ను కూడా..

గతంలో పట్టణ ప్రాంతంలో ప్రజలు పొందే అన్ని సేవలకు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే పేరుతో మునిసిపల్ సిబ్బంది చెత్త సేకరణపై కూడా పన్ను విధించే ప్రతిపాదన వచ్చింది. ప్రభుత్వం ప్రయత్నించినా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పట్లో విరమించుకున్నారు.

అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మాత్రం చెత్త సేకరణపై పన్ను విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా కొన్ని మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో చెత్త సేకరణ నిమిత్తం ఇంటికి నెలకు రూ. 90 చొప్పున చెల్లించాలని తీర్మానించారు. వ్యాపార సంస్థలకు అది రూ. 250గా నిర్ణయించారు.

''మునిసిపల్ సిబ్బంది ఇంటింటికి వచ్చి సేకరించే చెత్త మీద పన్ను వేయడం చాలా చెత్త నిర్ణయం. దీనిని ఉపసంహరించుకోవాలి. గతంలో కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చినా వ్యతిరేకించడంతో నిర్ణయం ఉపసంహరించారు. కానీ ఇప్పుడు ఏడాదికి రూ. 750 నుంచి రూ 1500 వరకూ ఆయా మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో చెత్త సేకరణ పన్ను వేస్తున్నారు'' అన్నారు పెద్దాపురం పట్టణ మాజీ మునిసిపల్ కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ.

''రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి మినహా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన అన్ని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో అధికార వైఎస్సార్సీపీ పీఠం కైవసం చేసుకుంది. దాంతో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా మునిసిపాలిటీలలో పాలకవర్గాలు పన్నుల పెంపు తీర్మానాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది’’ అన్నారామె.

చెత్త మీద కూడా పన్ను విధించడం దారుణమని ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

వ్యాపారం సంస్థలకు భారీగా..

చెత్త పన్ను ప్రతి ఇంటి నుంచి ఆస్తి పన్నుతో పాటుగా వసూలు చేయబోతున్నారు. అయితే ఈ పన్ను భారం ఎక్కువగా అద్దెకు ఉండేవారిపై పడే ప్రమాదం ఉంది. అదే సమయంలో వ్యాపార సంస్థలకు పెద్ద మొత్తంలో పన్నులు విధించబోతున్నారు.

చిన్న షాపులకు కనీసంగా నెలకు రూ.100 నుంచి కేటగిరీలను బట్టి రూ.15వేల వరకూ పన్ను విధించే అవకాశం ఉందని మునిసిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయకపోయినా, రోడ్లపై చెత్త వేసినా రకరకాల కారణాలతో రూ. 100 నుంచి రూ. 2,500 రూపాయల వరకు పెనాల్టీ విధించడానికి నిబంధనలు విడుదల చేశారు.

పారిశుద్ధ్య నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుండే రాబట్టాలని ప్రతి సంవత్సరం ఈ సేవా రుసుములు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే స్వచ్ఛ భారత్ పేరుతో పన్నులు వసూలు చేయగా ఇప్పుడు మళ్లీ చెత్త మీద పన్ను విధించడం సమంజసం కాదని విపక్ష నేతలు చెబుతున్నారు.

''చెత్తపై పన్ను వేయాలనే ప్రతిపాదన సరికాదు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇంత పెద్ద సంక్షోభంలో ఉండగా అదనపు భారం అన్యాయం. తక్షణం పునరాలోచన చేసి నిర్ణయం మార్చుకోవాలి'' అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.

చెత్త సేకరణపై పన్ను ప్రజలకు పెద్ద భారం కాదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటోంది.

ప్రజలకు పెద్ద భారం కాదు అంటున్న మునిసిపల్ మంత్రి

పట్టణ ప్రజలకు తాజాగా పెంచిన పన్నులు భారం కాబోవంటున్నారు మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ.

''నూతన పన్ను విధానంతో అదనంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.186 కోట్లు మాత్రమే. నూతన ఆస్తి పన్ను విధానం వల్ల ఒక్క విజయవాడ నగరానికే రూ.500 కోట్లు ఆదాయం వస్తుందంటూ ప్రతిపక్షాలు అర్థం పర్థంలేకుండా మాట్లాడటం దారుణం’’ అని బొత్స సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

మూడు నెలల అద్దె ప్రామాణికంగా పన్ను వేసేవారని, ఇది లోపభూయిష్టంగా ఉండటంతో నూతన పన్ను విధానం తీసుకువచ్చామని మంత్రి అన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సరే గరిష్టంగా 15 శాతానికి మించి ఒక్కపైసా కూడా పన్ను పెరిగే పరిస్థితి ఉండదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

చెత్తసేకరణ పన్ను పట్టణాభివృద్ధి కోసమేనని, ప్రతిపక్షాల దుష్ప్రచారం తప్పితే అది ఎవరికీ భారం కాదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Protests over garbage collection tax .. The government is not a burden to the people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X