అనాజ్ మండిలో మరోసారి అగ్నిప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు: స్థానికుల్లో ఆందోళన..!
ఉత్తర ఢిల్లీలో ఇరుకిరుకు సందుల ప్రాంతమైన అనాజ్ మండీలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే మరో సారి అదే ప్రాంతంలో..అదే కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏకంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో అత్యధికుల పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. నాలుగు ఫైరింజన్లు రంగ ప్రవేశం చేసాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, అదే కంపెనీలో మరోసారి ప్రమాదం జరగటం పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముందుగా సహాయక చర్యల మీద అధికారులు ఫోకస్ చేసారు.
ఘోరం నుండి తేరుకోకుండానే..
ఉత్తర ఢిల్లీలో ఇరుకిరుకు సందుల ప్రాంతమైన అనాజ్ మండీలోని రాణీ ఝాన్సీ రోడ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా కార్మికులే కావటంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొని ఉంది. దీని నుండి తేరుకోకుండనే మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు అంతస్తులున్న భవంతి లో ఈ ప్రమాదం జరిగింది. అందులో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టోపీలు, ఇతర వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5గంటల సమయంలో రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో మొత్తం భవంతిలో 65 మందికిపైగా కార్మికులు ఉన్నారు. అందులోనూ... 14 నుంచి 20 ఏళ్లలోపు వయసున్న వారే ఎక్కువమంది. ప్రభుత్వం అధికారికంగా 43 మంది మరణించినట్లు ప్రకటించింది.

మరోసారి ప్రమాదంతో ఉక్కిరి బిక్కిరి
తమ కళ్ల మెందే జరిగిన ప్రమాదం షాక్ నుండి ఇంకా స్థానికులు కోలుకోలేదు. దీంతో..మరోసారి ప్రమాదం జరిగింది. అయితే, నష్టం గురించి సమాచారం అందాల్సి ఉంది. ఇప్పటికే అగ్నిప్రమాద బాధితులకు కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తామని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్షతోపాటు, చికిత్స ఖర్చు మొత్తం భరిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని, వారంలోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశామని చెప్పారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ కూడా ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది.