గుడ్ న్యూస్.. రెండురోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
అసలే ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి కార్తె రానుండటంతో ఉక్కపోత మాములగా లేదు. దీంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. వారికి భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో అంటే కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబర్ దీవులను దాటిన రుతుపవనాలు..బలమైన గాలుల ప్రభావంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, సహా కొమొరిన్ పై విస్తరించి ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.
గాలుల్లో స్థిరత్వం, వేగం ఇలానే కొనసాగనున్న నేపథ్యంలో మే 29వ తేదీ 30వ తేదీ మధ్య రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. వాతావరణ సూచనల ప్రకారం, దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా మారాయి. ఉపగ్రహాల చిత్రాల ప్రకారం, కేరళ తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం మేఘావృతం అయింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం మరియు లక్షద్వీప్ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించేందుకు మరిన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 29వ తేదీ వరకు కేరళలో వివిధ జిల్లాలకు జారీచేసిన ఎల్లో అలర్ట్‌ను ఐఎండీ ఉపసంహరించుకుంది. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఆయా రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో దుమ్ముధూళితో కూడిన గాలులు వీస్తూ..భారీ వర్షాలు కురుస్తున్నాయి.