ఏపీ-తెలంగాణ మధ్య మరో జల జగడం-ప్రకాశం బ్యారేజీ కింద కొత్త బ్యారేజీలపై-కేఆర్ఎంబీకి లేఖ
ఏపీ-తెలంగాణ మధ్య గతంలో చెలరేగిన జల వివాదాలు చల్లారిపోకుండానే మరో కొత్త వివాదం మొదలైంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్ లో కొత్త ప్రాజెక్టుల్ని తమ అనుమతి లేకుండా చేపట్టొద్దన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాల్ని పట్టించుకోకుండా ఏపీ ముందుకెళ్తోందంటూ తెలంగాణ తాజాగా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు కేఆర్ఎంబీ దృష్టిసారిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో రాజకీయాన్ని రగిల్చేందుకే కేసీఆర్ సర్కార్ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.

ఏపీ-తెలంగాణ జల జగడాలు
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య పలు జల వివాదాలు తలెత్తాయి. వీటిలో ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, వాటి జల విద్యుత్ కేంద్రాలు, సాగు, తాగు నీటి విడుదల, చేపల పంపకం వంటి అంశాల్లో ఈ వివాదాలు నెలకొన్నాయి. వీటి పరిష్కారం సాధ్యం కాకపోగా.. కంద్రం జోక్యం కోరడంతో పీటముడి పడింది. దీంతో ఏమీ చేయలేక ఇరు రాష్ట్రాలూ దిక్కులు చూడాల్సిన పరిస్ధితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వివాదం తలెత్తింది.

ప్రకాశం బ్యారేజీ దిగువన కొత్త బ్యారేజీలపై
ఏపీలోని విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజీ దిగువన వైసీపీ ప్రభుత్వం రెండు కొత్త బ్యారేజీలను నిర్మిస్తోంది. వీటి ద్వారా వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నీటికి అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే ప్రతీ ఏటా వరదల సమయంలో వేల క్యూసెక్యుల నీరు ప్రకాశం బ్యారేజీ తర్వాత ఎలాంటి ఆనకట్ట, బ్యారేజీ కూడా లేకపోవడంతో సముద్రం పాలవుతోంది. దీనిలో కొంత నీరు కాపాడుకున్నా భవిష్యత్తులో సాగు,తాగు నీటి సమస్యలు లేకుండా చూసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ దీనిపైనా అభ్యంతరాలు మొదలయ్యాయి.

కేఆర్ఎంబీకి కేసీఆర్ సర్కార్ లేఖ
ప్రకాశం బ్యారేజ్ దిగువన ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు బ్యారేజీలను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. గతంలో కృష్ణాబేసిన్ పరిధిలో తమ అనుమతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కట్టొద్దని కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాల్ని ఆదేశించింది. ఇప్పుడు అవే ఆదేశాల్ని గుర్తుచేస్తూ ఏపీపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు మాత్రమే కాదు ఏపీకి వర్తిస్తాయని, కానీ వీటిని ఉల్లంఘించి ఏపీ సర్కార్ కొత్త బ్యారేజీలు కడుతోందని ఆరోపించింది.

తెలంగాణకు నష్టమేంటి ?
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న చివరి బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇక కృష్ణాజలాల్లని ఆపేందుకు ఎలాంటి బ్యారేజీలు కానీ ఆనకట్టలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ రెండు బ్యారేజీల్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండు బ్యారేజీల వల్ల తెలంగాణ ప్రయోజనాలకు కూడా ఎలాంటి విఘాతం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ రెండు బ్యారేజీల నిర్మాణం వల్ల మిగులు జలాల్ని లెక్కించడం మరింత సులువవుతుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాజకీయ కారణాలతో అడ్డుకోవాలని చూస్తోందని ఏపీ వాదిస్తోంది.