కరోనిల్ విక్రయిస్తే కఠిన చర్యలు, అనుమతి లేకుండానే ప్రయోగం: రాజస్థాన్ మంత్రి శర్మ
కరోనా వైరస్ కోసం పతంజలి రూపొందించిన కరోనిల్ దుమారం కొనసాగుతోంది. డ్రగ్‌ను రాం దేవ్ బాబా రిలీజ్ చేయడంతో మొదలైన రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం వంతు వచ్చింది. కరోనిల్‌కు అనుమతి లేదు అని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అనుమతి తీసుకోకుండానే పతంజలి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందని ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ పేర్కొన్నారు.

వితౌట్ పర్మిషన్..?
పతంజలి క్లినికల్ ట్రయల్స్‌కి సంబంధించి తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని పేర్కొన్నారు. సదరు ప్రభుత్వం/అధికారులు కూడా ఎవరికీ అనుమతివ్వలేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకుండా హ్యుమన్ ట్రయల్స్ జరగబోవు అని.. ఇదీ ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతోందని తెలిపారు. సదరు వ్యక్తులు/కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

మంత్రి ఇలా..
ఆయుర్వేద మందులు రోగనిరోధక శక్తిని పెంచేందుకు పనిచేస్తాయి.. కానీ ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా వైరస్ నివారణ సాధ్యం కాదు అని అభిప్రాయపడ్డారు. కరోనిల్‌కు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో కలిసి హ్యుమన్ ట్రయల్స్ చేశామని, వైరస్ సోకిన రోగులు కరోనిల్ వాడి కోలుకున్నారని రాందేవ్ ప్రకటన చేశారు. దీనిపై దుమారం చెలరేగగా చివరికి రాజస్తాన్ ఆరోగ్యమంత్రి శర్మ లైన్లోకి వచ్చారు. అయితే క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి తీసుకున్నామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ తోమర్ చెప్పడం విశేషం.

విక్రయిస్తే చర్యలు
పతంజలి కరోనిల్ విక్రయించొద్దు అని, అలా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు అని శర్మ పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేంద్రం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, 1945 కింద ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గురించి ప్రస్తావించారు. అందులో ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా మందలు విక్రయించొద్దు అని స్పష్టంగా రాసి ఉంది. రాజస్థాన్ ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ, ఆయుష్, ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు కరోనా నివారణ కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఎవరైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలనుకుంటే.. వారు తప్పకుండా ఎథిక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని సూచించారు.