• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ: శ్మశానాల్లో ఖాళీ లేదు.. ప్రభుత్వ లెక్కల్లో తప్పులేదంటున్నారు.. మరి పెరిగిన మృతదేహాలు ఎక్కడివి?

By BBC News తెలుగు
|

కరోనా మరణాలు

తెలుగు రాష్ట్రాలలోని శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించారు.

కొన్నిచోట్ల సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలే అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

కోవిడ్ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలను ప్రభుత్వం తప్పుబడుతోంది.

కరోనా మృతుల సంఖ్యను దాచి పెట్టాల్సిన అవసరం లేదంటూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, శ్మశానాల్లో కనిపిస్తున్న వాస్తవాలకు పొంతన ఎందుకు కుదరడం లేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గడిచిన నాలుగు రోజులుగా మారిన పరిస్థితులతో కలవరపడుతున్నారు.

కరోనా మరణాలు

గుంటూరులో ఘోరంగా ఉంది..

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాల్లో పరిస్థితిని బీబీసీ పరిశీలించింది.

అన్ని చోట్లా ఈ నెల 20 తర్వాత శ్మశానాలకు వస్తున్న మృతదేహాల సంఖ్య పెరుగుతోంది.

గుంటూరు, విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నగరాల్లో శ్మశానాలకు వస్తున్న శవాల సంఖ్య దాదాపు రెట్టింపయినట్లు పరిశీలనలో తేలింది.

గుంటూరులో బొంగరాల బీడు ప్రధానమైన శ్మశానం.

దహన సంస్కారాల కోసం మరికొన్ని శ్మశానాలున్నప్పటికీ ఎక్కువ మంది అంత్యక్రియల కోసం ఇక్కడికే వస్తూ ఉంటారు.

బొంగరాలవీడులో ఈనెల 21న 49 మందికి, 22న 53 మందికి, 23న దాదాపు 50 మందికి అంత్యక్రియలు చేశారు.

అంతకుముందు సాధారణ రోజుల్లో అక్కడికి వచ్చే శవాల సంఖ్య సగటున 15 నుంచి 20 మధ్య ఉండేదని నిర్వాహకులు బీబీసీకి తెలిపారు.

అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఇదే మాట చెప్పారు.

కరోనా మరణాలు

విజయవాడలోనూ అదే పరిస్థితి

విజయవాడ నగరంలో నాలుగు శ్మశానాలున్నాయి. అయితే అందులో కృష్ణలంకలో ఉన్నదే ప్రధానమైనది. ఇక్కడ విద్యుత్ దహన వాటిక కూడా ఉంది. ఇక్కడ కూడా 20వ తేదీ తర్వాత మృతదేహాల సంఖ్య పెరిగింది.

ఏప్రిల్ 21న 34, 22వ తేదీన 37 చొప్పున మృతదేహాలు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. 23న వచ్చిన శవాల సంఖ్య 36కి పైనే ఉంటుందని అన్నారు.

సాధారణ రోజుల్లో విజయవాడలో అన్ని శ్మశానాలకు కలిపి సమీప గ్రామాల నుంచి కలుపుకుని సుమారుగా 30 శవాలు వచ్చేవని, ఈసారి ఒక్క కృష్ణలంక స్వర్గపురి శ్మశానానికే అంతకుమించి వస్తున్నాయని మృతదేహాల తరలింపులో సహాయం అందించే స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హార్ట్స్ ప్రతినిధి పి.మహేశ్ బీబీసీతో అన్నారు.

కరోనా కారణంగా ఆరుగురు పనిచేసే చోట ఇద్దరు మాత్రమే దహన సంస్కారాలకు హాజరుకావడం సమస్యగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు.

సిబ్బంది కొరతను సొమ్ము చేసుకునేందుకు అంబులెన్సులకు అద్దె పెంచడం, కొందరు దళారులు బాధిత కుటుంబాల నుంచి అధికంగా వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మహేశ్ అన్నారు.

కరోనా మరణాలు

విశాఖలో..

ఆంధ్రప్రదేశ్‌‌లోని అతిపెద్ద నగరాలలో ఒకటైన విశాఖపట్నంలో కాన్వెంట్ జంక్షన్‌లో ఉన్న శ్మశానవాటికే అతి పెద్ద ఆధారం. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికే శవాలను తీసుకుని వస్తుంటారు.

సాధారణ రోజుల్లో 20 లోపు మృతదేహాలు ఇక్కడికి వస్తుంటాయని సిబ్బంది చెబుతున్నారు.

కానీ గడిచిన మూడు రోజులుగా అవి దాదాపు రెట్టింపు సంఖ్యలో వస్తున్నట్టు కనిపిస్తోంది.

దహన కార్యక్రమానికి కూడా వేచిచూడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

'చావుల మదుం' గా పిలుచుకునే ఇక్కడి శ్మశానానికి 21వ తేదీన 30 శవాలు తీసుకొచ్చారు. 22న వాటి సంఖ్య 40కి చేరిందని సిబ్బంది అంటున్నారు.

22వ తేదీన అత్యధిక శవాలు వచ్చిన విషయాన్ని విశాఖ మున్సిపల్ కమిషనర్ సృజన కూడా ధృవీకరించారు.

కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ బీబీసీకి ఇచ్చిన సమాచారం ప్రకారం విమ్స్, కేజీహెచ్ ఆస్పత్రుల్లో ఒక్క 23వ తేదీనే 15మంది మరణించారు.

ఆ రెండు ఆస్పత్రులతో పాటుగా కోవిడ్ ఆస్పత్రిగా మారిన చెస్ట్ ఆస్పత్రి నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు వస్తున్నట్టు చెబుతున్నారు.

కరోనా మరణాలు

రాజమహేంద్రవరంలోనూ అదే పరిస్థితి...

రాజమహేంద్రవరంలో ప్రధాన శ్మశానాలు రెండు ఉన్నాయి. గోదావరి తీరంలో ఉండే వాటిని ఒకే సంస్థ నిర్వహిస్తోంది. డాక్టర్ పట్టపగలు వెంకట్రావు ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కైలాసభూములకు కూడా ఇటీవల ఒక్కసారిగా మృతదేహాల సంఖ్య పెరిగినట్టు చెబుతున్నారు.

ఈ నగరంతో పాటు సమీప గ్రామాల నుంచి రోజుకి సగటున 20 వరకూ మృతదేహాలు వస్తాయి. కానీ ప్రస్తుతం వాటి సంఖ్య 30 దాటింది.

లెక్కలు స్పష్టంగా లేకపోయినా గడచిన మూడు రోజుల్లో ఒక్కో రోజు 40కి పైగా మృతదేహాలు వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు.

ఇంటి దగ్గర సహజ మరణాలకు గురయ్యే వారి బంధువులు మహాప్రస్థానం రథం కోసం వేచి చూడాల్సి వస్తోందని రాజమహేంద్రవరంవాసులు కొందరు చెబుతున్నారు.

''బుధవారం ఉదయం మా నాన్నగారు చనిపోయారు. శవాన్ని తీసుకెళ్లేందుకు మహాప్రస్థానం వాహనం కోసం ఎన్నిసార్లు కబురు చేసినా వెంటనే రాలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్లు కూడా ఏమీ చేయలేని స్థితి. పైగా అక్కడికి వెళ్లిన తర్వాత గతంలో 2, 3 గంటల్లో పూర్తయ్యే కార్యక్రమం ఈసారి ఐదారు గంటలు పట్టింది. చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది'' అని ఆల్కట్ తోట ప్రాంతానికి చెందిన పి.శివ ప్రసాద్ బీబీసీతో అన్నారు.

కరోనా మరణాలు

ఇతర మతస్తుల సంఖ్య కూడా కలిపితే..

ఒక్క హిందూ శ్మశాన వాటికల్లోనే కాకుండా, ఇతర మతస్తులు ఉపయోగించే శ్మశానాల్లోనూ ఖననం కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.

విజయవాడలోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననానికి వచ్చే శవాల సంఖ్య పెరగడంతో అదనపు సిబ్బందిని కూడా నియమించినట్టు నిర్వాహకులు బీబీసీకి తెలిపారు.

అన్ని మతాల శ్మశాన వాటికలను లెక్కలోకి తీసుకుంటే, దాదాపు ప్రతి నగరంలోనూ మృతుల సంఖ్య రోజుకు 50 వరకు ఉంటోంది. అయితే వారిలో కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వారు కూడా ఉంటారని విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీ సిబ్బంది తెలిపారు.

''రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రి ఉన్న విజయవాడకి పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అనేకమందిని తీసుకొస్తున్నారు. వారిలో ఎవరైనా చనిపోతే తిరిగి వారిని సొంత ప్రాంతాలకు తీసుకెళుతున్నవారు చాలా తక్కువ.

అలాంటి వారికి ఆస్పత్రి సిబ్బందే కొందరితో మాట్లాడి అన్ని జాగ్రత్తల మధ్య కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. చాలాసార్లు కుటుంబీకులు రాకుండానే అవి పూర్తి చేయాల్సి వస్తోంది. అవి కూడా విజయవాడ లెక్కలోనే వేయడం కుదరదు'' అని కృష్ణ అనే ఉద్యోగి వివరించారు.

కరోనా మరణాలు

ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయి

ఈనెల 21న ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం గుంటూరులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, తూర్పు గోదావరిలో నలుగురు, కృష్ణా జిల్లాలో 10 మంది మాత్రమే కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 38 మంది మాత్రమే మరణించినట్టు నివేదికలో పేర్కొన్నారు.

ఇక 22వ తేదీ నాటి బులెటిన్ ప్రకారం కృష్ణా జిల్లాలో ఐదుగురు, గుంటూరు, తూ.గో జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా విశాఖలో ఒక్కరు మాత్రమే కోవిడ్ మృతులున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కేవలం 30 మంది కోవిడ్ బాధితులు మాత్రమే మృతి చెందినట్టు తెలిపారు.

ప్రభుత్వ లెక్కల్లో రాష్ట్రం మొత్తం మీద మరణించిన వారి సంఖ్యతో పోలిస్తే ఏపీలోని ఒక్కో నగరంలో శ్మశానాలకు వస్తున్న శవాల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది.

దీనిపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలకు పొంతన ఉండడం లేదనే అనుమానాలున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతోంది.

''కరోనా పాజిటివ్‌ కేసులు గానీ, మృతులను కానీ దాచి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్లలో వివరాలు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి మరణాన్ని సమీక్షిస్తున్నాం" అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

కరోనా మరణాలు

'కార్డియాక్ అరెస్ట్ మరణాలు ఎప్పుడూ ఇన్ని లేవు’

ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల నుంచి నేరుగా శ్మశానాలకు వస్తున్న మృతదేహాల సంఖ్య కూడా ఎక్కువే ఉంటోంది. అయితే వాటిలో అత్యధికంగా కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు)గా పేర్కొంటున్నారు.

''గతంలో గుండె సంబంధిత సమస్యలతో మరణించి, శ్మశానాలకు వచ్చే శవాల సంఖ్య రెండు, మూడు ఉండేవి. ఇప్పుడు వాటిని 15 నుంచి 20 వరకూ ఉంటున్నాయంటున్నారు.

ఆస్పతి నుంచి వస్తున్న శవాలను కూడా కరోనా బాధితులుగా కాకుండా కార్డియాక్ అరెస్టు మరణాలనే రాస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు'' అని విజయవాడలోని ఒక ఎన్జీవోకు చెందిన పి.మహేశ్ బీబీసీతో అన్నారు.

''ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒత్తిడికి గురై గుండె ఆగిపోతే అసలు సమస్య రాయడం చాలాకాలంగా ఉంది. కానీ ఇప్పుడు అది కార్డియాక్ అరెస్ట్ అన్నట్టుగానే చూపిస్తున్నారు. దీనికి కారణం తెలియదు.

శవాల సంఖ్య, సిబ్బందికి పనిభారం మాత్రం పెరిగింది. కోవిడ్ భయంతో పని చేసేందుకు కొత్త వారు రావడం లేదు. మేమే అన్ని జాగ్రత్తలతో శవాలను తరలించే ప్రయత్నం చేస్తున్నాం" అని మహేశ్ వెల్లడించారు.

ప్రభుత్వం లెక్కల్లో తేడా లేదని అధికారులు చెబుతుండగా శ్మశానాలకు వచ్చే శవాల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే కొన్ని కుటుంబాల్లో తమ బంధువుల మృతికి కరోనా కారణం అని రాయవద్దంటూ కోరుతున్న వారు కూడా ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యాధికారి వెల్లడించారు.

సామాజిక పరిస్థితుల కారణంగా కొందరి నుంచి ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

"ప్రతి శవం కాలడానికి మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతుంది. ఇంతకు ముందు ఎనిమిది నుంచి పది శవాలు వచ్చేవి. ప్రస్తుతం అవి 12 నుంచి 14కు పెరిగాయి. పైగా ఇవి ఉదయం పది గంటలు నుంచి సాయంత్రం మూడు గంటల లోపు వస్తాయి. అందుకే మహాప్రస్థానానికి వెళ్లినప్పుడు ముఖ్యంగా సాయంత్రం వేళలో ఎక్కువ శవాలు కాలుతున్నట్లు కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి సవ్యంగానే ఉందని గమనించాం" అని రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జ శ్రీకాంత్ చెప్పారు.

మొత్తంగా కారణాలు ఏమైనా శ్మశానాలు ఖాళీ లేని పరిస్థితి ఓ వైపు ఉండగా కరోనా కారణంగా మృతి చెందిన వారి జాబితా మాత్రం చాలా స్వల్పంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
AP: Cemetries are full,There are no mistakes in the government calculations, but increase in dead bodies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X