వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు: ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం భారీ నజరానాలు... ప్రతిపక్షాలు ఏం చేస్తాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఏపీ పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు కానీ, ఏపీలో మాత్రం రెండున్నరేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. వివిధ కారణాలతో పంచాయతీల పాలకవర్గాలు లేకుండా సాగిపోయిన ఆంధ్రప్రదేశ్ లో విభజనానంతరం తొలి ఎన్నికలకు ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.

గ్రామీణ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణ మీద తీవ్ర సందిగ్ధత తర్వాత ప్రస్తుతం పోటీ చేసే ఆశావాహుల సందడి మొదలవుతోంది. మరోవైపు ఏకగ్రీవాల కోసం అనేక చోట్ల ప్రయత్నాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం కూడా ఏకగ్రీవం కోసం ముందుకు రావాలంటూ నజరానా ప్రకటించిన తరుణంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.

గత ఎన్నికల్లో ఏం జరిగింది...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 జూలైలో పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. జూలై 23, 27, 31 తేదీలలో వాటిని నిర్వహించారు. అప్పట్లో మొత్తం 21,441 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 2,422 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ఆ తర్వాత శ్రీకాకుళం 202, నెల్లూరు జిల్లాలో194 గ్రామ పంచాయతీ సర్పంచ్ లోను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 31, కరీంనగర్ జిల్లాలో 40 పంచాయతీలు మాత్రం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.

కొన్ని గ్రామ పంచాయతీల్లో ముందుగానే ఒప్పందాల ప్రకారం ఏకగ్రీవాలు జరగ్గా, మరికొన్ని చోట్ల నామినేషన్లు చెల్లుబాటు కాకపోవడం సహా ఇతర కారణాలతో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయిన అనుభవం ఉంది.

ఏకగ్రీవ పంచాయతీలకు అదనంగా నిధులు

ఎన్నికల పేరుతో పల్లెల్లో వివిధ పక్షాలు తలపడకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తి చేసుకుంటే వారికి అదనపు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఏకగ్రీవ పంచాయతీలకు అదనపు నిధులు కేటాయించే పథకాన్ని 1960లో రాజస్తాన్ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి.

ప్రస్తుతం హరియాణా, తెలంగాణా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వీటిని అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2001 నుంచి వీటిని అమలు చేస్తున్నారు. 2006లో కూడా రాయితీలను ప్రకటించారు. పదేళ్ల తర్వాత 2013 వచ్చేనాటికి ఈ నజరానా అనేక రెట్లు పెరిగింది.

జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవ పంచాయితీలకు తాయిలాలు

2001 నుంచి జనాభా 5వేల లోపు ఉన్న పంచయాతీలకు 15 వేల రూపాయలు, 5-15 వేల మధ్య ఉంటే 30 వేల రూపాయలు, 15 వేల కన్నా ఎక్కువ జనాభా ఉంటే 50 వేల రూపాయల చొప్పున ఇచ్చారు.

2008లో వాటిని సవరించారు. రెండు కేటగిరీలుగా మార్చారు.

15 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 5లక్షలు, 15 వేలు పైబడిన పంచాయతీలకు రూ. 15లక్షలు చొప్పున కేటాయించారు.

2013లో అది మరింత పెరిగింది.

15వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ. 7 లక్షలు, 15వేలు పైబడిన గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున ప్రకటించారు.

ఈ నిధులను ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు బడ్జెట్‌ను బట్టి దశల వారీగా విడుదల చేసినట్లుగా గతంలో ఏకగీవ్రం అయిన పంచాయతీకి సర్పంచిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం అప్పలనర్సి తెలిపారు. "ఆదాయ వనరుల్లేని సీతంపేట ఏజన్సీలోని మా గ్రామాలకు అదనంగా రూ. 5 లక్షల నిధులు కేటాయించడమే గొప్పగా భావించాం. అయితే అది ఏకకాలంలో అందలేదు. దాని వల్ల కొంత సమస్య అనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత నిధుల పరిస్థితి మరింత సమస్య అయిపోయింది. దాంతో పంచాయతీలో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది" అని ఆయన తెలిపారు.

2013 పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 13 జిల్లాల్లో 1835 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. వాటికి ప్రోత్సాహకాలు గా ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతులను రూ. 128.45 కోట్లను 2015 ఏప్రిల్ 23న నాటి ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత పంచాయతీలకు అవి చేరడానికి మరింత సమయం పట్టిందని నాటి సర్పంచులు తెలిపారు.

2006 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వాటికి 2008 నవంబర్ లో నజరానా కింద నిధులు విడుదలయ్యాయి.

ఏకగ్రీవాల కోసం ప్రభుత్వ ప్రయత్నాలు

ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా జీవో ఆర్టీ నెం. 34ని విడుదల చేసింది. గతంలో 2013 నాటి జీవో నెం. 1274ని సవరించింది. అదనంగా కొత్త కేటగిరీలు చేశారు. గతంలో ఉన్న రెండు కేటగిరీల స్థానంలో ఈసారి 4 తరగతులుగా విభజించి పంచాయతీలకు ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు.

  • రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీకి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. గతంలో 2 వేల లోపు పంచాయతీలను ప్రత్యేకంగా విభజించలేదు.
  • అలాగే 2001 నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పక్షంలో రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహం అందిస్తారు.
  • 5001 నుంచి 10 వేల జనాభా వున్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల నగదు ప్రోత్సాహం అందుతుంది.
  • పదివేల కన్నా అధికంగా వున్న పంచాయతీలకు రూ.20 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.

ఏకగ్రీవాల ద్వారా పంచాయతీలకు ఎన్నికలు జరగడాన్ని ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, "స్వేచ్చాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే గ్రామాభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే ఈ ప్రోత్సాహకాలతో గ్రామాల అభివృద్ధికి మరింత తోడ్పడేందుకు నగదు బహుమతులు ప్రకటించాం. దేశంలోని పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. గతం కన్నా ఈసారి పెద్దమొత్తాలనే ఏకగ్రీవాల కోసం ఈ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నందున ఆ స్పూర్తితో ప్రజలు సోదరభావంతో తమ గ్రామాల అభివృద్ధికి, సంక్షేమానికి ఏకగ్రీవంగా ఎన్నికలను జరుపుకోవాలి" అని కోరారు.

గత ఏడాది ఏకగ్రీవాలపై వివాదం

కరోనా కారణంగా అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. పలు చోట్ల ప్రతిపక్షాల నేతలను నామినేషన్లు కూడా వేయనివ్వలేదనే విమర్శలు వచ్చాయి. అప్పట్లో వాయిదా పడిన నాటికి 2119 ఎంపీటీసీ స్థానాలతో పాటుగా 125 జెడ్పీటీసీలను కూడా ఏకగ్రీవంగా చేశారు. అందులో దాదాపుగా అధికార పార్టీకే 95 శాతం పైగా సీట్లు దక్కాయి. దాంతో ఇదంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారంటూ విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.

"గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నారు. ఎస్ఈసీ పటిష్టంగా వ్యవహరించాలి. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ బలగాల సహాయం తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల తీరుని సరిదిద్దాలి. ఏకగ్రీవాల కోసం ఇతర పార్టీల నేతలను బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం వంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. ఏకగ్రీవాలకు నజరానా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాలు తగవు. గత ఎన్నికల్లో చిత్తూరు , గుంటూరు జిల్లాల్లో భారీగా అక్రమాలు జరిగాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లను విధుల్లోంచి తొలగించడం దానికి నిదర్శనం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అవకాశం కల్పించాలి" అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.

ఏకగ్రీవాల కోసం వేలంపాటలు...

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవం జరిగితే మంచిదే కానీ అనేక చోట్ల భిన్నమైన పరిస్థితులున్నాయని స్థానిక స్వపరిపాలన పత్రిక ప్రతినిధి రామకృష్ణ అంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఆయన బీబీసీతో మాట్లాడారు.

"గ్రామ పంచాయతీల్లో ఒకనాటి పెత్తనం కొంతవరకూ సడలింది. కానీ నేటికీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ నేతల మాటే చెల్లుబాటు అవుతోంది. పథకాలు, ఇతర ప్రయోజనాలను చూపించి ప్రజలను లొంగదీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఏకగ్రీవాల కోసం పంచాయతీలలో వేలంపాటలు జరుగుతున్నాయి. గుడికి ఏదో చేయిస్తానని లేదంటే ఫలానా సంఘానికి ఏదో ఇస్తానని ఇలా ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పదవి కట్టబెట్టే రీతిలో వేలంపాటు సాగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరు ఎక్కువ వెచ్చిస్తే వారికే పంచాయతీ పదవులు కట్టబెట్టడం సరైనది కాదు. అలాంటి వాటిని అడ్డుకోవాలి. ప్రజలంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని గ్రామాభివృద్ధి కోసం సమిష్టి నిర్ణయాలు తీసుకునే పద్ధతిని మాత్రమే ప్రోత్సహించాలి" అంటూ వివరించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఏకగ్రీవ పంచాయితీల ప్రయోజనాల కోసం కసరత్తులు...

పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహిస్తే భారీ నజరానా ప్రకటించినప్పటికీ వాటిని విడుదల చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేయాల్సిన అనుభవం గతంలో ఉందని పలువురు మాజీ సర్పంచ్ లు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నికలు పూర్తి కాగానే ఆయా పంచాయతీలకు నిధులు జమయ్యేలా నిర్ణయం తీసుకోవాలని స్థానిక సంస్థల ప్రతినిధిగా పనిచేసిన పలివెల వీరబాబు అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ 'నేను సర్పంచ్ గా చేశాను. మా ప్రాంతంలో ఏకగ్రీవాలు జరిగిన పంచాయతీలున్నాయి. కానీ వాటికి ప్రకటించిన నజరానా సకాలంలో దక్కకపోవడంతో చాలా సమస్య అయ్యింది. పదే పదే డీపీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. పంచాయతీలకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మారాలి. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. పార్టీలు మారినా అన్ని ప్రభుత్వాలు అదే రీతిలో వ్యవహరించాయి. స్థానిక సంస్థలకు ఆదాయం వచ్చే ఇసుక సహా అనేకం ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు నిధుల కోసం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోంది. పైగా కొన్ని సార్లు కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటివి సరిదిద్దితేనే పంచాయతీలకు ఎక్కువ మేలు జరుగుతుంది' అంటూ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
AP Government announces rewards for unanimous elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X