• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆంధ్రప్రదేశ్: ‘ప్రత్యేక హోదా’, విశాఖ రైల్వేజోన్‌లను ఇవ్వాలంటూ స్థాయీ సంఘం సిఫార్సు - ప్రెస్‌రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసిందని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

''విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటులో జాప్యంపై వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) ఇంకా రైల్వే శాఖ పరిశీలనలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

జోన్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. తీసుకున్న చర్యలపై కమిటీకి నివేదిక అందజేయాలని సూచించింది. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు కనీసం పదేళ్లకు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ చర్య సమగ్ర అభివృద్ధికి, వాణిజ్యం, ఎగుమతుల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది.

'ఎగుమతులను పెంచేందుకు మౌలిక వసతుల విస్తరణ’ శీర్షికన రూపొందించిన 164వ నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ వి.విజయసాయిరెడ్డి శనివారం వర్చువల్‌ సమావేశం ద్వారా రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు సమర్పించారు.

కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడాన్ని కమిటీ ప్రశంసించింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, ఆర్థికాభివృద్ధికి, ఎగుమతుల పెంపునకు దోహదపడుతుందని పేర్కొంది.

ఇదే తరహాలో ఇతర కొత్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు కూడా తగిన పరిహారం చెల్లించాలని కమిటీ అభిప్రాయపడుతూ.. రాష్ట్రాల విభజన కారణంగా రాజధానులు కోల్పోయిన ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది’’అని సాక్షి తెలిపింది.

గ్రాఫిక్ చిత్రం

సైదాబాద్‌లో ఆరేళ్ల పాపపై హత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారంచేసి, ఆపై హతమార్చిన ఘటన తెలంగాణలోని సైదాబాద్‌లో వెలుగుచూసిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''నిందితుడు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు చెందిన రాజు (30) కొన్నేళ్ల క్రితం నగరానికి భార్యతో వచ్చి సైదాబాద్‌ సింగరేణికాలనీలో రేకుల షెడ్డులో ఉంటున్నాడు. అతడు ఆటో తోలుతుంటాడు. గంజాయికి బానిసై చిల్లర దొంగతనాలు కూడా చేస్తుంటాడు. అతడి వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గంజాయి మత్తులో ఉన్న అతడు.. తన గుడిసె సమీపంలో ఆడుకుంటున్న అరేళ్ల చిన్నారికి ఖారా పొట్లం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి 7 గంటల సమయంలో సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు వెంటనే సింగరేణి కాలనీ సమీప ప్రాంతాలతో పాటు, గణేశ్‌ మండపాల వద్ద సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో చిన్నారి కుటుంబ సభ్యులకు రాజుపై అనుమానం వచ్చింది.

అర్ధరాత్రి 12 గంటలకు గుడిసెవాసులు రాజు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా చిన్నారి నేలమీద విగతజీవిగా పడివుంది. స్థానికులు, నిందితుడి ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. నిందితుడిని అప్పగించేంత వరకు మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదని పోలీసులను అడ్డుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి.. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులపై గుడిసెలవాసులు కారం చల్లి, రాళ్లు, రేకులతో దాడి చేశారు. ఈ ఘటనలో సైదాబాద్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తలకు గాయం కాగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సహా నలుగురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

మహిళలపై అత్యాచారాలు

పుట్టింటికి వెళ్తానంటే భార్య ముక్కు కోసిన భ‌ర్త‌

పుట్టింటికి వెళ్తాన‌ని మెండికేసిన భార్య ముక్కును కూరగాయల కత్తితో కోసేసిన ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసిందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

''జోధ్‌పూర్ జిల్లాలోని లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్‌, పూనమ్ దేవి (25) భార్యాభ‌ర్త‌లు. అయితే ఇటీవ‌ల త‌ల్లిదండ్రుల‌కు జ్వ‌రాలు రావ‌డంతో వారిని ప‌రామ‌ర్శించి వ‌స్తాన‌ని పూన‌మ్ దేవి భర్త‌ను కోరింది.

కానీ భ‌ర్త రేపుమాపు అంటూ దాట‌వేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్ర‌వారం మ‌రోసారి పుట్టింటికి వెళ్లేందుకు భ‌ర్త అనుమ‌తి కోరింది. ఆరోజు కూడా భ‌ర్త వ‌ద్ద‌ని చెప్ప‌డంతో గొడ‌వ జ‌రిగింది.

క్ష‌ణికావేశంలో భూమా ఇంట్లో కూర‌గాయ‌లు కోసే క‌త్తితో పూన‌మ్ దేవి ముక్కు కోశాడు. ఇది గ‌మ‌నించిన ఇరుగుపొరుగు వాళ్లు పూన‌మ్ దేవిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

పూన‌మ్ దేవి పుట్టింటి వాళ్ల‌కు కూడా విష‌యం తెలిసింది. దాంతో ఆగ్ర‌హానికి గురైన పూన‌మ్ దేవి సోద‌రుడు ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన త‌ర్వాత‌ త‌న సోద‌రి పూన‌మ్ దేవిని తీసుకెళ్లి రాత‌పూర్వ‌కంగా కంప్లెయింట్ ఇప్పించాడు. దాంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌రారీలో ఉన్న భూమా కోసం గాలిస్తున్నారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఏపీ తదుపరి సీఎస్‌గా సమీర్‌శర్మ, అక్టోబరు 1న బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ నియమితులయ్యారని ఈనాడు తెలిపింది.

''ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా సమీర్‌శర్మను నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) రేవు ముత్యాలరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సమీర్‌శర్మ పోస్టును.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రణాళిక, వనరుల సమీకరణగా మారుస్తూ శుక్రవారం మొదట జీవో విడుదల చేశారు. ఆ వెంటనే ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ మరో జీవో ఇచ్చారు.

సమీర్‌శర్మ అక్టోబరు 1న కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కంటే సమీర్‌శర్మ సర్వీస్‌లో రెండేళ్ల సీనియర్‌. 1987 బ్యాచ్‌కు చెందిన ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం జూన్‌ 30తో ముగియాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం మూడు నెలల పొడిగింపు ఇచ్చింది.

ఆయన స్థానంలో సీఎస్‌గా నియమితులైన సమీర్‌శర్మ పదవీకాలం కూడా నవంబరు నెలాఖరున ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే గరిష్ఠంగా ఆరు నెలలు పొడిగింపు లభించే అవకాశమున్నందున.. ఆయన ఎనిమిది నెలలపాటు సీఎస్‌గా కొనసాగవచ్చని భావిస్తున్నారు’’అని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
AP:Resolution passed for special status and visakha railway zone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X