వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ సంక్షోభం: వెంకయ్యకు అంత ఉలుకెందుకు?

స్టాలిన్ ఆరోపణ చేసినందుకు కాదు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కోపం వచ్చింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడులో బీజేపీ బీనామీ ప్రభుత్వమే అన్నాడీఎంకే ప్రభుత్వం అని అసెంబ్లీలో విపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు మండిపడ్డారు.

2004 నుంచి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో ఉన్న డీఎంకే.. కాంగ్రెస్ పార్టీకి బినామీ ప్రభుత్వంగా తమిళనాడులో పాలన సాగించిందా? అని స్టాలిన్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. అన్నాడీఎంకే తమ మిత్రపక్షంగా మారితే తప్పేమిటని నిలదీశారు. కానీ ఇక్కడ మిత్రపక్షమా? కాదా? అన్నది సమస్య కాదు. ఒక ప్రాంతీయ పార్టీ సంస్థాగత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతోపాటు ఆ పార్టీ విధి విధానాలనే శాసించే స్థాయికి బీజేపీ చేరుకోవడాన్నే స్టాలిన్ ప్రశ్నించారు.

ఇక్కడ స్టాలిన్ ఆరోపణ చేసినందుకు కాదు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కోపం వచ్చింది. తమిళనాట తమ పార్టీ విస్తరణ కోసం మరో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న సంగతిని బహిరంగంగా స్టాలిన్ ప్రశ్నించడం వల్లే వెంకయ్యనాయుడు మండిపడటానికి అసలు కారణమని తెలుస్తున్నది.

ఇప్పుడు ఒక పార్టీ నేతగా మరో పార్టీ అందలానికి దారి

ఇప్పుడు ఒక పార్టీ నేతగా మరో పార్టీ అందలానికి దారి

ఆ మాటకు వస్తే ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పద్ధతులు భారత దేశ ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర పరిస్థితులకు భిన్నమైనవి. గతంలో పార్టీలు ఫిరాయించిన దాఖలాలు ఉన్నాయే గానీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉంటూ జాతీయ పార్టీ ఎదుగుదలకు మార్గం సుగమం చేసేలా... ఆ జాతీయ పార్టీ నాయకత్వం పావులు కదుపడం కొత్త సంప్రదాయంగా మారుతున్నది. 60 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని నరేంద్రమోడీ హావా ముందు చేష్టలుడిగి వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందు ఉండే వామపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో బీజేపీ ఎటువంటి ఎత్తులు వేసినా, వ్యూహాలు అమలుచేసినా పట్టించుకునే నాథుడే లేడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

1999లో కాంగ్రెస్ పార్టీ - జయ సంయుక్తంగా ఇలా

1999లో కాంగ్రెస్ పార్టీ - జయ సంయుక్తంగా ఇలా

తమిళనాట రాజకీయాలకు మరో చరిత్ర కూడా ఉన్నది. అది నెలకొల్పిన ఘనత కూడా కమలనాథులకే చెల్లుతుంది. 1998 ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతుతో బీజేపీ తమిళనాడులో పోటీ చేసి, కొన్ని సీట్లలో విజయం సాధించింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెర వెనుక లాబీయింగ్ ప్లస్ ‘షరతులతో కూడిన మద్దతు' పేరిట ముందుకు రావడంతో వాజ్‌పేయి ప్రభుత్వం కొలువుదీరింది. కానీ అన్నాడీఎంకే డిమాండ్లకు తలొగ్గకపోవడంతో జయలలిత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చేతులు కలిపారు. 1999 మే నెలలో వాజ్ పేయి ప్రభుత్వ పతనానికి కారణమయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. వాజ్ పేయి ప్రభుత్వంలో మిత్రపక్షానికి చోటు కల్పించింది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి బంధువు మురసోలి మారన్‌కు వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చారు.

వాజ్ పేయి సర్కార్ కు జయ పరోక్ష మద్దతు

వాజ్ పేయి సర్కార్ కు జయ పరోక్ష మద్దతు

కానీ 2001లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కరుణానిధిని దెబ్బతీసే లక్ష్యంతో తెర వెనుక నుంచి వాజ్ పేయి ప్రభుత్వానికి జయలలిత మద్దతు పలికారు. దీనిపై మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కూడా జయలలితకు మద్దతుగా నిలవడంతోపాటు దమ్ముంటే కేంద్రంలోని వాజ్ పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని డీఎంకేను సవాల్ చేశారు కూడా.

ఈ పరిస్థితుల్లో 2004 లోక్‌సభ ఎన్నికల నాటికి డీఎంకే అధినేత కరుణానిధితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి తదితరులు చర్చలు జరిపి తమ మిత్రపక్షంగా మార్చుకున్నారు. తర్వాత 2 జీ కేసులో కొంత దూరమైనా.. 2014 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీతోనే డీఎంకే కొనసాగుతుండగా, అన్నాడీఎంకే అధినేతగా జయలలిత.. ప్రధాని మోదీతో అనునిత్యం సంప్రదింపులు జరుపుతూ కీలక సమయాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తూ వచ్చారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌గా తంబి దురై ఎన్నిక కూడా దీన్నే సూచిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

జయకు మేలుచేసిన ఫెడరల్ ఫ్రంట్

జయకు మేలుచేసిన ఫెడరల్ ఫ్రంట్

కానీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షంగా మారేందుకు సిద్ధంగా లేని జయలలిత ఒంటరి పోరుకే మొగ్గు చూపారు. అయితే వైగో సారథ్యంలోని ఎండీఎంకే, విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకే, వామపక్షాలు, కొన్ని పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేయడం జయలలితకు లాభించింది. కానీ దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి కోలుకున్నా.. కొద్ది రోజులకే మరణించారు. తమిళ రాజకీయాల్లో రెండున్నర దశాబ్దాలకు పైగా ఎదురులేని నాయకురాలిగా ఉన్న జయలలిత మరణం తర్వాత ఆమె సారథ్యంలోని అన్నాడీఎంకే అంతర్గత కుదుపులకు గురవుతున్నది.

జయ నెచ్చెలిగా ఉన్న శశికళ.. పన్నీర్ సెల్వం స్థానే తానే సీఎం పదవిలో కూర్చునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ‘చెలి - నెచ్చెలి'లపై ఉన్న అక్రమాస్తుల కేసును తిరగదోడడం సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించడం చకచకా జరిగిపోయాయి. అంతటితో ఆగితే బాగానే ఉండేది. కానీ శశికళ తన అనుచరుడిగా ఉన్న ఎడపాడి పళనిసామిని సీఎంగా నిలిపి బెంగళూరు జైలుకు తరలి వెళుతూ.. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా తన అక్క కొడుకు దినకరన్‌ను నియమించడం.. ఆయన కూడా అధికారంపై లాలసతో జయ మరణంతో ఖాళీ అయిన ఆర్‌కే నగర్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందడంతోపాటు సీఎంగా పగ్గాలు చేపట్టాలని అత్యాశకు పోవడం మొదటికే మోసం వచ్చింది.

ఈసీకి దినకరన్ లంచం ఇవ్వబోయినట్లు..

ఈసీకి దినకరన్ లంచం ఇవ్వబోయినట్లు..

పార్టీ గుర్తు ‘రెండాకులు' కోసం కేంద్ర ఎన్నికల సంఘానికే రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపారని, అందులో భాగంగా ముందు రూ.1.30 కోట్లు మధ్యవర్తి ద్వారా ఇవ్వబోయారని వార్తలు రాగానే తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. ఒకనాటి తన సహచరుడు పళనిసామితో సయోధ్యకు సిద్ధమన్నారు. తన సీఎం పదవికి ఎసరు వస్తుండటంతో పళనిసామి కూడా సై అన్నారు. ఇక్కడే పన్నీర్ సెల్వం పట్టు బిగించారు. షరతులు విధించారు. వాటిని కాదంటే పార్టీ అస్తవ్యస్తమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. శశికళ అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలకూ పరిస్థితి అవగతమైంది. దినకరన్ మారిన పరిస్థితుల్లో చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. అన్నాడీఎంకేలోని రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిరితే.. దినకరన్‌పై ఉన్న కేసు హుష్ కాకి అన్నట్లు తేలిపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఇలా అన్నాడీఎంకే విలీనంపై బీజేపీ

ఇలా అన్నాడీఎంకే విలీనంపై బీజేపీ

ఈ దశలో పన్నీర్ సెల్వం తనకు సీఎం పదవి కావాలని, పార్టీ నుంచి శశికళ సారథ్యంలోని మన్నార్ గుడి మాఫియాను పూర్తిగా సాగనంపాలని షరతులు పెట్టారు. దీనిపై ఇరు వర్గాలు చర్చోపచర్చలు సాగిస్తున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో తమకు ఎటువంటి పాత్ర లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కానీ తమకు సానుకూల అవకాశాలు కనిపిస్తుండటంతో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయి సౌందర రాజన్.. రెండు గ్రూపులు కలిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. అది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఆమె అన్నా.. ఈ ఎపిసోడ్‌లో తెర వెనుక బీజేపీ పాత్ర పోషిస్తున్న సంగతి చెప్పకనే చెప్పారు. ఆ తర్వాతే డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్.. తమిళనాట బీజేపీ బీనామీ ప్రభుత్వంగా అన్నాడీఎంకే ప్రభుత్వం మారుతున్నదని ఆరోపణలకు దిగారు. సహజంగానే స్టాలిన్ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు ఆగ్రహం తెప్పించాయి.

మమత మద్దతుతో బెంగాల్‌లో బీజేపీ ఇలా

మమత మద్దతుతో బెంగాల్‌లో బీజేపీ ఇలా

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుర్మీల మద్దతు కూడగట్టేందుకు అప్నాదళ్ పార్టీ నేత అనుప్రియా పటేల్, ఆమె తల్లికి మధ్య బీజేపీ విభేదాలు స్రుష్టించినట్లు అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మణిపూర్‌లో పాగా వేసేందుకు ఆ రాష్ట్రంలో చిన్న చిన్న పార్టీలను దువ్వి, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా అడుగు పెట్టేందుకు గతంలో మమతాబెనర్జీ సారథ్యంలోని త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగారు. 2008 నాటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీని త్రుణమూల్‌తో స్నేహానికి దారి తీసినా 2010 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మమతా బెనర్జీ స్వరం మారింది.

శారద, నారదలతో బీజేపీకి మమతకు పెరుగుతున్న దూరం

శారద, నారదలతో బీజేపీకి మమతకు పెరుగుతున్న దూరం

2014 ఎన్నికల్లో మమతాబెనర్జీ, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ విడివిడిగా పోటీ చేయడంతో అధిక స్థానాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ శారద, నారదా కుంభకోణాలపై కేసుల నమోదుతో త్రుణమూల్, బీజేపీ మధ్య దూరం పెరుగుతున్నది. ఈ దూరంతో బెంగాల్ గడ్డపై ఆధిపత్యం సాధనకు కమలనాథులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. గమ్మత్తేమిటంటే ప్రాంతీయ పార్టీల మద్దతుతో పట్టు సాధించి.. తర్వాత వాటిని కరివేపాకులా తీసేసే పద్దతులను బీజేపీ, కమలనాథులు అనుసరిస్తున్నారని గత అనుభవాలు చెప్తున్నాయి.

ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ప్రత్యేకించిన నవీన్ పట్నాయక్, అఖిలేశ్ యాదవ్, నితీశ్ కుమార్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తెరిగి వ్యవహరిస్తే మంచిదని విశ్లేషకులు అభిప్రాయ పడ్తున్నారు. ప్రస్తుతం అధికారం ఉన్నదని కేంద్రం చెప్పిన ప్రతిదానికి తల ఊపితే తర్వాత నష్టపోయేదీ ప్రాంతీయ పార్టీలేనని పరిణామాలు తెలియజేస్తున్నాయని రాజకీయ విమర్శకులు అంచనా వేస్తున్నారు.

English summary
Union Minister M Venkaiah Naidu irked on MK Stalin on his comments per 'Anna DMK' government is BJP binami government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X