
హిందీ మీడియంలో సివిల్స్ రాసే వాళ్లు సక్సెస్ కాలేక పోతున్నారా
ఇటీవలే 2021 సివిల్స్ ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా 685 మంది విజయం సాధించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందని శ్రుతి శర్మ టాపర్‌గా నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 11 మంది 100లోపు ర్యాంకులు సాధించారు.
కానీ హిందీ మీడియంలో సివిల్ ఎగ్జామ్స్ రాసిన వారి సక్సెస్ రేట్ ఈసారి ఎక్కువగా కనిపిస్తోంది. హిందీ మీడియంలో పరీక్ష రాసిన వారిలో రవి కుమార్ సిహాగ్ 18వ ర్యాంక్, సునీల్ కుమార్ ధన్వంత 22వ ర్యాంక్ సాధించారు. సుమారు 7 ఏళ్ల తరువాత యూపీఎస్సీ పరీక్షల్లో హిందీలో పరీక్ష రాసిన అభ్యర్థులు టాప్-25లోకి రాగలిగారు. ఇంతకుముందు 2014 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో నిశాంత్ కుమార్ 13వ ర్యాంక్ సాధించారు.
కానీ కొద్ది సంవత్సరాలుగా హిందీ మీడియంలో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు పెద్దగా విజయం సాధించడం లేదనే వాదనలున్నాయి. యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించి 2013లో చేసిన మార్పులే ఇందుకు కారణమని కొందరు అంటున్నారు.
సివిల్స్‌లో విజయం సాధించిన వారు ఏ మీడియంలో పరీక్షలు రాశారో యూపీఎస్సీ వెల్లడించదు కాబట్టి, హిందీలో పరీక్షలు రాస్తున్న వారి గురించి కచ్చితమైన డేటా మనకు లభించదని సివిల్స్ కోచింగ్ ఇచ్చే కమల్‌దేవ్ సింగ్ చెబుతున్నారు.
సివిల్స్ పరీక్షల నిబంధనలు మార్చిన చాలా సంవత్సరాల తర్వాత ఈసారి హిందీ మీడియంలో రాసిన వారి పెర్ఫామెన్స్ బాగుందని సివిల్స్ కోచింగ్ ఇచ్చే ధర్మేంద్ర కుమార్ అన్నారు. 'దీనికే అంతా బాగుందని అనుకోకూడదు. 2019,2020 పరీక్షలకు సంబంధించి టాప్-100లో ఒక్క హిందీ మీడియం వ్యక్తి కూడా లేరు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా పరిస్థితి ఇలాగే ఉంది.' అని ధర్మేంద్ర కుమార్ వివరించారు.
- ఆర్మీ రిక్రూట్మెంట్: వయసు పెరిగిపోతోంది.. ఆర్మీలో చేరాలనే కల నిజమయ్యేది ఎప్పుడు?
- అల్లా, మొహమ్మద్ ప్రవక్తల ఫొటోలు ఎందుకు కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా?

హిందీ మీడియంలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారో ఎలా తెలుసుకోవాలి?
ప్రతి ఏడాది యూపీఎస్సీ విడుదల చేసే నివేదికలు, లాల్ బహుదర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎల్బీఎస్ఎన్ఏఏ)లో లభించే డేటాలను విశ్లేషించడం ద్వారా ఎంత మంది హిందీలో పరీక్షలు రాస్తున్నారో అంచనా వేస్తారని షాలిని సోమచంద్ర అన్నారు. కోచింగ్ సెంటర్లు చేపట్టే సర్వేల నుంచి కూడా కొంత సమాచారం లభిస్తుందని ఆమె చెబుతున్నారు.
యూపీఎస్సీ తీసుకొచ్చిన మార్పులపై ఎంతో కాలంగా ఆమె ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
'మెయిన్స్ సిలబస్ మార్చక ముందు టాప్-100లో ఎప్పుడూ 10 నుంచి 12 మంది హిందీ మీడియం వాళ్లు ఉండేవారు. 2013లో కొత్త సిలబస్ ప్రకారం సివిల్ ఎగ్జామ్స్ నిర్వహించారు. 2014లో ఫలితాలు రాగా టాప్-100లో జనరల్ కేటగిరి విభాగంలో హిందీ మీడియం నుంచి ఒక్కరు కూడా లేరు. ఒక్కరు కూడా ఐఏఎస్ కాలేక పోయారు. నాడు హిందీ మీడియంలో టాపర్ సాధించిన ర్యాంక్ 107. మొత్తం మీద 25 మంది మాత్రమే ఎంపికయ్యారు.' అని ధర్మేంద్ర కుమార్ చెప్పుకొచ్చారు.
ఆ తరువాత 2014 సివిల్స్ ఎగ్జామ్స్‌లో హిందీ అభ్యర్థుల పెర్ఫామెన్స్ కాస్త మెరుగుపడింది. సుమారు 5శాతం అభ్యర్థులు విజయం సాధించారు. నాడు హిందీ మీడియంలో టాపర్ సాధించిన ర్యాంక్ 13.
- 'నా భార్య నగ్న ఫోటోలు అప్పులు ఇచ్చే వారి దగ్గరకు ఎలా వెళ్లాయి’
- ఆంధ్రప్రదేశ్: డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మూడేళ్లుగా ఎందుకు ఆగిపోయింది? రైతులకు ప్రభుత్వ సమాధానం ఏంటి?

సక్సెస్ రేట్ 2-3శాతమే
ఎల్బీఎస్ఎన్ఏఏ వెబ్సైట్లో లభిస్తున్న సమాచారం ప్రకారం 2015,2016లలో హిందీ మీడియం అభ్యర్థుల సక్సెస్ రేట్ 4-5శాతంగా ఉంది. కానీ 2017,2018లలో అది 2-3శాతానికి పడిపోయంది.
2017 సివిల్స్ ఎగ్జామ్స్‌లో హిందీ మీడియం అభ్యర్థి సాధించిన టాప్ ర్యాంక్ 337. నాడు జనరల్ కేటగిరి నుంచి ఒక్కరు కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కాలేదు. ప్రస్తుతం 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఎల్బీఎస్ఎన్ఏఏ వెబ్సైట్లో లేదు.
2015లో హిందీ మీడియంలో మెయిన్స్ రాసిన వారి సంఖ్య 2,439. కానీ 2019లో ఇది 571, 2020లో ఇది 486కు పడిపోయింది. 2021లో పరీక్షలు రాసిన వారి డేటా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈసారి 50 నుంచి 60 మంది హిందీ మీడియం అభ్యర్థులు ఎంపికై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

వివాదం ఎప్పుడు మొదలైంది?
ఖన్నా కమిటీ సిఫారసుల మేరకు 2011లో సీశాట్(సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) తీసుకొచ్చారు. కానీ నాడు దేశవ్యాప్తంగా దీనిపై వివాదం చెలరేగింది. చాలా మంది వ్యతిరేకించారు. ఆ ఆందోళనలు నేటికీ ఉన్నాయి. ఇంగ్లిష్‌లో రాసే వాళ్లకు... మ్యాథ్స్, సైన్స్ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్లకు సీశాట్ అనుకూలంగా ఉందనేది ఆరోపణ.
ఆ తరువాత 2013లో మెయిన్స్ సిలబస్ మార్చారు. ఆప్షనల్ సబ్జెక్ట్స్‌కు సంబంధించి నాలుగు పేపర్లను రెండు పేపర్లకు తగ్గించారు. జనరల్ స్టడీస్ పేపర్లను రెండు నుంచి నాలుగుకు పెంచారు.
వైఫల్యం ఎవరిది?
ఇంగ్లిష్ ఆధిపత్యం వల్ల హిందీ మీడియం అభ్యర్థులు సరిగ్గా పెర్ఫామ్ చేయలేక పోతున్నారని రైల్వేబోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేం పాల్ శర్మ అంటున్నారు. 'దేశంలోని విద్య, భాషల గురించి ధనవంతులు మౌనంగా ఉంటున్నారు. అంటే వారు ఇంగ్లిష్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంగ్లిష్ మేలు చేసేది వారికే కాబట్టి.' అని ఆయన చెప్పుకొచ్చారు.
కానీ ఈ వాదనతో అంగీకరించని వాళ్లు కూడా ఉన్నారు.
ఈరోజుల్లో ఇంగ్లిష్ తప్పనిసరి అని సివిల్స్ అభ్యర్థులకు పొలిటికల్ సైన్స్ బోధించే మృత్యుంజయ్ కుమార్ అంటున్నారు. 'ఈ ఆధునిక ప్రపంచంలో అధికారులు అన్ని దేశాల వారితో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి వారికి ఇంగ్లిష్ రావడం తప్పనిసరి. ఇతర విషయాల మీద టైం వేస్ట్ చేసే బదులు ఇంగ్లిష్ నేర్చుకోవడం మీద అభ్యర్థులు దృష్టి పెట్టాలి.' అని ఆయన సూచిస్తున్నారు.
- టిప్పు సుల్తాన్ కట్టించిన జామియా మసీదు ఒకప్పుడు హనుమాన్ మందిరమా
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?

'అసలు సమస్య హిందీ అనువాదంతోనే...'
తమకు సమస్య ఇంగ్లిష్తో కాదని హిందీతోనే అని మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్ డాంగీ అంటున్నారు. 2021 సివిల్స్‌లో దీపక్ కూడా విజయం సాధించారు.
'సీశాట్ రాకముందు 4-5వేల మంది విద్యార్థులు హిందీలో మెయిన్స్ రాసేవారు. 2015లో సీశాట్ నుంచి ఇంగ్లిష్ తొలగించిన తరువాత ఈ సంఖ్య 5-6వందలకు పడిపోయింది. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి ప్రశ్నలను మెషిన్స్ సరిగ్గా అనువాదం చేయలేక పోవడమే ఇందుకు కారణం.' అని దీపక్ అంటున్నారు.
'రెండేళ్ల కిందటో ఏడాది కిందటో... శాసనోల్లంఘన ఉద్యమాన్ని సహాయనిరాకరణోద్యమంగా అనువాదం చేశారు. భూసంస్కరణలను ఆర్థిక సంస్కరణలుగా మార్చారు. ఇటువంటి అనువాద దోషాలు అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏదైనా తేడా వస్తే ఇంగ్లిష్‌లో ఉన్నదే చెల్లుతుందని యూపీఎస్సీ చెబుతోంది. కానీ ఇది సరికాదు.' అని దీపక్ అభిప్రాయపడ్డారు.
'సీశాట్తోనే ఇబ్బందులు...'
సీశాట్తోపాటు మెయిన్స్‌లో మార్పులు చేసిన నాటి నుంచి సమస్యలు మొదలయ్యాయని షాలిని సోమచంద్ర అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు, కళలు, హ్యుమానిటీస్ వంటివి చదివిన వాళ్లకు మార్చిన నిబంధనలు అవరోధంగా ఉన్నాయని చెబుతున్నారు.
'అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులు సమానంగా పోటీ పడాలనే ఉద్దేశంతో సీశాట్ తీసుకొచ్చారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. 2011తో పోలిస్తే నేడు 10శాతం హిందీ అభ్యర్థులు మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై కాగలుగుతున్నారు.' అని షాలిని అంటున్నారు.
ఇంగ్లిష్, మ్యాథ్స్, రీజనింగ్ వంటి అంశాల మీద పట్టు లేని అభ్యర్థులకు సీశాట్ కష్టంగా ఉంటోందని కమల్‌దేవ్ సింగ్ చెబుతున్నారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వారి సంఖ్య పెరిగితే హిందీ మీడియం అభ్యర్థుల పెర్ఫామెన్స్ కూడా పెరుగుతుందని ఆయన అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలపై పుతిన్ స్పందించారా? భారత్‌కు సలహా ఇచ్చారా?
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)