కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? వ్యాక్సినేషన్ కు ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !!
భారతదేశంలో ఇప్పటివరకు 1.63కోట్లకు పైగా ప్రజలకు కరోనావైరస్ వ్యాక్సినేషన్ కొనసాగింది . ఎవరిపైనా ఎక్కువగా ప్రతికూల ప్రభావం కనిపించనప్పటికీ, కొద్దిపాటి మందిలో మాత్రం కొన్ని దుష్ప్రభావాలు , అనారోగ్యం సంభవించింది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అనారోగ్యానికి గురైన కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొద్దిమందిలో దుష్ప్రభావం చూపించినంత మాత్రాన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
54 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ .. హర్యానాలోని కర్నాల్ లో స్కూల్ మూసివేత , సర్కార్ అలెర్ట్

టీకాలు తీసుకోవటానికి అవగాహన అవసరం అంటున్న టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి
మహారాష్ట్ర యొక్క కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ, భారతదేశంలో వాడుతున్న రెండు టీకాలు, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ మరియు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ యొక్క వెర్షన్ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ ఖచ్చితంగా సురక్షితమైనవని చెప్తున్నారు. చిన్న దుష్ప్రభావాలు కొన్ని సందర్భాల్లో, ఈ ప్రత్యేకమైన టీకాలకు మాత్రమే కాకుండా, ఇతర వ్యాక్సిన్లకు కూడా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెప్తున్నారు.

వ్యాక్సినేషన్ కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇక వ్యాక్సినేషన్ కు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలను చూస్తే
వ్యాక్సిన్ తీసుకోదలచుకున్న వ్యక్తికి అలెర్జీలు ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించి అన్నింటినీ స్పష్టంగా చెప్పి సలహా తీసుకోవడం ముఖ్యం. వైద్య సలహా ప్రకారం పూర్తి రక్త గణన (సిబిసి), సి-రియాక్టివ్ ప్రోటీన్ (సిఆర్పి) లేదా ఇమ్యునోగ్లోబులిన్-ఇ (ఐజిఇ) స్థాయిలను తనిఖీ చేసి ఆ తర్వాత వైద్యులు ఓకే చెప్తే వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
టీకాలు వేయడానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొందరికి బాగా తినాలి , మందులు తీసుకోవాలని సూచించినట్లు అయితే అలా చేయటం మంచిది.

డయాబెటిస్ , రక్త పోటు నియంత్రణలో ఉంటేనే వ్యాక్సిన్
వ్యాక్సిన్ తీసుకునే వారు వీలైనంత రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. కౌన్సెలింగ్ ఆందోళన చెందుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది. డయాబెటిస్ లేదా రక్తపోటు ఉన్నవారు వీటిని అదుపులో ఉంచుకోవాలి. క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కెమోథెరపీ ఉన్నవారు తప్పనిసరిగా వైద్య సలహా మేరకు పనిచేయాలి. కోవిడ్ -19 చికిత్సలో భాగంగా బ్లడ్ ప్లాస్మా లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ పొందిన వ్యక్తులు లేదా గత ఒకటిన్నర నెలల్లో సోకిన వారు ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకోకూడదని సూచించారు.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జాగ్రత్తలు
ఇక వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వస్తే ఏదైనా తీవ్రమైన అలెర్జీ వ్యాక్సిన్ కు ప్రతిచర్యగా వస్తే టీకా గ్రహీతను టీకా కేంద్రంలోనే పర్యవేక్షిస్తారు. తగిన వైద్య సహాయాన్ని అందిస్తారు. ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో నొప్పి మరియు జ్వరం వంటి దుష్ప్రభావాలు సాధారణం. దీనికి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చలి మరియు అలసట వంటి కొన్ని ఇతర దుష్ప్రభావాలు కూడా కలగవచ్చని అయితే ఇవి కొద్ది రోజుల్లోనే పోతాయని చెప్తున్నారు.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే
ఇక టీకాలు తీసుకున్నవారు గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే టీకాలు తీసుకున్న వెంటనే కరోనా వైరస్ నుండి ముప్పును నిరోధించలేవు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ నుంచి మన శరీరాన్ని రక్షించడానికి , రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తీసుకున్నవ్యాక్సిన్ పని చేయడానికి కొన్ని వారాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే నని వైద్యులు చెబుతున్నారు. అంటే టీకాలు వేసిన తర్వాత కూడా కరోనా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి రక్షణ చర్యలను మానుకో కూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.