బీజేపీకి అర్జున్, జాకీల ప్రచారం: మోడీకి అఖిలేష్ చెక్!
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీకి బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాకీష్రాఫ్‌లు ప్రచారం చేయనున్నారని సమాచారం.
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీకి బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాకీష్రాఫ్‌లు ప్రచారం చేయనున్నారని సమాచారం. ఈ విషయమై మంగళవారం అర్జున్ రాంపాల్, జాకీ ష్రాఫ్‌లు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు.
ఎన్డీయేఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రెండున్నరేళ్ల పాటు చేసిన కృషి నచ్చిందని రాంపాల్ మీడియాతో అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పట్టుదలను చూసి చాలా ఇంప్రెస్ అయ్యానన్నారు.

బీజేపీకి ప్రచారం
బీజేపీలో చేరతారా అని మీడియా అడిగితే.. ఇంకా దీని గురించి ఆలోచించలేదని తెలిపారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీకి యూపీ ఎన్నికలు కీలకంగా మారాయి.

అన్ని పార్టీలకు కీలకం
కాగా, మోడీ ప్రధానిగా రెండోసారి పీఠమెక్కాలన్నా, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీ గద్దెపై జెండా ఎగరేయాలన్నా యూపీ అసెంబ్లీ ఎన్నికలు కీలకం. ఇక్కడ గెలిస్తే దేశంలో సగం గెలిచినట్లేనని భావిస్తున్నారు. యూపీలో ఎన్నికలు ఇప్పుడు వేడి పుట్టిస్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలూ గెలుపు కోసం తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

2007 నుంచి మారిన పంథా
ఈ నేపథ్యంలో 403 మంది శాసన సభ్యులు, 80 మంది ఎంపీలను చట్టసభలకు పంపే ఈ రాష్ట్ర ఓటర్లు కీలక సమయంలో ఎలాంటి తీర్పు ఇస్తారో అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 2007కు ముందు మూడుసార్లు అస్పష్టమైన తీర్పు ఇచ్చిన యూపీ ఓటర్లు ఆ తర్వాత పంథా మార్చుకున్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

అలా అయితే అఖిలేష్‌కు తిరుగు లేదు
ఈసారి కూడా స్పష్టమైన తీర్పు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, యువత ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ కలహాలు సమసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఇలాగే ఉంటే అఖిలేశ్ యాదవ్ మరోసారి సీఎం అవుతారని చెబుతున్నారు. ఎస్పీ కలిసి ఉంటే ఆ పార్టీకి పెట్టని కోటగా ఉన్న ముస్లిం ఓటర్లు వారి వైపే ఉంటారంటున్నారు.

మాయావతి ఆశలు
బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్లు వేర్వేరు పార్టీలకు వలసపోవడంతో మాయావతి జోరు కాస్త తగ్గింది. 21.5 శాతం దళిత ఓటర్లు, బ్రాహ్మణ అనుకూల పార్టీ అనే ముద్ర, ముస్లింల మద్దతు బీఎస్పీని అధికారం పీఠంపై కూర్చోబెట్టాయి. ఇప్పుడు పరిస్థితి మారింది.

బీఎస్పీ ఆశలు నెరవేరేనా?
బీఎస్పీ బ్రాహ్మణ అనుకూల పార్టీ అనే ముద్రకూడా క్రమంగా చెరిగిపోతోంది. దళితుల ఓట్లన్నీ గంపగుత్తగా బీఎస్పీ పడతాయనే ఆశలు కూడా లేవంటున్నారు. దీంతో మళ్లీ సీఎం కావాలనే మాయావతి కలలు నిజం కాకపోవచ్చునని అంటున్నారు. సర్వేలు కూడా బీఎస్పీకి వ్యతిరేకంగా ఉన్నాయి.

ఆశజనకంగా లేని కాంగ్రెస్ పరిస్థితి
ఇక, దశాబ్దాల పాటు యూపీని ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగాలేదు. తనతో జతకట్టాలంటూ ప్రాంతీయ పార్టీలను బతిమిలాడే పరిస్థితిలో ఉంది. ఇతర పార్టీలతో కూటమిలకే ఇంకా పరిమితమయింది. కూటమి గెలిచినా కాంగ్రెస్ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. చిన్న పార్టీలతో జతక డితే తప్ప ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నాలుగో స్థానమే అని సర్వేలు చెబుతున్నాయి.

బీజేపీ ఇలా..
2014 లోకసభ ఎన్నికల్లో యూపీలో మెజారిటీ ఓటర్ల మనసులు గెలుచుకుని ఢిల్లీ పీఠాన్ని ఎక్కిన బీజేపీ ఈ ఎన్నికల్లో పాగా వేసి భవిష్యత్తును సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి మైనస్ కాగా, మోడీ ఆ పార్టీకి ప్రధాన ఆకర్షణ. పెద్ద నోట్ల రద్దును యూపీల ఎక్కువ మంది సమర్థించడం ఆ పార్టీకి ప్లస్. ఎస్పీ విచ్ఛిన్నమయితే బీజేపీ గెలుస్తుందని, లేదంటే కనీసం రెండో స్థానంలో ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications