హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాజనిత వార్తలొద్దు: స్పష్టం చేసిన భారత వైమానిక దళం
న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలోనూ అనేక కథనాలు వస్తున్నాయి. అయితే, చాలా వాటిలో ఊహాజనిత వార్తలే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో భారత వాయుసేన స్పందించింది. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సూచించింది.
ప్రమాద ఘటనపై దర్యాప్తును తాము త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విట్టర్ వేదికగా ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. డిసెంబర్ 8, 2021న జరిగిన ఘోర ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను శోధిస్తున్నామని, అందుకోసం వైమానిక దళం ట్రై సర్వీస్ కోర్టు ఆఫ్ ఎంక్వైరీ వేసిందని తెలిపింది. ఈ విచారణ త్వరితగతిన పూర్తవుతుందని పేర్కొంది.

వాస్తవాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవ మర్యాదను కాపాడాలని వాయుసేన పేర్కొంది. ఎటువంటి సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలి అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది. కాగా, హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఇప్పటికే త్రివిధ దళాలు సంయుక్త దర్యాప్తు ప్రారంభించాయని గురువారం పార్లమెంటులో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. మానవేంద్ర సింగ్ బృందం బుధవారం వెల్లింగ్టన్ కు చేరుకుని పని ప్రారంభించింది. ఘటనా స్థలం నుంచి అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దానిలో నిక్షిప్తమైన సమాచారాన్ని ఢీకొడింగ్ చేయనున్నారు. బ్లాక్ బాక్స్ లోని సమాచారంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ తోపాటు ఆయన సతీమణి, మరో 11 మంది సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాద ఘటనలో అమరులైన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్నాయి. ప్రస్తుతం వారి పార్థీవదేహాలకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.