Army helicopter Crash: ఘటనపై విచారణకు ఆదేశించిన ఐఎఎఫ్; రావత్ పై కొనసాగుతున్న ఉత్కంఠ
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్‌తో ప్రయాణిస్తున్న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కూలిపోయింది. సిడిఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, ఆయన సిబ్బంది, ఇతర అధికారులు ఈ హెలికాఫ్టర్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మరణించారని సమాచారం.

నీలగిరి హిల్స్ సమీపంలో హెలికాఫ్టర్ క్రాష్ .. బిపిన్ రావత్ పై ఇంకా లేని సమాచారం
మొత్తం ఈ హెలికాఫ్టర్ లో 14 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ ఈ హెలికాఫ్టర్ లో ఉండటం ఇప్పుడు ఒక్కసారిగా భారత రక్షణా వ్యవస్థను టెన్షన్ లోకి నెట్టింది. ఆయన గురించి కేంద్ర మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. తమిళనాడులోని కూనూర్ లోని నీలగిరి కొండల్లో ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాఫ్టర్ లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ తో పాటు మొత్తం 14 మంది ప్రయాణించినట్లు ఆర్మీ ధృవీకరించింది. తమిళనాడులోని వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీలో జనరల్ రావత్ ప్రసంగానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది.

ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన భారత వైమానిక దళం
హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చెయ్యనున్నారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించబడిందని భారత వైమానిక దళం (IAF) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొంది. వాస్తవ పరిస్ధితి తెలుసుకునేందుకు కూనూర్ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనా స్ధలికి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాటు పలువురు మంత్రులు, తమిళనాడు సీఎం స్టాలిన్ కాసేపట్లో వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో (కోయంబత్తూర్ మరియు సూలూరు మధ్య) లభ్యమైన మృతదేహాలను కూనూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్షించబడిన వారిలో కొందరిని తమిళనాడులోని వెల్లింగ్టన్లోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించనున్నారు.

హెలికాఫ్టర్ కెపాసిటీ 24 .. 14 మంది ఉన్నట్టు సమాచారం .. వివరాలివే
వివరాల ప్రకారం, రావత్ మరియు అతని భార్య, బ్రిగెడ్ ఎల్ ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్ కే గుర్ సేవక్ సింగ్, ఎన్ కే జితేంద్ర , లెఫ్టినెంట్ నాయక్ వివేక్ కుమార్, లెఫ్టినెంట్ నాయక్ , B సాయి తేజ మరియు హవ్ సత్పాల్ ఉన్నారని సమాచారం. తాజా నివేదికల ప్రకారం 14 మంది ప్రయాణికులు సూలూరు నుండి వెల్లింగ్టన్కు ప్రయాణించారు. స్థానిక పోలీసులు మరియు ఆర్మీతో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎనిమిది అంబులెన్స్‌లు అక్కడ సహాయక చర్యల కోసం ఉన్నాయి. ఈ హెలికాఫ్టర్ కెపాసిటీ 24 మంది అని సమాచారం.

బిపిన్ రావత్ ఇంటికి చేరుకున్న రాజ్ నాథ్ సింగ్, సూలూర్ ఎయిర్ బేస్ కు చేరుకున్న ఎయిర్ చీఫ్ మార్షల్
ఇదిలా ఉంటే సిడిఎస్ బిపిన్ రావత్ నివాసానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. ఆయన ఏం చెప్తారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిపిన్ రావత్ గురించి ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందో అన్న ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది. ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నట్లు వర్గాలు తెలిపాయి.