కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: పైలెట్లు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర దుర్ఘటన సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నీటాప్ వద్ద పర్వత శిఖరాల్లో సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో పైలెట్లు వీరమరణం పొందారు. నార్తరన్ కమాండ్‌కు చెందిన మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. విధి నిర్వహణలో భాగంగా నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తుండగా ఈ ఘటన సంభవించినట్లు ఆర్మీ నార్తరన్ కమాండ్ తెలిపింది.
వైమానిక దళానికి చెందిన బేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ ఉధంపూర్ జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దుల్లో పహారా కాయాల్సి ఉంది. నియంత్రణ రేఖ వద్ద నిఘా కార్యకలాపాలను పర్యవేక్షించాల్సి ఉంది. మార్గమధ్యలో ఉధంపూర్ సమీపంలోని పట్నిటాప్ కొండల మీదుగా ప్రయాణిస్తోన్న సమయంలో తొలుత హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో అప్పటికప్పుడు హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

ల్యాండ్ చేయడానికి అనుకూల ప్రదేశం లేకపోవడం వల్ల పట్నీటాప్ కొండల్లో క్రాష్ ల్యాండ్ చేయడానికి మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్ ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. భారీ శబ్దం చేస్తూ చెట్ల మధ్య కుప్పకూలింది. దీన్ని చూసిన పట్నీటాప్ ప్రజలు భారీ సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్ శకలాల నుంచి పైలెట్లను బయటికి తీశారు. వారిని కాపాడే సమయానికి ప్రాణాలతో ఉన్నారు వారిద్దరు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూశారు.
సమీప ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఇద్దరు పైలెట్లు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. వారిద్దరి మరణాన్ని ఆర్మీ నార్తరన్ కమాండ్ అధికారులు ధృవీకరించారు. పట్నీటాప్ కొండల్లో చోటు చేసుకున్న హెలికాప్టర్ దుర్ఘటనలో మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్ వీరమరణం పొందినట్లు నార్తరన్ కమాండ్ లెప్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.
Sadly both pilots have passed away in the crash landing on the chopper today in Udhampur. Rest in Peace. https://t.co/3aRp635S2Y
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 21, 2021
ఈ ఘటన పట్ల ఆర్మీ, వైమానిక, నౌకాదళాధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇద్దరు యోధులను కోల్పోయామని పేర్కొన్నారు. ఈ మేరకు వారి కుటుంబాలకు సంతాప సందేశాన్ని పంపించారు. ప్రమాదం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు. హెలికాప్టర్ ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల వల్లే ఈ దుర్ఘటనకు కారణమైనట్లు నార్తరన్ కమాండ్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.