అనుమానాస్పద స్థితిలో ఆర్మీ మేజర్ మృతి: తలలో బుల్లెట్ గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఓ మేజర్ ర్యాంక్ సైనికాధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
థానమండి ప్రాంతంలో ఆర్ఆర్ క్యాంప్‍లో మేజర్ మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే ఈ విషయాన్ని సీనియర్ ఆర్మీ అధికారులు, పోలీసులకు తెలియజేశారు. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ కూడా ప్రారంభించారు.

కాగా, మృతుడి తలపై తూటా గాయం ఉన్నట్లు గుర్తించామని రాజౌరీ జిల్లా ఎస్ఎస్పీ చందన్ కోహ్లీ వెల్లడించారు. సెక్షన్ 174 సీఆర్పీసీ కింద దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడిని మేజర్ వినీత్ గులియాగా గుర్తించారు. ఆయనది హర్యానా రాష్ట్రం. 38 ఆర్ఆర్ డేరాకి గలీ విభాగానికి కంపెనీ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.
నలుగురు జవాన్లు మృతి
ఇది ఇలావుండగా, మాచిల్ సెక్టార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్ఓసీ వద్ద ముష్కరులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది.
అనంతరం భద్రతా బలగాలు అక్కడ నిఘా పెంచాయి. కొద్ది సేపటికి భారీ సంఖ్యలో వచ్చిన ఉగ్రవాదులు భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారితోపాటు ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇక ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ మేరకు వివరాలను ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. కాగా, ఎల్ఓసీ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు. కాల్పుల్లో మృతి చెందినవారిలో తెలంగాణకు, ఏపీకి చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారు.