India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ రిక్రూట్‌మెంట్: వయసు పెరిగిపోతోంది.. ఆర్మీలో చేరాలనే కల నిజమయ్యేది ఎప్పుడు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్న అమ్మాయి

"అమ్మాయిలకు కూడా ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశం ఇవ్వడంతో ఏడాదిన్నరగా శిక్షణ తీసుకుంటున్నాను. రిక్రూట్ మెంట్ ర్యాలీలు జరగకపోవడంతో ఇంట్లో పెళ్లి చేసేస్తామంటున్నారు. ఉద్యోగం తర్వాతే పెళ్లి అని చెప్పుకుంటూ వస్తున్న. ఇక నా వల్ల కావడం లేదు. ఒక్క ప్రయత్నం చేయకుండానే నా లక్ష్యాన్ని వదులుకోవాలేమో" అని శ్రీకాకుళం ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న అభ్యర్థి సంజన అన్నారు.

"ఆర్మీ సోల్జర్ పోస్టుకి ఏజ్ లిమిట్ 23 ఏళ్లు. నాకు మరో రెండు నెలల్లో 23 ఏళ్లు పూర్తవుతాయి. మూడేళ్లుగా ప్రిపేర్ అవుతున్నా, రెండున్నరేళ్లు అయ్యింది ర్యాలీ జరిగి...రాబోయే రెండు నెలల కాలంలో రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగకపోతే...నా ఆర్మీ ఆశలు ఆవిరైపోయినట్లే" అని విశాఖపట్నం కు చెందిన మరో అభ్యర్థి కోదండ అన్నారు.

రెండున్నరేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలు జరగడం లేదు. కానీ ఆర్మీలో చేరాలనే తమ కలలను నిజం చేసుకోవాలనే ఆశతో యువత రిక్రూట్ మెంట్ ర్యాలీల కోసం ఎదురు చూస్తున్నారు.

ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు

ఈ ఏడాది మార్చి 20వ తేదీ దిల్లీ శివార్లలోని నోయిడాలో 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా ఆర్మీ ర్యాలీకి తన శరీరాన్ని సన్నద్ధంగా ఉంచేందుకు, నైట్ షిప్ట్ ముగించుకుని ఇంటి వెళ్తూ అర్థరాత్రి పరుగు తీశారు. ఇది దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అలాంటి ప్రదీప్ మెహ్రాలు అనేక మంది ఆర్మీ ఉద్యోగాల కోసం రోజూ శ్రమిస్తూనే ఉన్నారు.

"రోజూ శారీరక శిక్షణ, ఎంట్రన్స్ టెస్ట్ పాఠాలు వింటూ నెలలు గడిచిపోతున్నాయి. ఎప్పటీకప్పుడు ర్యాలీ నోటిఫికేషన్ వస్తుందనే ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. ఎప్పుడు ర్యాలీలు నిర్వహిస్తారో తెలియదు. ఆగిపోదామంటే ఇంతకాలం చేసిన ప్రయత్నం వృథా అయిపోతుంది అని అని చిత్తూరుకు చెందిన దొడ్డి లోకేష్ బీబీసీతో చెప్పారు.

"23 ఏళ్లు దాటితే రిక్రూట్ మెంట్ ర్యాలీలకు అనర్హులమవుతాం. ఇప్పటికే వయసు మీరిన వారు కూలీ పనులకు వెళ్తున్నారు. వెంటనే రిక్రూట్ మెంట్ తీయకపోతే మా భవిష్యత్తు ఏంటో అనే అందోళనగా ఉంది" అని అన్నారు.

దేశ వ్యాప్తంగా రెండున్నరేళ్లుగా రిక్రూట్‌మెంట్ ర్యాలీలు లేకపోయినా అడపాదడపా టెక్నికల్ పోస్టులు తీస్తున్నారు. అయితే అవి జనరల్ డ్యూటీ సోల్జర్స్ కాదు.

ఇటీవలే జనరల్ డ్యూటీ సోల్టర్ పోస్టుల ప్రకటన పుణే ఏఆర్వో (ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీస్) పరిధిలో ప్రకటించారు. దీనికి చివరి తేదీ మే 31.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలు కోవిడ్ తర్వాత జరగలేదు. గుంటూరులో 2021 మేలో ఫిజికల్ టెస్ట్ జరిగినా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించలేదు. దీంతో ఈ ర్యాలీకి సంబంధించి రిక్రూట్ మెంట్ పూర్తి కాలేదు.

ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు

'ఏడాదికి 100 ర్యాలీలు'

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏటా దేశంలోని అన్నిప్రాంతాలను కవర్ చేస్తూ వంద వరకు ఆర్మీ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. సైన్యంలోకి చేరాలని ఆసక్తి చూపే యువత కోసం కనీసం ఆరు నెలలకు ఒక ర్యాలీ చప్పున్న నిర్వహించాలని ఆయన సూచించారు.

సాధారణంగా ప్రతి ఆరు లేదా మూడు నెలలకు ఒక ఆర్మీర్యాలీ ఆ జోనల్ లేదా ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీస్ పరిధిలో జరగుతూనే ఉంటుంది. కానీ కోవిడ్ పరిస్థితులతో అది సాధ్యపడలేదు.

దీనికి సంబంధించి రక్షణ శాఖ రాజ్యసభకు అందించిన వివరాల ప్రకారం... "దేశంలోని 2020-21లో 97 ర్యాలీలు నిర్వహించాలని అనుకున్నా అందులో 47 నిర్వహించగలిగాం. అందులో నాలుగింటికే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి, వారిని రిక్రూట్ చేసుకున్నాం. ఆ తర్వాత 2021-22లో 87 ర్యాలీలు అనుకుంటే కేవలం 4 మాత్రమే నిర్వహించగలిగాం. వారికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించలేకపోవడంతో, రిక్రూట్ మెంట్ జరగలేదు. 2018-19లో 53,431 మంది, 2019-20లో 80,572 మంది సైన్యంలో రిక్రూట్ అయ్యారు. ఏటా సాధారణంగా సైన్యంలో 60 నుంచి 70 వేల మంది రిటైర్ అవుతుంటారు".

ఏటా రక్షణ రంగ అవసరాలకు తగిన విధంగా ఆర్మీ ర్యాలీలు నిర్వహించలేకపోతే దాని ప్రభావం ఆర్మీ శక్తిసామర్థ్యాల ప్రదర్శనపై కనిపిస్తుంది.

కోవిడ్ కారణంగా రిక్రూట్ మెంట్ ర్యాలీలు నిర్వహించలేకపోతున్నామని రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ర్యాలీల నిర్వహణ జరిగినా...అదంతా ముగిసి, శిక్షణ పొంది సైన్యంలో చేరడానికి ఏడాదిన్నర పడుతుందని ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు తెలిపారు.

ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు

'ఆర్మీ స్వాగతమంటే...ఇంట్లో పెళ్లి అంటున్నారు'

ఇప్పటివరకు ఇంటర్‌ చదివిన, పెళ్లికాని అబ్బాయిలు మాత్రమే సైన్యంలో ప్రవేశాలకు అర్హులు. ఈ నిబంధన వల్ల అమ్మాయిలు అవకాశాలు కోల్పోతున్నారంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అమ్మాయిలను కూడా ఆర్మీ అనుమతించాలని ఆదేశాలిచ్చింది.

దీంతో అమ్మాయిలు కూడా ఆర్మీ జనరల్ డ్యూటీ సోల్జర్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు శిక్షణ పొందుతూ, ర్యాలీలు కోసం ఎదురు చూస్తున్నారు.

"ఆర్మీలో చేరడం, నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఆడపిల్లకెందుకు ఉద్యోగం? పైగా ఆర్మీ ఉద్యోగం. వాళ్లైమైనా దేశాన్ని ఉద్దరించాలా, పెళ్లి చేసేయండి అంటూ కొందరు మా నాన్నపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మాత్రం ఆర్మీకి వెళ్లి దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నాను" అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జమున బీబీసీతో చెప్పారు.

"అబ్బాయిలే కాకుండా మేం సైన్యంలో చేరి దేశం కోసం పని చేస్తాం. అయితే ర్యాలీలు నిర్వహించకపోవడంతో ఇంట్లో వాళ్ల ఒత్తిడికి తలొగ్గాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది" అని అన్నారు.

ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు

"మా తల్లిదండ్రులకు ఇద్దరం అమ్మాయిలమే. నేను ఆర్మీలో చేరాలని శిక్షణ పొందుతున్నాను. రోజూ కష్టపడుతున్నాం కానీ, రిక్రూట్ మెంట్ ర్యాలీలు లేవు. హాస్టల్ ఫీజు, బుక్స్, ఫుడ్, యూనిఫాం ఇలా నెలకు ఐదారు వేల రూపాయల ఖర్చు అవుతుంది" అని ఆర్మీ ఉద్యోగ శిక్షణ పొందుతున్న మరో యువతి సంజన అన్నారు.

"ప్రస్తుతానికి ఇంటి దగ్గర గడవడమే కష్టంగా ఉండటంతో, మాపై ఖర్చు పెట్టడానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ర్యాలీలు జరిగితే మాకు జాబ్ వచ్చినా, రాకపోయినా మా ప్రయత్నం మేం చేసే వీలుంటుంది" అని అన్నారు.

సంజన, జమునలది గ్రామీణ నేపథ్యం. వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ పొలం పనులు చేసేవారే.

'ర్యాలీలు తగ్గిపోయాయి, వయసు పెరుగుతోంది'

ఆర్మీలో సోల్జర్ స్థాయిలో చేరాలనుకునే వారికి కనీస వయసు 17.5 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 23 ఏళ్లు ఉండాలి. రిక్రూట్ మెంట్లో రిజర్వేషన్లు వర్తించవు.

34 ఏళ్ల వయసు వరకు కూడా కొన్ని ఆర్మీ ఉద్యోగాలున్నా అవి హాయ్యర్ క్వాలిఫికేషన్ తో ఉంటూ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటాయి.

సోల్జర్ స్థాయిలో టెన్త్/ఇంటర్ అర్హతతోనే వేల ఉద్యోగాలు ఉంటాయి. దీంతో ఇంటర్, డిగ్రీ చదువుతూనే ఆర్మీ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటారు. శిక్షణ పొందుతున్న ర్యాలీలు నిర్వహించకపోవడంతో చాలా మందికి వయసు పెరిగి డిస్ క్వాలిఫై అవుతున్నారు.

17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్నవారు సైన్యంలోని ఉద్యోగాలకు అర్హులు. ఈ వయసులో ఆర్మీలో ఉద్యోగం సంపాదించి దేశానికి సేవ చేసుకునే అవకాశం, కుటుంబాన్ని ఆర్థికంగా సెటిల్ చేసే అవకాశం కోసం కష్టపడుతుంటారని ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ నిచ్చే బి. వెంకటరమణ బీబీసీతో చెప్పారు. .

"రెండున్నరేళ్లుగా ర్యాలీలు తీయకపోవడం వల్ల వయసు పెరిగిపోయి కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు ఆర్మీ ఉద్యోగాలపై ఆశలు వదుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఒక ఆర్మీరిక్రూట్ మెంట్ ఆఫీస్ పరిధిలో ఏటా రెండు ర్యాలీలు జరగాలి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది శిక్షణను వదిలి, కూలీ పనులకు వెళ్తున్నారు" అని చెప్పారు.

ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్న అమ్మాయి

ఏపీలో విశాఖ, గుంటూరు...తెలంగాణలో సికింద్రాబాద్ ఏఆర్వోలు

కొన్ని జిల్లాలను కలిపి, అక్కడ ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసులను రక్షణ శాఖ నిర్వహిస్తుంది. అలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, గుంటూరులలో, తెలంగాణలో సికింద్రాబాద్ లో ఉన్నాయి. వీటిలో ఏటా రెండు ర్యాలీలు నిర్వహిస్తే ఆరు ర్యాలీలు జరుగుతాయి. ఈ కార్యాలయాలు ఆర్మీ ర్యాలీలు నిర్వహించి, రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తాయి.

ఒక్కో ర్యాలీలో కనీసం 50 వేల మంది, గరిష్ఠంగా లక్ష మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒక్కో ర్యాలీ నుంచి మూడు వేల నుంచి ఐదు వేల మంది సెలక్ట్ అవుతుంటారు. వారిలో అన్ని పరీక్షలు పూర్తి చేసి కనీసం రెండు వేల మందైనా ఆర్మీలో చేరతారు" అని రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి శ్రీధర్ దీక్షిత్ బీబీసీతో చెప్పారు.

"కానీ రెండున్నరేళ్లుగా దేశంలో ఎక్కడా ర్యాలీలు నిర్వహించలేదు. 2021 మేలో గుంటూరు ఏఆర్వోలో ఒక ర్యాలీ నిర్వహించారు. దానికి ఫిజికల్, మెడికల్ అయ్యాయి, కానీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరగలేదు. ఇప్పుడు ఆ ర్యాలీ ఫలితాలు పరిశీలనలోకి తీసుకుంటారో లేదో తెలియదు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Army Recruitment: The age is increasing .. When will the dream of joining the Army come true
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X