అర్నబ్ గోస్వామి అరెస్ట్.. ముంబైలో హైడ్రామా.. జుట్టుపట్టుకుని కొట్టారని ఆరోపణలు...
ప్రముఖ జర్నలిస్ట్,రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి ఇంట్లో బుధవారం(నవంబర్ 4) హైడ్రామా చోటు చేసుకుంది. ముంబై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలను రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. అరెస్ట్ అనంతరం అర్నబ్ గోస్వామి పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. ముంబై పోలీసులు తనతో పాటు తన భార్య,కుమారుడు,అత్త-మామలపై కూడా భౌతిక దాడి చేశారని ఆరోపించారు.
జుట్టు పట్టుకుని లాగారు.. కొట్టారు : రిపబ్లిక్ టీవీ
అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై రిపబ్లికన్ టీవీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై పోలీసులు దుందుడుకుగా వ్యవహరించారని... ఓ టెర్రరిస్టునో లేదా హంతకుడినో అరెస్టు చేసినట్లుగా అర్నబ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించింది. అరెస్టు సమయంలో అర్నబ్‌ను పోలీసులు జుట్టు పట్టుకుని లాగారని.. భౌతిక దాడి చేశారని ఆరోపించింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అర్నబ్‌ను రాయ్‌గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేకించి ఏ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
20-30 మంది పోలీసులు చుట్టుముట్టి..
దాదాపు 20-30 మంది సాయుధ పోలీసులు అర్నబ్‌ను చుట్టుముట్టి బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారని రిపబ్లికన్ టీవీ జర్నలిస్ట్ ఒకరు ఆరోపించారు. పోలీసుల చేతుల్లో ఏకె-47 గన్స్ ఉన్నాయని... ఒక జర్నలిస్టును అరెస్ట్ చేసేందుకు ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించారు. ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో... మార్గమధ్యలో ఒక వ్యాను నుంచి మరో వ్యానులోకి ఎక్కించారని అన్నారు. అర్నబ్‌ను ఏ కేసులో అరెస్ట్ చేశారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నది తెలియదని అన్నారు. పోలీసుల దౌర్జన్యాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

గతంలో మూడు కేసులు...
అర్నబ్ గోస్వామిపై ఇటీవల టీవీ టీఆర్పీ స్కామ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో పాల్ఘర్ మూక హత్య కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఓ కేసు నమోదైంది. లాక్ డౌన్ సమయంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు భారీ ఎత్తున వలస కూలీలు చేరుకున్న సందర్భంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనాలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై కూడా అర్నబ్‌పై గతంలో కేసు నమోదైంది. అయితే ఈ మూడింటిలో ఎప్పుడు ఏ కేసులో అర్నబ్‌ను అరెస్ట్ చేశారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.