బిగ్ సస్పెన్స్ : గ్యాంగ్‌స్టర్ దూబేది అరెస్టా.. లొంగుబాటా.. యూపీ పోలీస్ ఇమేజ్ డ్యామేజ్?
జూలై 3న కాన్పూర్‌లోని బిక్రు గ్రామంలో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని ఎట్టకేలకు గురువారం(జూలై 9) పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది అరెస్టా... లేక దూబేనే పోలీసులకు లొంగిపోయాడా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటివరకూ పోలీసులు అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు మధ్యప్రదేశ్ పోలీసులు దూబేని పట్టుకోవడం ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. దూబే నేపాల్ పారిపోయి ఉంటాడని అక్కడి పోలీసులు చెబుతున్న తరుణంలో.. అతను ఉజ్జయినిలో పట్టుబడటం యూపీ పోలీసులకు ఇబ్బందికరంగా పరిణమించింది.

అరెస్టా... లొంగుబాటా..
దూబే అరెస్టుపై రకరకాల కథనాలు వినిపిస్తుండటంతో పోలీసులు దీనిపై వివరణ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. గురువారం ఉదయం 7గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయానికి వెళ్లిన దూబేని మొదట సెక్యూరిటీ గార్డు గుర్తించారని,వాళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చారని ఒక కథనం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే మొదట అతన్ని గుర్తించింది ఓ దుకాణదారుడు అని మరో కథనం వెలుగుచూసింది. దూబేనే సెక్యూరిటీ సిబ్బంది వద్దకు వెళ్లి.. తాను లొంగిపోతానని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పాడన్నది ప్రచారంలో ఉన్న ఇంకో కథనం.

ప్రచారంలో పలు కథనాలు...
దూబే ఆలయం లోపలి నుంచి తిరిగొస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించారని... ఆ సమయంలో నకిలీ ఐడీ కార్డు చూపించాడన్న ప్రచారం కూడా ఉంది. గట్టిగా ప్రశ్నించినందుకు సెక్యూరిటీ పైనే దాడికి పాల్పడ్డాడని... దాంతో అతన్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఇలా దూబే అరెస్టుకు సంబంధించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉండటంతో... అతనిది అరెస్టా.. లేక లొంగుబాటా అన్నది సస్పెన్స్‌గా మారింది.మధ్యప్రదేశ్ వర్గాలు చెబుతున్న ప్రకారం... దూబే ఉజ్జయిని ఆలయంలో దాదాపు 2 గంటలు అటు ఇటు తిరిగాడు. అతని కదలికలను నిశితంగా గమనించిన ఓ పూల వ్యాపారి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా.. వారి పైనే తిరగబడి దాడి చేశాడు. ఈ క్రమంలో అతను పారిపోయేందుకు యత్నించగా.. సెక్యూరిటీ అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఖల్ నాయక్ తరహాలో...
దూబే అరెస్టుకు సంబంధించి ఓ వీడియో వెలుగుచూసింది. పోలీస్ వ్యానులోకి ఎక్కిస్తుండగా... 'వీడు వాడేనా..?' అంటూ ఒకరు ప్రశ్నించగా... 'నేను వికాస్ దూబే.. కాన్పూర్ వాలా..' అంటూ దూబే బిగ్గరగా అరిచాడు. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి అతని తలపై చేతితో కొట్టి వ్యానులోకి ఎక్కించాడు. 'మైన్ హూన్ వికాస్ దూబే' అంటూ దూబే చెప్పడం... ఖల్నాయక్ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను తలపించింది.

యూపీ పోలీసులు ఫెయిల్ అయ్యారా?
దూబే మధ్యప్రదేశ్‌లో పట్టుబడగా.. అంతకుముందు, ఉత్తరప్రదేశ్ పోలీసులు అతను ఇండో-నేపాల్ సరిహద్దు దాటి నేపాల్‌లోకి వెళ్లి పోయి ఉంటాడని చెప్పారు. ఈ మేరకు ఇంటలిజెన్స్ తమకు సమాచారం ఇచ్చిందని.. ఆ ప్రాంతంలో ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు,ఇండో-నేపాల్ సరిహద్దు అటవీ ప్రాంతంలోనూ గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇలా ఇండో-నేపాల్ బోర్డర్‌పై ఫోకస్ చేయగా... దూబే మాత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పట్టుబడటం గమనార్హం. దీంతో యూపీ పోలీసులకు ఇది ఒకింత ఇబ్బందికరంగా పరిణమించిందనే చెప్పాలి.

యూపీ సీఎం ఫైర్... సోషల్ మీడియాలో సెటైర్స్...
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ దూబే అరెస్టుపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. దూబే అరెస్టు నాటకీయంగా ఉందని వ్యాఖ్యానించారు. అతని అరెస్టుపై యూపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని... అది అరెస్టా.. లేక లొంగుబాటా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు దూబే అరెస్టుపై బీజేపీ వ్యతిరేకులు సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దూబేకి బీజేపీతో లింకులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. 2024లో అతనికి కాషాయ పార్టీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని సెటైర్స్ వేస్తున్నారు.