
ఉల్లంఘన: కేంద్రమంత్రి మిశ్రాకు అరెస్ట్ వారెంట్ జారీ
ఫిలిబిత్: కేంద్రమంత్రి కల్రాజ్మిశ్రాకు మంగళవారం స్థానిక కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. 2009లో సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ విషయమై మిశ్రా ఇప్పటికే కోర్టు ఎదుట కావాల్సి ఉన్నా హాజరు కాలేదు. ఈ కేసులో వచ్చే నెల(మే) 21న జరుపనున్న విచారణకు హాజరుకావాలని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అబ్దుల్ కయ్యూమ్.. మిశ్రాను ఆదేశించారు. మిశ్రాపై 2009 మార్చి 28న ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.

వేర్పాటువాదుల అరెస్ట్
శ్రీనగర్: ఇద్దరు కాశ్మీర్ వేర్పాటువాదులను జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కాశ్మీర్లో అనుమానిత ఉగ్రవాదుల అలికిడి సమాచారం తెలుసుకున్న సైన్యం, మరికొందరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
వీరిద్దరు కూడా పుల్వామా జిల్లాలోని ట్రాల్ అనే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించింది. వీరిని సైన్యం హత మార్చిన అనంతరం ట్రాల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు బారీగా బలగాలు మోహరించాయి.
అదే సమయంలో కాశ్మీర్ వేర్పాటు వాదులైన మహ్మద్ యాసిన్ మాలిక్, మస్రత్ అలాం భట్ పుల్వామా జిల్లా వైపే వెళుతుండగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా నిలువరించేందుకు పోలీసులు వారిని అవంతిపురా వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.