వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ముఖ్య‌మంత్రి బంగ‌ళాకు నిప్పు పెట్టిన ఆందోళ‌న‌కారులుః పోలీస్ క‌మిష‌నర్ ఇంటికి కూడా

|
Google Oneindia TeluguNews

ఇటాన‌గ‌ర్ః ఈశాన్య రాష్ట్రం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. అక్క‌డి మంచుకొండ‌ల్లో మంటుకున్నాయి. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే రాజ‌ధాని ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. ఆందోళ‌న‌లతో అట్టుడికిపోతోంది. ఈ ఆందోళ‌న‌లు ఆదివారం ప‌తాక‌స్థాయికి చేరుకున్నాయి. ఆందోళ‌న‌కారులు ఏకంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిపై దాడి చేశారు. ఆయ‌న బంగ‌ళాకు నిప్పుపెట్టారు. బంగ‌ళా ఆవ‌ర‌ణ‌లో నిలిపి ఉంచిన కార్లు, ఇత‌ర వాహ‌నాలతో పాటు అక్క‌డి సామాగ్రిని త‌గుల‌బెట్టారు. ఇటాన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ అధికారిక నివాసానికి కూడా నిప్పంటించారు. పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీస్ క‌మిష‌న‌ర్ కు గాయాల‌య్యాయి. ఆయ‌నను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డి ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పింది. దీనితో కేంద్ర‌ప్ర‌భుత్వం ఇటా న‌గ‌ర్‌కు సైన్యాన్ని పంపించింది. క‌ర్ఫ్యూ విధించింది. క‌నిపిస్తే కాల్చివేత ఉత్త‌ర్వులు జారీ అయ్యాయంటే అక్క‌డి ప‌రిస్థితి ఎంత ఉద్రిక్తంగా అర్థం చేసుకోవ‌చ్చు. దాడి స‌మ‌యంలో ఉప ముఖ్య‌మంత్రి చౌవ్నా మెయిన్ ఇంట్లో లేరు. ప‌రిస్థితిని గ‌మ‌నించి పోలీసులు.. ఆదివారం తెల్ల‌వారు జామున ఆయ‌న‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను మ‌రో ప్రాంతానికి సుర‌క్షితంగా త‌ర‌లించారు.

 కార‌ణాలేంటీ?

కార‌ణాలేంటీ?

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కొన్ని ద‌శాబ్దాలుగా స్థానికేత‌ర తెగ‌లు, కులాల‌వారు నివ‌సిస్తున్నారు. ఆ రాష్ట్ర శాంతిభ‌ద్ర‌త‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అక్క‌డి ప్ర‌భుత్వం వారికి శాశ్వత నివాస ప‌త్రాన్ని (ప‌ర్మెనెంట్ రెసిడెన్స్ స‌ర్టిఫికెట్‌-పీఆర్సీ) ఎప్పుడూ జారీ చేయ‌లేదు. ఇటీవ‌ల త‌న వైఖ‌రిని మార్చుకుంది. స్థానికులు కాక‌పోయిన‌ప్ప‌టికీ.. ద‌శాబ్దాలుగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో నివ‌సిస్తున్న కొన్ని తెగ‌లు, కులాల ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌త నివాస ప‌త్రాన్ని జారీ చేయాల‌ని నిర్ణయించుకుంది. దీనికోసం ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. పీఆర్సీపై అధ్య‌య‌నం చేసిన ఆ ప్యానెల్ కొన్ని సిఫార‌సుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది. ఈ సిఫార‌సుల‌ను అరుణాచ‌ల్ కు చెందిన తెగ‌లు, కులాల వారు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మూడురోజులుగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. శుక్ర‌వారం నుంచీ ఈ ఆదోళ‌న‌లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

50 కార్ల‌ను త‌గుల‌బెట్టిన ఆందోళ‌న‌కారులు

50 కార్ల‌ను త‌గుల‌బెట్టిన ఆందోళ‌న‌కారులు

శుక్ర‌వారం చెల‌రేగిన హింసలో అనేక వాహ‌నాలు ఆందోళ‌న‌కారుల ఆగ్ర‌హానికి గుర‌య్యాయి. సుమారు 50 కార్ల‌కు వార్లు మంట‌లు అంటించారు. ఇటా న‌గ‌ర్ లో ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్ప‌డ్డారు. ఓ సినీ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డానికి వ‌చ్చిన నాగాలాండ్ మ్యూజిక్ బ్యాండ్ క‌ళాకారులు ప్ర‌యాణిస్తున్న కారుపై దాడి చేశారు. సంగీత ప‌రిక‌రాల‌ను కాల్చి ప‌క్క‌న ప‌డేశారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. శ‌నివారం సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రితో మాట్లాడారు. అయిన‌ప్ప‌టికీ.. అక్క‌డి ప‌రిస్థితులు అదుపులోకి రాలేదు. పైగా మ‌రింత విష‌మించాయి.

ఆదివారం ఉద‌యం ఆందోళ‌న కారులు పెద్ద ఎత్తున రోడ్ల‌పైకి వ‌చ్చారు. ఉప ముఖ్య‌మంత్రి వ్య‌క్తిగ‌త బంగ‌ళాపైకి మూకుమ్మ‌డి దాడి చేశారు. పెట్రోలు, కిరోసిన్ క్యాన్ల‌ను త‌మ వెంట తీసుకెళ్లారు. పెట్రోలు పోసి, బంగళాకు నిప్పు పెట్టారు. ఆవ‌ర‌ణ‌లో నిలిపి ఉంచిన వాహ‌నాల‌ను త‌గుల‌బెట్టారు. విధ్వంసానికి దిగారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంట‌ర్‌నెట్ సేవ‌ల‌ను నిలిపివేసింది. ఇటా న‌గ‌ర్‌లో సున్నిత ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ విధించింది.

ఆరు తెగ‌లు, కులాల‌కు పీఆర్సీ

ఆరు తెగ‌లు, కులాల‌కు పీఆర్సీ

అరుణాచ‌ల్ లోని నామ్‌సాయ్‌, ఛాంగ్లాంగ్ జిల్లాల్లో స్థానికేత‌ర తెగ‌లు, కులాల‌కు చెందిన ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో నివ‌సిస్తున్నారు. మొత్తం ఆరు కులాల ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ స్థానికేత‌రులుగా గుర్తించింది. వారికి శాశ్వ‌త చిరునామా ప‌త్రాన్ని అంద‌జేయాల‌ని సిఫార‌సు చేసింది. దీనివ‌ల్ల స్థానికుల‌కు విద్య, ఉపాధి, ఇత‌ర రంగాల్లో అవ‌కాశాలు దెబ్బ‌తింటాయ‌నే ఆందోళ‌న ఉంది. ప్యానెల్ ఇచ్చిన సిఫార‌సుల‌ను తిర‌స్కరిస్తూ స్థానికులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. క్ర‌మంగా అవి రాజుకుని, విధ్వంసానికి దారి తీశాయి. ప‌రిస్థితులు అదుపు త‌ప్పిన వెంట‌నే ఉప ముఖ్య‌మంత్రి, ఆయ‌న కుటుంబీకుల‌ను పోలీసులు నామ్‌సాయ్ జిల్లాకు త‌ర‌లించారు. ఆయ‌న సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఆందోళ‌న‌కారులు ఇటాన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఇంటిని కూడా ముట్ట‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న‌కు గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి కిర‌ణ్ రెజిజు ఇక్క‌డి నుంచే లోక్ స‌భ‌కు ఎన్నిక కావ‌డం గ‌మ‌నార్హం.

English summary
Protesters in Arunachal Pradesh have burnt down the bungalow of Deputy Chief Minister Chowna Mein as anger and unrest continues against the state government in Itanagar. Chowna Mein was moved out from state capital Itanagar and shifted to Namsai district early Sunday morning. Besides this, protesters also torched and vandalised residences of the district commissioner. A superintendent of police-rank officer has also been injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X