"కోటీశ్వరులకు కొత్త నోట్ల డోర్ డెలివరీ.. మోడీని దేవుడు కూడా క్షమించలేడు"
న్యూఢిల్లీ : పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరైన చర్యే అని కొందరు వ్యాఖ్యానిస్తే.. అబ్బే దీనివల్ల ఒరిగేదేమి లేదనేది మరికొందరి అభిప్రాయం. తాజాగా దీనిపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా నోట్ల రద్దు వల్ల ఒరిగిందేమి లేదని తేల్చేశారు.
పెద్ద నగదు నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యులే ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకుల ముందు 'క్యూ'లో నిలుచున్నది సామాన్యులేనని పేర్కొన్నారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినంత మాత్రాన అవినీతి అంతం అయిపోదని, కొత్తగా రూ.2వేల నోటును మార్కెట్లోకి తీసుకొస్తుంటే.. ఇక అవినీతి ఎలా అంతమవుతుందని ప్రశ్నించారు కేజ్రీవాల్.

పెద్ద నగదు నోట్ల రద్దుతో కోటీశ్వరులు, నల్లకుబేరులంతా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని రప్పిస్తానన్న మోడీ.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన రూ.2వేల నోట్లు కోటీశ్వరులకు డోర్ డెలివరీ అయిపోతున్నాయని ఆరోపించారు.
ప్రస్తుతం 680మంది నల్లకుబేరుల జాబితా కేంద్రం వద్ద ఉందని, వీరిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ఎందుకు వెలికితీయలేకపోతున్నారని కేజ్రీవాల్ నిలదీశారు.












Click it and Unblock the Notifications