ఔర్ ఏక్ బార్: ఢిల్లీ నవాబ్ అరవింద్ కేజ్రీవాల్, 62 సీట్లతో ప్రభంజనం, బీజేపీ ఢమాల్, కాంగ్రెస్ ఖతం
కేంద్రంలో ఎన్డీఏ అప్రతిహాత విజయం కంటిన్యూ అయ్యింది. రెండో దఫా కూడా విజయ ఢంకా మోగించింది. కానీ దేశ రాజధాని పరిధిలో గల అసెంబ్లీలో మాత్రం చతికిలపడింది. అవును ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేదు. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేదు. కేవలం 8 సీట్లు మాత్రమే కైవసం చేసుకొంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి విజయదుందుభి మోగించారు. 62 సీట్లు గెలిచి.. బీజేపీ మైండ్ బ్లాంకయ్యేలా చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ నో..
ఎన్నికలకు ముందు బీజేపీ ఏం చెప్పినా ఢిల్లీ ఓటరు విశ్వసించలేదు. కాంగ్రెస్ హామీలను కూడా ఖతరు చేయలేదు. కానీ ఆప్కే మరోసారి పట్టం కట్టారు. 62 సీట్లలో ఆప్ విజయం సాధించిందంటే.. ఆ పార్టీ పట్ల ఢిల్లీ ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారో అర్థమవుతోంది. 2015లో 67 సీట్లలో ఆప్ గెలవగా.. 5 సీట్లు తగ్గాయి. ఆ ఐదు సీట్లను బీజేపీ గెలచుకుంది. అంటే బీజేపీ బలం 3 నుంచి 8కి పెరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత తీసిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ రోజు ఢిల్లీ మాత్రమే కాదు భారతమాత విజయం సాధించిందని కామెంట్ చేశారు.

67 చోట్ల దక్కని డిపాజిట్
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. 67 చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు కోల్పోయారు. వారిలో ఆప్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అల్కా లాంబా కూడా ఉన్నారు. ఆమె చాందినిచౌక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ 24 మంది మహిళలకు టికెట్లు కేటాయించారు. కాంగ్రెస్ 10 మందికి టికెట్ ఇవ్వగా.. వారంత ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేరు. ఆప్ 9 మందికి టికెట్ ఇచ్చింది. అయితే వీరిలో 8 మంది విజయం సాధించారు. ఒక్కరు మాత్రమే ఓడిపోయారు.బీజేపీ ఐదుగురు మహిళలకు టికెట్ ఇచ్చింది.

ఏడుగురు సీఎం అభ్యర్థులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరైన ముందస్తు వ్యుహాంతో వెళ్లలేదనే విమర్శలు వచ్చాయి. ఆ పార్టీ నుంచి ఏడుగురు సీఎం అభ్యర్థులు కనిపించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీకి నేతలు ఉన్నా.. ఢిల్లీలో నడిపించే లీడర్ లేరు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఢిల్లీ ప్రజలు కూడా విశ్వసించారు. కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను నమ్మారు. 20 వేల లీటర్ల మంచి నీరు, మెట్రోలో ఉచిత ప్రయాణం.. తదితర సామాన్య జనాలకు ఉద్దేశించిన హామీలను కేజ్రీవాల్ ఇచ్చారు.

ఆప్ ఆవిర్భావం..
2012 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పేరు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా నెలకొల్పారు. అలా క్రమంగా శక్తిమంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. మరుసటి ఏడాది 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు చెప్పడంతో ఆప్ 28 స్థానాలకు, కాంగ్రెస్ 8 సీట్లతో బయటనుంచి సపోర్ట్ చేయడంతో ప్రభుత్వం కొలువుదీరింది.

2015, 2020లో ప్రభంజనం
2015లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే.. ఆప్ ప్రభంజనం సృష్టించింది. 67 సీట్లు సాధించి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగే షాకిచ్చింది. గత ఎన్నికల్లో 32 సీట్లు సాధించిన బీజేపీ.. కేవలం 3 సీట్లతో సరిపెట్టుకొంది. 2013లో ఆప్‌కు 29.5 శాతం ఓట్లు రాగా.. 2015లో అది 54.3 శాతానికి చేరడం విశేషం. 2020లో కూడా అదేస్థాయిలో విజయం సాధించింది సామాన్యుడి పార్టీ.