వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో సినిమా థియేటర్లలో సందడి: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
థియేటర్లలో మళ్లీ సందడి

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్లలో సందడి పెరుగుతోందని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

కోవిడ్‌ వల్ల దాదాపు ఎనిమిది నెలలకు పైగా ఇంటర్వెల్‌ ప్రకటించిన సినిమా హాళ్లు మెల్లగా తెరుచుకుంటున్నాయి.

రాష్ట్రంలోని మూడు నాలుగు జిల్లాల్లో సగానికి పైగా థియేటర్లు తెరవగా... మిగిలిన జిల్లాల్లో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావటంతో... నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.

దీంతో యాజమాన్యాలు ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ ఏర్పాటు చేస్లూ, భౌతికదూరం, మాస్కుల వంటి నిబంధనలు పాటిస్తూ థియేటర్లను తెరుస్తున్నారు.

మొదట పాత సినిమాలతో వీటిని తెరవగా... తాజాగా కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రేక్షకుల సంఖ్య కూడా ఏరోజుకారోజు పెరుగుతూనే వస్తోంది.

కొత్త సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లు హౌస్‌ఫుల్‌ కూడా కావడం గమనార్హం. సంక్రాంతికి మరిన్ని కొత్త సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేటర్లకు పూర్తిస్థాయిలో వస్తారని, అప్పటికి థియేటర్లన్నీ తెరుచుకుంటాయని యజమానులు చెబుతున్నారని పత్రిక చెప్పింది.

కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ, వైఎస్సార్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో థియేటర్లు తెరుచుకున్నాయి. మిగతా జిల్లాల్లో ఇలా తెరచుకున్న థియేటర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇది రోజూ పెరుగుతూ ఉండటం సినీ రంగానికి ఊరటనిస్తోందని సాక్షి వివరించింది.

దళిత కుటుంబాల బహిష్కరణ

24 దళిత కుటుంబాల బహిష్కరణ

తెలంగాణలో దళిత కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక వార్త ప్రచురించింది.

గ్రామంలో రెండు నెలల క్రితం దసరా రోజున ఓ వేడుకను అడ్డుకున్నారనే నెపంతో ఊర్లోని 24 దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ విధించారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ఎస్సారెస్పీ పునరావాస గ్రామమైన సంగెం శ్రీరాంపూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామంలో ఏటా దసరారోజు అక్కడి ప్రధాన చౌరస్తాలో ఊరంతా కలిసి మహిషాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

గత అక్టోబరు 25న దసరా రోజు ఎప్పటిలాగే నిర్వహించ తలపెట్టారు. ఆ సమీపంలోనే అంబేడ్కర్‌ విగ్రహం ఉన్నందున, వేరే చోట నిర్వహించాలని గ్రామంలోని కొందరు దళిత యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కొంత వాగ్వాదం జరిగింది. పోలీసులొచ్చి ఇరువర్గాలను సముదాయించి వేడుకను పూర్తి చేయించారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఈ వ్యవహారంపై మరుసటి రోజు గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు సమావేశమయ్యారు. తమను ధిక్కరించి మహిషాసుర వధ కార్యక్రమానికి అడ్డు వచ్చారని 24 దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ విధించారు.

వీడీసీ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే రూ.10 వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి రెండు నెలలుగా దళిత కుటుంబాలు నివాసం ఉంటున్న కాలనీకి పాలు, ఇతర నిత్యావసర వస్తువుల అమ్మకందారులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పత్రిక రాసింది.

ఈ వ్యవహారంపై ఈ నెల 20న పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు వీడీసీ సభ్యులు 18 మందిపై మల్లాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వారిని అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమ సమస్య పరిష్కరించాలని, సాంఘిక బహిష్కరణ నుంచి తమకు విముక్తి కల్పించాలని బాధితులు కోరుతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

హై స్పీడ్ రైల్

జాతీయ రహదారుల పక్కనే ఎలివేటెడ్ హై-స్పీడ్ రైలు

జాతీయ రహదారుల వెంట పిల్లర్లపై హై స్పీడ్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ తాజాగా ప్రతిపాదనలు చేసినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

ముంబయి-పుణె-హైదరాబాద్‌ సహా హైస్పీడ్‌ కారిడార్ల విషయంలో రైల్వేశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రాజెక్టులను కొత్తగా భూమి సేకరించి కాకుండా ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది.

జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్‌ రైల్‌ ప్లాన్‌) ముసాయిదాను కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రైల్వేశాఖ అందులో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేసింది. ముంబయి-హైదరాబాద్‌తో పాటు మొత్తం ఏడు కొత్త హైస్పీడ్‌ కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొంది.

హైస్పీడ్‌ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. గంటకు 320-350 కిమీ వేగంతో ప్రయాణించేలా హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టును రైల్వేశాఖ తీసుకువస్తోందని పత్రిక రాసింది.

ఇంత వేగంగా రైళ్లు ప్రయాణం చేయాలంటే.. దాన్ని తట్టుకునేలా ప్రత్యేకమైన ట్రాక్‌ ఉండాలి. అంటే ప్రస్తుత మార్గంలో ఉన్న ట్రాక్‌ కాకుండా కొత్తది నిర్మించాల్సి ఉంటుంది. దీనికి పెద్దమొత్తంలో భూసేకరణ చేయాల్సి ఉంటుంది.

ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్య భూసేకరణే. ఇప్పటివరకు 68శాతమే భూసేకరణ జరిగింది.

ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ కొత్త హైస్పీడ్‌ కారిడార్లను జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించిందని ఈనాడు వివరించంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రికను సీఎం సతీమణి పెళ్లికూతురుగా ముస్తాబు చేశారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూషకు పెళ్లి కానుక‌గా సీఎం స‌తీమ‌ణి శోభ‌మ్మ అరుదైన బ‌హుమ‌తిని అంద‌జేశారు.

ఆదివారం ప్ర‌త్యూష‌ను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి శోభ‌మ్మ హాజ‌రై ప్ర‌త్యూష‌కు ప‌ట్టువ‌స్ర్తాలు, వ‌జ్రాల నెక్లెస్ బ‌హుక‌రించి ఆశీర్వ‌దించారు.

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌లో అధికారులు ప్రత్యూషను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు.

సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ప్ర‌త్యూష వివాహం జ‌ర‌గ‌నుందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
As theatres reopen noise begins in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X