తుఫాను ఎఫెక్ట్: ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, సముద్రంలో కల్లోలం, తెలంగాణలోనూ వానలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలతోపాటు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వర్షాలు
మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కాగా, శుక్రవారం హైదరాబాద్లో ఒకటి రెండు చోట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని శాలిగౌరారంలో(2.2సెం.మీ) వర్షం నమోదైంది. మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కురిసన వర్షాలతో పండించిన ధాన్యం నీట మునగడంతో రైతులు భారీగా నష్టపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరున్నారు.

తుఫానుగా వాయుగుండం.. ఏపీ తీరాన్ని తాకి..
ఇది ఇలావుండగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వచ్చే 24 గంటల్లో ఇది తుఫానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరింత వాయువ్యంగా ప్రయాణించి సోమవారం ఉదయానికి కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుందని తెలిపారు. మే 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశమార్చుకుని ఈశాన్యం వైపునకు వెళ్లేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

అసన్ తుఫానుతో ఏపీలో భారీ వర్షాలు, సముద్రంలో కల్లోలం
ఈ తుఫాను ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇక వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో అత్యంత వేగంగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం కూడా కల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ఈ తుఫాను ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ ఉండనుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని శాతావరణ శాఖ తెలిపింది.