విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పూసపాటి అశోక్ గజపతిరాజు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఆరంభం నుంచీ ఆ పార్టీలో ఉంటూ పార్టీతోపాటుగా ఆ ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు.

రాజవంశం నుంచి వచ్చిన ఆయన, సుదీర్ఘ కాలంగా సాగిస్తున్న తన రాజకీయ ప్రయాణం గురించి ఏమంటున్నారు?

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఆయన అభిప్రాయం ఏంటి?

పూసపాటి వంశంలో వివాదాల గురించి ఆయన ఏం చెబుతున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల చుట్టూ తిరుగుతున్న రాజకీయాల విషయంలో ఆయన స్పందన ఏంటి?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునేందుకు బీబీసీ తెలుగు ఆయన్ను ఇంటర్యూ చేసింది. ఆయన ఏం చెప్పారంటే...

మీరు తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచీ ఉన్నారు. పార్టీ పెట్టినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది?

ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎత్తుపల్లాలు తప్పవు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాల ప్రకారమే నడుచుకోవాలి. అధికారంలోకి వచ్చే రోజులుంటాయి. పొగొట్టుకునే రోజులుంటాయి. అయితే ఆయా పాత్రలు పోషిస్తూ ముందుకు వెళ్లాలి.

టీడీపీని ప్రారంభించి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. ఇంతకాలం ప్రజాసేవలోనే ఉంటూ దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగింది. చట్టాల్ని, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడంలో పార్టీ చాలా కృషి చేసింది.

కానీ, విజయనగర రాజకీయాలు మాత్రం అంతఃపురంలోనే జరుగుతాయని, ప్రజలతో సంబంధం లేకుండా అక్కడే ఏ నిర్ణయమైనా తీసుకుంటారని అంటుంటారు. దీనిపై మీ కామెంట్...

ఇలాంటివి చాలా వస్తుంటాయి. నేను మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు... నన్ను చూసి రాజకీయాలంటే కోటలో తిరగడం కాదు... బయటకి వెళ్తే కుక్కలు కూడా కరుస్తాయని అనేవారు.

అయితే ఇప్పటి వరకూ నేను 10 ఎన్నికల్లో పోటీ చేసి... 8 సార్లు గెలిచాను. ఓడినప్పుడూ గెలిచినప్పుడూ నన్ను ఏ కుక్కా కరవలేదు (నవ్వుతూ...). ఆరోపణలు చేసేవారు చాలా చేస్తుంటారు. వాటన్నింటికీ సమాధానం మనం చెప్పనవసరం లేదు.

అశోక్ గజపతిరాజు

ప్రసిద్ధ రాజవంశం నుంచి వచ్చి...సుదీర్ఘ రాజకీయ జీవితంలో గెలుపు, ఓటములు చూశారు. ప్రస్తుతం కుటుంబ వివాదాలు, రాజకీయ వివాదాలు, ఆలయ ఛైర్మన్ పదవులు కోల్పోవడం...ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది.?

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే... రాష్ట్రాలతోపాటు ప్రజలూ కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం నాది కూడా అదే పరిస్థితి.

రామతీర్థం సంఘటనలో నన్ను తొలగించారు. ఇలాంటివి రాష్ట్రంలో చాలా జరిగాయి. వాటిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

అసలు ఈ దాడులు చూస్తుంటే వ్యవస్థని బలహీనపరిచి... తమ మాటకి తిరుగులేకుండా చేసుకోవాలని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటివి చూడాల్సి వస్తుందని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు.

క్రికెట్ స్కోర్ పెరుగుతున్నట్లు...ఆలయాలపై దాడుల సంఖ్య పెరుగుతోంది.

అసలు ఆలయాలపై ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయని, ఎవరు చేయిస్తున్నారని అనుకుంటున్నారు?

నాకైతే ఇది హిందూ మతంపై దాడనే అనిపిస్తోంది.

సింహాచలంలో భూముల వివాదం పేరుతో మరో మనిషిని తెచ్చిపెట్టారు.

16 నెలలు జైలులో ఉండి బెయిల్ పై వచ్చిన వారు ఆలయ ఛైర్మన్లను నిర్ణయిస్తారు.

సింహాచలానికి చెందిన 500 ఎకరాలు భూములను తీసుకుని వేరేచోట ఇస్తామని చెప్తున్నారు.

ఇదంతా చూస్తుంటే బ్రిటిష్ వారి ఈస్టిండియా కంపెనీ కూడా ఇంత మోసం భారతదేశంలో చేయలేదని నేను కచ్చితంగా చెప్పగలను.

అసలు ఆలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా...ప్రభుత్వానికి తెలియదంటే నేను నమ్మను.

ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అది అన్ని మతాలనూ గౌరవించాలి. అది జరగడంలేదని నాకు అనిపిస్తోంది.

రామతీర్థం, సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ వివాదాలపై మీరు ఏమనుకుంటున్నారు?

నాకు చాలా బాధగా ఉంది. రాజ్యంగం, చట్టాలు అమలు కావడం లేదు. మా కుటుంబాన్ని కొన్నింటికి దూరం చేయాలని చూస్తున్నారు. నన్ను ఛైర్మన్ పదవుల నుంచి తొలగించారు.

అది సరే. కానీ మా వంశస్థులు నిర్మించిన రామతీర్థం విగ్రహాల పునర్నిర్మాణానికి చెక్ పంపిస్తే... దానిని తిరిగి పంపించేశారు.

తిరుపతి, సింహాచలం ఇలా ఏ దేవాలయంలోనైనా కార్యక్రమాలకు భక్తులు ఇచ్చే విరాళాలు స్వీకరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం తిరిగి పంపించేశారు. దాన్ని ఏమనుకోవాలి?

సంచయిత

అశోక్ గజపతిరాజును రాజకీయంగా ఎదుర్కోవడం కోసమే సంచయిత గజపతిరాజును తెర మీదకు తీసుకుని వచ్చారని అనుకుంటున్నారా?

ఆమె ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ప్రతి విషయానికీ మమ్మల్ని ఎందుకు తిడుతున్నారో నాకైతే అర్థం కావడంలేదు.

మన రాష్ట్రమంత్రులు ప్రస్తుతం వాడుతున్న భాషని... ఆమె మా అన్నయ్యగారిపై ఒకసారి వాడితే ఆయనకు మనసు విరిగి ఆమెతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని మాకు చెప్పారు. అప్పట్నుంచి ఆమెతో ఏ సంబంధం లేదు.

జీవితంలో ఒక్కసారే ఆమె ఇక్కడికి వచ్చారు. అది కూడా మా అన్నయ్యగారు చనిపోయినప్పుడు మాత్రమే. అప్పుడు కూడా మూడు రోజుల తరువాత వెళ్లిపోయారు.

తన తండ్రిగా ట్విటర్‌లో ఒకరి పేరును, బయట మరొకరి పేరును ఆమె చెబుతుంటారు. అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా పెట్టడంలో ప్రభుత్వ అంతర్యం ఏమిటో?

కుటుంబంలో ఉంటే ఆచారాలు పాటించాలి. కానీ వాటిని పాటించడంలేదు. పండగ సమయంలో కోట నుంచి సవతి తల్లిని అవమానించి పంపించేశారు.

పూసపాటి వంశ వారసురాలిగా సంచయితని మీరు గుర్తిస్తున్నారా?

మా అన్నయ్యగారు ఆమెతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని మాకు చెప్పారు. దానికే మేం కట్టుబడి ఉన్నాం.

ఆమెకు ఏమైనా ఆస్తి రావాలేమో... దానికి మా అన్నయ్య గారి కుటుంబంతో మాట్లాడుకోవాలి.

సంచయిత విషయంలో కానీ... జిల్లాలో పార్టీ వివాదాల్లో కానీ... అశోక్ గజపతిరాజు ఉదాసీనంగా ఉండటం వలనే సమస్యలు పెద్దవైపోతున్నాయా?

పార్టీ వేరు, వ్యక్తులు వేరు. కాకపోతే పార్టీని ఒక కుటుంబంలా చూడాలి. కుటుంబమైనా, పార్టీలోనైనా సమస్యలుంటాయి. వాటిని పరిష్కరించే క్రమంలో కుటుంబ, పార్టీ నియమావళికి తగ్గట్టుగా అందరం పని చేయాలి.

అటువంటి సమస్యల్లో కొన్నిసార్లు ఆలస్యంగా స్పందించారని అనుకుంటారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరూ పని చేయకూడదు.

ట్రస్టు

''మా రాజు గారు మంచోరే కానీ... సమస్య వస్తే స్పందించడమే ఆలస్యం చేస్తుంటారు. అందరితోనూ కనెక్ట్ కారు’’ అని విజయనగరం ప్రజలు, పార్టీ కార్యకర్తల్లో కొందరు అంటారు. దీనికేమంటారు?

కరెక్టే. మేం అందరితోనూ కనెక్ట్ కాం. కొందరితో కనెక్ట్ అవుతాం.

పోలీస్ స్టేషన్లకి వచ్చి మాట్లాడమంటారు. జేబులు కత్తిరించేవాళ్ల కోసం వచ్చి మాట్లాడమంటే అది చేయలేం. ధర్మం, న్యాయం ఉంటే అశోక్ గజపతిరాజుగా పోలీస్ స్టేషన్‌కే కాదు ఎక్కడికైనా వెళ్తా.

ఆరోపణలు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. వారికి కావాలసిన పని చేయలేదంటే... 'మీరు ఎందుకు పనికిరారు’ అని నా ముఖంపైనే ఎందరో చెప్పారు.

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో పార్టీ బలహీనపడడానికి కారణాలేంటి?

ఒకటి... టీడీపీలో టీం వర్క్ లోపించడం. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూసుకుంటే టీడీపీతో ప్రజలు ఉన్నారనే విషయం అర్థమవుతోంది. కానీ అంతా కలిసి పనిచేయలేకపోవడంతో సీట్లు గెల్చుకోలేకపోయాం.

రెండోది... వాల్మీకి దొంగ నుంచి మహర్షిగా మారినట్లు...జగన్ కూడా మారతాడని ప్రజలు భావించి అవకాశం ఇచ్చారు. కానీ దాని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం. ముందే ఈ విషయం తెలుసుంటే ప్రజలు అవకాశం ఇచ్చేవారు కాదు.

నా కూతురికి వివాహం చేయాలని అనుకుంటే చెడ్డవ్యక్తిని పట్టుకురాను కదా. ఓటింగ్ సమయంలో ప్రజలు కూడా అలాగే ఆలోచించాలి. ఇది ఒక బాధ్యతగా ప్రతి పౌరుడూ స్వీకరించాలి.

రాజకీయాల్లో హుందాతనం ఉందంటారా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది?

రాజకీయాలు దిగజారాయి. అవి దిగజారినంత మాత్రాన మనం దిగజారనవసరం లేదు.

నాపై మంత్రులు వాడిన భాష 'ఒక రకం'గా ఉందని నేను కూడా అదే భాష మాట్లాడలేను.

రామతీర్థం ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం నాపై అసభ్యమైన భాష వాడారు. నాపై వాడిన భాషను వదిలేసి సమస్యపైనే ఫోకస్ చేయమని పార్టీ శ్రేణులకు చెప్పాను.

చంద్రబాబు నాయుడు టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురాగలరా? లేదంటే ఆయనలో ఏదైనా మారాల్సిన అవసరం ఉందా?

మార్పు అనేది నిరంతర ప్రక్రియ. చంద్రబాబుపై ప్రజలకి నమ్మకం ఉంది. కచ్చితంగా టీడీపీని మళ్లీ అధికారంలో తీసుకుని వస్తారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయింది. అదే ఆయన పనితనానికి నిదర్శనం. మనందరికి మంచి భవిష్యత్తు ఉండాలి. అలాంటి భవిష్యత్తుని అందించే నాయకత్వం టీడీపీదే. మా పార్టీ జాతీయ భావాలతో ఉన్న ప్రాంతీయ పార్టీ.

లోకేష్ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ అంగీకరించే పరిస్థితి ఉందా?

నాయకుడు, నాయకత్వం అనేవి ఆపద సమయాల నుంచి పుడతాయి. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

అధికారంలో ఉంటే అందరూ జై కొడతారు. అధికారం లేకపోతే తిట్టేవారు ఉంటారు.

ఇప్పుడు పరీక్షా సమయం. పార్టీ కోసం కష్టపడాలి. ప్రస్తుతం లోకేష్ అదే పని చేస్తున్నారు. సమయం వచ్చినప్పడు ఆయనకు ఎన్ని మార్కులు ఇవ్వొచ్చో చెబుతాను.

నారా లోకేష్

మీ వారసుల్ని రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్నారా?

రాజకీయంలో వారసత్వం ఉండదు. మేం వారసులం కాబట్టి మాకు అవకాశాలు ఇవ్వండి అంటే ప్రజలు ఇవ్వరు. వారసులుగా వస్తే ఎంట్రీ ఈజీ కానీ...గ్రౌండ్ లో నిలబడం కష్టం.

రాజకీయాల్లో నిలదొక్కకోవాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. నా కూతురు రాజకీయాల్లోకి వచ్చారు. కష్టపడితేనే మనుగడ ఉంటుంది. లేకపోతే ప్రజలు చెత్తబుట్టలో వేసేస్తారు. అదే విషయాన్ని ఆమెకు కూడా సూచించాను.

ఏం చేసినా పార్టీకి, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకుని రావొద్దని చెప్పాను. అలా చేస్తే నేనే రాజకీయాల నుంచి తప్పుకోమని చెబుతాను.

ఒకప్పుడు వైరి పక్షాలైన బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు ... ఇప్పుడు రాజకీయంగా జత కలిసినా విజయనగరంలో పార్టీ బలపడకపోవడానికి కారణం?

ప్రపంచవ్యాప్తంగా అప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రెంచ్ వారి రాజకీయాల కోసం బొబ్బిలి, విజయనగరం రాజులు ఒకరిపై ఒకరు కత్తిదూసి యుద్ధాలు చేసిన మాట వాస్తవం. అది మా మధ్య వైరం కాదు. అప్పటి పరిస్థితుల్లో ఇరువురూ వేర్వేరు పక్షాలుగా ఉండి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దాంతో మేం శత్రవులం అని అంతా అనుకుంటారు.

అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం రాజకీయంగా కలిసే పని చేస్తున్నాం. భవిష్యత్తులో మంచి ఫలితాలు కూడా కలిసే తీసుకుని వస్తాం.

చరిత్రలో జరిగిన తప్పులను ఇప్పుడు పునరావృతం కానివ్వకుండా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ashok Gajapati Raju Interview: 'Values should not go low since politics have lost values'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X