
ప్రజలను విభజించటంలో కాంగ్రెస్ తో సహా - దానికి పాక్ ఉగ్రవాదులే కారణం : ఆజాద్ కీలక వ్యాఖ్యలు..!!
ప్రజలను రాజకీయ పార్టీలు పలు అంశాల పైన విభజిస్తున్నాయని..అందులో తన పార్టీ కాంగ్రెస్ తో సహా ఎవరూ మినహాయింపు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని స్పష్టం చేసారు. ప్రజలను కులం..మతం వంటి అంశాలతో విభజన రాజకీయలను చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసారు. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రతీరోజు 24 గంటలూ ప్రజలను విభజించే పనిలోనే రాజకీయ పార్టీలు నిమగ్నం అయ్యాయంటూ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా ఏ పార్టీని విస్మరించలేనని చెప్పుకొచ్చారు. తాను వ్యక్తిగతంగా ఏ పార్టీని క్షమించలేనని చెప్పారు. పౌరులు అంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కులం..మతం చూడకుండా అందరికీ సమాన న్యాయం అందాల్సిన అవసరం ఉందని ఆజాద్ ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్లో 1990లో జరిగిన దానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని చెబుతూ.. ఆ పరిస్థితు కారణంగా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కశ్మీర్ పండిట్ వర్గాలు తీవ్రంగా ఎదుర్కొన్నాయని వివరించారు. మహాత్మాగాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది అంటూ ఆజాద్ కీర్తించారు.

ఇక, రాజకీయంగానూ ఆజాద్ ఇప్పుడు కాంగ్రెస్ పరిణామాల్లో కీలకంగా మారారు. జీ 23 నేతల సమావేశాల తరువాత సోనియాను కలిసిన ఆజాద్ పార్టీలో సంస్కరణల అవసరాన్ని వివరించారు. దీంతో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సైతం కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ..పీసీసీ స్థాయిలో మార్పులు చేర్పులకు సిద్దం అవుతున్నట్లుగా చెబుతున్నారు. త్వరలోనే మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..పాటుగా 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే విధంగా పార్టీని సిద్దం చేసే విధంగా కార్యచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఆజాద్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.