ఎక్స్పెక్ట్ చేసింది వేరు.. రియాలిటీ వేరు.. కస్టమర్లకు జియో మార్ట్ షాక్..
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇటీవలే ప్రారంభించిన జియో మార్ట్ సేవలపై కస్టమర్లు పెదవి విరుస్తున్నారు. వస్తు నాణ్యతలోనూ,డెలివరీలోనూ జియో మార్ట్ సేవలు అత్యంత పేలవంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు, కొంతమంది కస్టమర్లు మరోసారి జియో మార్ట్ జోలికి వెళ్లమని ఖరాఖండిగా చెబుతున్నారు.ఇలాంటి నాసిరకం సేవలతో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లతో జియో మార్ట్ పోటీ పడటం అసాధ్యం అంటున్నారు. దీనికి సంబంధించి జాతీయ మీడియా స్క్రోల్ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
పురుగులు,కుళ్లిన కూరగాయలు..
జాతీయ మీడియా కథనం ప్రకారం.. జూన్ 2న ముంబై నివాసి ఒకరు జియో మార్ట్ నుంచి కొన్ని కూరగాయలు ఆర్డర్ చేశారు. ఇంటికొచ్చిన ఆ ప్యాక్‌ను తెరిచి చూడగా.. బెండకాయలపై గొంగళి పురుగులు పాకుతూ కనిపించాయి. వంకాయలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. నిజానికి ఆమె జియో మార్ట్‌లో ఆన్లైన్ గ్రాసరీ ఆర్డర్ చేసి అప్పటికే కొన్నిరోజులు గడిచిపోయింది. పోనీ ఆలస్యంగా వచ్చినా.. ఫ్రెష్ ఐటెమ్స్ ఉంటాయనుకున్నారు గానీ.. కుళ్లిపోయిన కూరగాయాలను చూసి షాక్ తిన్నారు. అంతేకాదు,రూ.3వేలు బిల్లు చేస్తే.. కేవలం రూ.1000 విలువైన వస్తువులనే మాత్రమే డెలివరీ చేశారు.
డర్టీ.. శుభ్రత లేదంటున్న కస్టమర్స్..
'ఈ సమయంలో(కోవిడ్ 19) బిగ్ బాస్కెట్ డెలివరీ చేసే కూరగాయలు కూడా అంత తాజాగా ఉండట్లేదు. కానీ అవి జియో మార్ట్‌లో వచ్చినంత దారుణంగా ఏమీ లేవు. జియో మార్ట్ డెలివరీ చేసిన టెట్రా మిల్క్ ప్యాకెట్స్ అత్యంత అద్వాన్నంగా ఉన్నాయి. ఎక్కడో బురదలో నుంచి తీసి డైరెక్ట్‌గా బ్యాగ్‌లో పెట్టినట్టుగా ఉంది.' అని ఓ కస్టమర్ పేర్కొన్నారు. జియో మార్ట్ డెలివరీ చేసిన వస్తువులన్నింటినీ తాను రెండుసార్లు శుభ్రపరచాల్సి వచ్చిందన్నారు. ఈ అనుభవంతో ఇంకెప్పుడూ ఇక జియో మార్ట్‌లో ఆర్డర్ చేయవద్దనుకుంటున్నానని చెప్పారు.

ఎక్స్పెక్ట్ చేసింది వేరు.. రియాలిటీ వేరు...
దేశంలోనే అపర కుబేరుడైన అనిల్ అంబానీ,అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌తో కలిసి లాంచ్ చేసిన జియో మార్ట్ సేవలు అద్భుతంగా ఉంటాయని కస్టమర్లు భావించారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్దమైన అనుభవాన్ని చవిచూస్తున్నామని కస్టమర్లు వాపోతున్నారు. సోషల్ మీడియాలోనూ పలువురు నెటిజన్స్ జియో మార్ట్ సేవలు ఎంత పేలవంగా ఉన్నాయో పోస్టుల ద్వారా కంపెనీ దృష్టికి తీసుకెళ్తున్నారు. 'మే 26వ తేదీకి కావాల్సిన వస్తువుల కోసం మే 24న జియో మార్ట్‌లో ఆర్డర్ చేశాను. కానీ ఆర్డర్‌ను వాయిదా వేస్తున్నట్టు మెయిల్ వచ్చింది. నాలుగు రోజులు గడిచిపోయినా ఇప్పటికీ డెలివరీ అవలేదు. తీరా చూస్తే ఆర్డర్ హిస్టరీలో ఇప్పుడా ఆర్డర్ కూడా కనిపించట్లేదు.' అని ఓ నెటిజెన్ వాపోయారు.
నెటిజన్స్ ఫిర్యాదులు..
మరో నెటిజన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'ఇదిగో నిత్యావసరాలను జియో మార్ట్ ఇలా సప్లై చేస్తోంది. ఎంత అపరిశుభ్రంగా ఉంది ఇది. కనీసం డెలివరీ బాయ్స్ కూడా మాస్కులు ధరించట్లేదు. కస్టమర్ సర్వీస్ టీమ్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించట్లేదు. ఇంకోసారి జియో మార్ట్‌లో నేను ఆర్డర్ చేయను' అని వాపోయారు. ఇక మరో నెటిజన్.. 'కనీసం ఇప్పటికైనా జియో మార్ట్ కాస్త మంచి యూఐ డిజైనర్స్(యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్)ను నియమించుకోవాలి. ఇంత పేలవమైన సైట్‌తో అమెజాన్‌తో పోటీనా..?' అని కామెంట్ చేశారు.

దీర్ఘ కాలంలో నిలదొక్కుకుంటుందంటున్న నిపుణులు
ఆరంభంలో జియో మార్ట్ సేవలపై నెగటివ్ రివ్యూలు వచ్చినంత మాత్రాన దీర్ఘ కాలంలో వారి వ్యాపారంపై అది ప్రభావం చూపించకపోవచ్చునని టెక్సాస్ కేంద్రంగా పనిచేసే ఓ కన్సల్టెన్సీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ యుగాల్ జోషీ పేర్కొన్నారు. రిలయన్స్ గ్రూప్‌కు ఉన్న సామర్థ్యం,డబ్బు దీర్ఘ కాలంలో వారిని ఈ వ్యాపారంలో నిలదొక్కుకునేలా చేస్తుందన్నారు. కాగా,ఏప్రిల్ 22న లాంచ్ చేసిన జియో మార్ట్‌లో ఫేస్ బుక్ 5.7బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. మే 31 వరకు దేశంలోని 200 నగరాలకు జియోమార్ట్ సేవలను విస్తరించారు.