'యోగి కంటే రావణుడి పాలన 100 రెట్లు బెటర్... ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది క్రిమినల్సే...'
ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో బీజేపీ నేత ధీరేంద్ర ప్రతాప్ ఓ వ్యక్తిని కాల్చి చంపాడు. రేషన్ షాపుల కేటాయింపుకు సంబంధించి తలెత్తిన ఓ వివాదంలో ఎమ్మెల్యే అతనిపై కాల్పులు జరిపాడు. సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్,పోలీసుల ఎదుటే ఎమ్మెల్యే కాల్పులకు పాల్పడటం గమనార్హం. ఇప్పటికే హత్యలు,అత్యాచారాలు,గ్యాంగ్స్టర్స్ మాఫియా తదితర నేర సంఘటనలతో మారుమోగుతున్న ఉత్తరప్రదేశ్ పేరు... తాజా ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా... దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగింది...
బలియా జిల్లాలోని దుర్జన్పూర్ గ్రామంలో గురువారం(అక్టోబర్ 15) రేషన్ షాపుల కేటాయింపుకు సంబంధించి పంచాయతీ భవన్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఇక సమావేశాన్ని కొనసాగించడం కుదరదని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సురేష్ పాల్ తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో స్వయం సహాయక బృందాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో బీజేపీ నేత ధీరేంద్ర ప్రతాప్ సింగ్ ఒక్కసారిగా తన్ గన్ బయటకు తీసి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 46 ఏళ్ల జై ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి చనిపోయాడు.

ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు : బీజేపీ ఎమ్మెల్యే
కాల్పుల ఘటన గురించి తెలియగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బలియా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్(SDM)తో పాటు సర్కిల్ పోలీస్ ఆఫీసర్‌పై వేటు వేశారు. నిందితుడైన బీజేపీ నేత ధీరేంద్రపై కూడా చర్యలకు ఆదేశించారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్ సోదరుడు కూడా ఉన్నాడు. మొత్తం 20-28 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఇదే ఘటనపై ఎమ్మెల్యే సురేందర్ సింగ్ శుక్రవారం(అక్టోబర్ 16) మీడియాతో మాట్లాడుతూ...ఆత్మరక్షణలో భాగంగానే తమ పార్టీ నేత ధీరేంద్ర ప్రతాప్ సింగ్ కాల్పులు జరిపినట్లు చెప్పారు.

గ్రామంలో భారీగా పోలీసులు...
కేవలం వన్ సైడ్ వెర్షన్ ఆధారంగా ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌పై చర్యలు తీసుకోవద్దని ఎమ్మెల్యే సురేందర్ సింగ్ పోలీసులను కోరారు. అంతేకాదు,ఒకవేళ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ కాల్పులు జరిపి ఉండకపోతే అతని కుటుంబ సభ్యులను చంపేసి ఉండేవారని పేర్కొన్నారు. అయితే కాల్పులు జరిపినవాళ్లను శిక్షించాల్సిందేనని... అదే సమయంలో రాళ్లు,కర్రలతో దాడులకు పాల్పడ్డవారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం శాంతి భద్రతల రీత్యా దుర్జన్పూర్ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యోగి కంటే రావణుడి పాలన ఉత్తమం...
బలియా కాల్పుల ఘటనను సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా ఖండించింది. అధికారంలో ఉన్నవాళ్లే శాంతి భద్రతలకు బహిరంగ సవాల్ విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్,పోలీసుల ముందే ఓ బీజేపీ నేత ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి హతమార్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. పోలీసుల కళ్ల ముందే కాల్పులు జరిపి అతను పారిపోయాడని ఆరోపించింది. అసలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని క్రిమినల్సే నడిపిస్తున్నారని... నిన్నటి ఘటనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఎస్పీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ గూండాలు అధికారుల కళ్లెదుటే ప్రజలను హత్య చేస్తున్నారని ఆరోపించారు. యోగి కంటే రావణ రాజు పాలన 100 రెట్లు ఉత్తమం అని పేర్కొన్నారు. ప్రభుత్వం క్రిమినల్స్‌తో చేతులు కలపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.