• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై నిషేధం - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|
మాస్కు ధరించిన యువతి

కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై ఏప్రిల్‌ 30 వరకు ప్రభుత్వం నిషేధం విధించిందని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.

ప్రజలు గుమిగూడటం, ఒకేచోట చేరడంపైనా ఆంక్షలు విధించింది. షబ్‌-ఏ-రాత్‌, హోలి, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే, రంజాన్‌ తదితర మతపరమైన కార్యక్రమాల సందర్భంగా బహిరంగంగా ఎలాంటి ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించరాదని వెల్లడించింది.

బహిరంగ స్థలాలు, పార్కుల్లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొంది.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ కచ్చితంగా ధరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మాస్క్‌ల ధారణను నిక్కచ్చిగా అమలు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

జనం సంచరించే బహిరంగ ప్రాంతాలు, పని చేసే ప్రదేశాలతో పాటు ప్రజారవాణాలోనూ ఈ నిబంధనను పాటించాల్సిందేనని పేర్కొన్నారు.

ఉత్సవాలు, ఊరేగింపులపై నిషేధం, మాస్క్‌ల ధారణ నిబంధనలను పాటించని పక్షంలో 2005 విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు, ఐపీసీలోని 188 సెక్షన్‌, ఇతర చట్టాల ప్రకారం చర్య తీసుకోవాలన్నారని ఈ వార్తలో రాశారు.

తెలంగాణ ఆలయాలు

ఇకపై దేవాలయాల ప్రసాదాలు నేరుగా ఇంటికే..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను భక్తుల దగ్గరకు నేరుగా చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసిన‌ట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

ఇందుకోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. త‌పాలశాఖ ద్వారా ఇంటికే దేవుళ్ళ ప్రసాదాలు, మొబైల్ యాప్ ద్వారా పూజ సేవ‌లను శ‌నివారం అర‌ణ్య భ‌వ‌న్‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ‌లోని 10 ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌లో రాష్ట్రంలో ఎక్కడికైనా పంపే విధంగా పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చ‌కున్నామ‌న్నారు.

ప్రసాదం (డ్రై పూట్స్) హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు నేరుగా ఏ పోస్ట్ ఆపీసుకైనా వెళ్లి బుక్ చేసుకోవ‌చ్చని తెలిపారు. పోస్ట్ ఆఫీసులో భక్తులు తమకు నచ్చిన గుడిలో ప్ర‌సాదాల‌కు రుసుం చెల్లిస్తే వారి పేరిట ప్రసాదాలను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తార‌ని పేర్కొన్నారు.

ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో భక్తుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తార‌ని వివ‌రించారు. దేశ వ్యాప్తంగా 1.60 ల‌క్ష‌ల పోస్టాఫీసుల ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు.

దీంతో పాటు ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్‌లను కూడా త‌పాల శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్న‌ట్లు తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్‌లో పూజ‌ సేవ‌ల‌ను బుక్ చేసుకోలేని వారికోసం పోస్ట్ ఆఫీసులో ఆఫ్ లైన్ ద్వారా ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

యాదాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహాస్వామి దేవాస్థానం, భ‌ద్ర‌చ‌లం శ్రీ సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యం, వేముల‌వాడ -శ్రీరాజ‌రాజేశ్వ‌ర ‌స్వామి ఆల‌యం, బాస‌ర శ్రీ జ్ఞాన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి దేవ‌స్థానం, కొండ‌గ‌ట్టు అంజ‌నేయస్వామి టెంపుల్, కొముర‌వెల్లి మ‌ల్లికార్జునస్వామి ఆల‌యం, ఉజ్జ‌యిని మ‌హాంకాళీ ఆల‌యం, సికింద్రాబాద్ గ‌ణేష్ టెంపుల్, బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌- పోచమ్మ టెంపుల్‌, కర్మాన్‌ఘాట్ హ‌నుమాన్ దేవాల‌యంలో ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

అదేవిధంగా దేవస్థానాల్లో జరుగు నిత్య ఆర్జిత సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేని భక్తులు అన్ని సేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఆన్ లైన్ సేవ‌ల‌ను విస్త‌రిస్తున్నామ‌ని తెలిపారు.

దేవాదాయశాఖలోని మ‌రో 15 ఆల‌యాల్లో ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే 22 ప్రసిద్ధ ఆల‌య సేవ‌ల‌ను మొబైల్ యాప్ (ట్ ఆప్ప్ Fఒలిఒ”) ద్వారా ఆన్ లైన్‌లో అందుబాటులోకి తెచ్చామన్నారు. అన్ని సేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఈ మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చని చెప్పారని ఈ కథనంలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ స్కూళ్లు

కోవిడ్ కేసులు వచ్చిన విద్యా సంస్థలను మూసేయండి..

కోవిడ్ కేసులు వచ్చిన విద్యా సంస్థలను వెంటనే మూసివేయించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులను ఆదేశించారని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఈ విషయంపై ప్రతి రోజూ రిపోర్టు తీసుకుని సమీక్షిస్తామని తెలిపారు. మాస్క్‌లు లేకుండా విద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు మాస్క్‌లు అందించాలన్నారు.

విద్యార్థులకు థర్మల్‌ స్కానింగ్‌ తప్పకుండా చేయాలన్నారు. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

శనివారం విజయవాడలో కోవిడ్‌ స్థితిగతులపై అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేశ్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ విజృంభణతో గత విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించలేకపోయామన్నారు. అందరి సహకారంతో ఈ విద్యా సంవత్సరాన్ని కొంతమేర కాపాడుకోగలిగామని చెప్పారు. ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోవడం ద్వారా అకడమిక్‌ క్యాలెండర్‌ను గాడిలో పెట్టామని తెలిపారు.

దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు మన రాష్ట్రంలో చేశామని తెలిపారు. కొవిడ్‌ మళ్లీ పుంజుకుంటోందని, ఈ రెండు నెలలు అత్యంత క్లిష్టమైనవని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి స్కూల్‌కు ఎస్‌ఓపీ ఏర్పాటు చేసి, దాన్ని పక్కాగా పాటించాలన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామన్నారు. కోవిడ్‌పై ఎవరూ అసత్య కథనాలు ప్రసారం చేయవద్దని కోరారు.

రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ కాలేజీలో 168 మందికి కరోనా సోకిందని తెలిపారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు పెంచుతామని చెప్పారు.

ఆదివారాలు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని, కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సురేశ్‌ తెలిపినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

హిందీ

2021 జనగణన వాయిదా

కోవిడ్‌–19 వల్ల జనగణన–2021, సంబంధిత పనులు వాయిదా పడ్డాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం తెలిపిందని సాక్షి కథనంలో పేర్కొన్నారు.

రాష్ట్రాలవారీగా జనగణన–2021 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయాలంటూ విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్‌ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.

దీనికి సమాధానమిచ్చిన రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం జనగణనకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. కొత్త తేదీలను నిర్ణయించలేదని వివరించింది.

జనగణన–2021 కోసం 2010 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ 31 వరకు ఉన్న మ్యాపింగ్‌ను, సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అయితే కోవిడ్‌–19 వల్ల జనగణన వాయిదా పడిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో మార్చి 31, 2021 వరకు ఈ తేదీని పొడిగించామని జనగణన పూర్తయ్యే వరకు మ్యాపింగ్, సరిహద్దుల్లో మార్పులు చేయొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించిందని తెలిపినట్లు ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ban on public festivals and processions in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X