bangladesh india kolkata mamata banerjee sourav ganguly బంగ్లాదేశ్ షేక్ హసీనా భారత్ కోల్‌కతా మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీ
కోల్‌కతాలో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ : భారత్‌కు చేరుకున్న బంగ్లా ప్రధాని హసీన
కోల్‌కతా: భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఇండియా-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్‌కతాకు చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆమె కోల్‌కతా విమానాశ్రయంకు చేరుకున్నారు. శుక్రవారం రోజున ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఇండియా బంగ్లాదేశ్ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ టెస్టుమ్యాచ్‌లో తొలిసారిగా పింక్ బాల్‌ను వినియోగిస్తున్నారు. ఏడేళ్ల క్రితమే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఐసీసీ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు భారత్ ఒక్క డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాలో గతేడాది ఆడాల్సి ఉన్నప్పటికీ భారత్ ఇందుకు తిరస్కరించింది.
విమానాశ్రయంలో షేక్ హసీనాకు గంగూలీ స్వాగతం
ఇండియా - బంగ్లాదేశ్‌ల మధ్య జరగనున్న తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత్‌కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనాను కోల్‌కతా విమానాశ్రయంలో టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే మ్యాచ్‌ను వీక్షించేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా కోల్‌కతాకు చేరుకున్నారు. టాస్కు ముందు ఆర్మీకి చెందిన పారాట్రూపర్లు టాస్ కంటే ముందు ఇరు జట్ల కెప్టెన్లకు పింక్ బాల్ అందివ్వనున్నారు. దీని తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు గంట మోగించి అధికారికంగా మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. మ్యాచ్ సందర్భంగా షేక్ హసీనా , ఇతర మమతా బెనర్జీలు చిన్నపాటి సమావేశంలో పాల్గొంటారని సమాచారం.

కోల్‌కతాలో జరగనున్న 12వ డే నైట్ టెస్టు మ్యాచ్
ఇక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ సంగతి విషయానికొస్తే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాల మధ్య 2015లో జరిగింది. ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ మొత్తంగా చూసుకుంటే 12వది కావడం విశేషం. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు చేపట్టడం.. టీమిండియా సైతం డే నైట్ టెస్ట్ ఆడతామని అంగీకరించడంతో అతి తక్కువ సమయంలో ఈ డే నైట్ టెస్ట్‌కు ఈడెన్ గార్డెన్స్ ముస్తాబైంది. నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు క్యాబ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మ్యాచ్ టైమింగ్స్ ఇవీ..
భారత్‌లో తొలిసారిగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న 9, 10వ టెస్టు జట్లుగా ఇండియా బంగ్లాదేశ్‌లు నిలుస్తాయి. ఇక ఈ సూపర్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న కోల్‌కతా నగరమంతా గులాబీమయమైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం 40 నిమిషాల తర్వాత సెకండ్ సెషన్ 3:40 గంటలకు ప్రారంభమై 5:40 గంటల వరకు సాగుతుంది. అనంతరం 20 నిమిషాల టీ బ్రేక్ ఉంటుంది. ఇక చివరి సెషన్ 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగడంతో ఆ రోజుకు ఆట ముగుస్తుంది.

కోల్‌కతాలో భారీ భద్రత..
భారత్-బంగ్లాదేశ్ చారిత్రాత్మక డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇక, హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. డే నైట్ టెస్టుకు సంబంధించిన మొదటి మూడు రోజుల టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం బెంగాల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు పోలీసులు.