తన కూతురు మృతే చివరిది కావాలి: స్టాలిన్‌తో శుభశ్రీ తల్లిదండ్రులు
తమిళనాడు: సెప్టెంబర్ 12న క్రితం చెన్నైరోడ్డుపై ఓ రాజకీయపార్టీకి సంబంధించిన బ్యానర్ గాలికి తెగి అటుగా ద్విచక్రవాహనంలో వస్తున్న మహిళా టెక్కీపై పడటంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై తమిళనాడు భగ్గుమంది. ఇక మృతురాలు శుభశ్రీ కుటుంబ సభ్యులను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అంతేకాదు తమ పార్టీ తరపున రూ.5 లక్షలు అందజేశారు.

వారు చెప్పిన మాటలు మరవలేను: స్టాలిన్
శుభశ్రీ తల్లిదండ్రులను కలిసి తన సానుభూతి తెలిపినట్లు స్టాలిన్ తెలిపారు.ఇక బ్యానర్ల బారిన పడి మృతి చెందడం ఇదే చివరి ఘటనగా ఉండాలని శుభశ్రీ తల్లిదండ్రులు తనతో అన్న మాటలు మరువలేనివని స్టాలిన్ అన్నారు. ఈ బ్యానర్ల కల్చర్‌ను ఎత్తివేయాలని ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని స్టాలిన్‌ను కోరారు శుభశ్రీ తల్లిదండ్రులు. బ్యానర్లను తొలగించాలని ఆమేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు స్టాలిన్ తెలిపారు. శుభశ్రీ మృతితో చాలామంది సెలబ్రిటీలు, ఇతర రాజకీయనాయకులు బ్యానర్ల సంస్కృతికి గుడ్‌బై చెబుతామని ప్రతిజ్ఞ చేశారు.

హైకోర్టు చెప్పినా మాట వినని ప్రభుత్వం
అన్నాడీఎంకే అత్యుత్సాహం నిర్లక్ష్యంతో కోయంబతూర్‌లో ఓ తమ్ముడిని కోల్పోయామని ఇప్పుడు ఓ సోదరిని కోల్పోయామని తెలిపారు. పోలీసుల నుంచి అనుమతి పొందిన తర్వాతే బ్యానర్ల ఏర్పాటు ఉండాలని కొన్నేళ్ల క్రితమే తాను చెప్పినట్లు స్టాలిన్ గుర్తుచేశారు. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పామని గుర్తుచేశారు స్టాలిన్. హైకోర్టు కూడా ఇదివరకే చెప్పిందని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.

మరే తల్లిదండ్రులు ఈ క్షోభను అనుభవించకూడదు
తన కూతురు ట్రాఫిక్ నిబంధనలు పాటించిందని వేగంగా కూడా ద్విచక్రవాహనాన్ని నడపలేదని, హెల్మెట్ కూడా ధరించిందని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. బ్యానర్ల ఏర్పాటు చేసిన బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కూతురు మృతి రోడ్డు ప్రమాదం వల్ల జరిగిందికాదని బ్యానర్ వల్ల జరిగిందని చెప్పారు. తమలా మరో తల్లిదండ్రులు ఇలాంటి వేదనకు గురికాకుండా ఉండాలంటే బ్యానర్ సంస్కృతిని తొలగించాలని వారు పట్టుబట్టారు. ఇదిలా ఉంటే తన కొడుకు వివాహం సందర్భంగా ఈ బ్యానర్లను డివైడర్‌పై పెట్టిన అన్నాడీఎంకే కౌన్సిలర్ జయగోపాల్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు.

బెయిల్‌పై డ్రైవర్ అజ్ఞాతంలో కౌన్సిలర్
బ్యానర్ మీద పడగానే కిందపడ్డ శుభశ్రీపై వెనకాలే వస్తున్న ట్రక్కు వెళ్లడంతో ఆమె మృతి చెందింది. అయితే ట్రక్కు డ్రైవర్ మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు సెయింట్ థామస్ మౌంట్ ట్రాఫిక్ పోలీసులు. ప్రస్తుతం మనోజ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక కౌన్సిలర్‌ను అదుపులోకి తీసుకోగా తనకు గుండె నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!